GHMC: జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్‌ను టార్గెట్‌కు తగిన విధంగా వసూలు చేసుకునేందుకు ఉన్నతాధికారులు వ్యూహం సిద్ధం చేశారు. 2025-26కు సంబంధించి రూ.3 వేల కోట్ల ట్యాక్స్ కలెక్షన్‌ను టార్గెట్‌గా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.1,500 కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నారు. గత ఏప్రిల్ మాసం నుంచి గడిచిన తొమ్మిది నెలల్లో ఐదు శాతం రాయితీతో అమలు చేసిన ఎర్లిబర్డ్ స్కీమ్‌తో కలిపి మొత్తం రూ.1,500 కోట్లు కలెక్షన్ చేసుకోగా, వచ్చే మార్చి నెలాఖరు వరకు ఉన్న కేవలం 80 రోజుల గడువులో రూ.1,500 కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యం అధికారుల ముందుంది. జనవరి నెలలోని 21 రోజులు, ఫిబ్రవరిలోని 28 రోజులతో పాటు మార్చి మాసంలోని 31 రోజులను కలిపి మొత్తం 80 రోజుల్లో రూ. 1,500 కోట్ల మేరకు ట్యాక్స్ కలెక్షన్‌కు అధికారులు స్కెచ్ సిద్దం చేసినట్లు తెలిసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి ముందు రూ.2,200 కోట్ల ట్యాక్స్ కలెక్షన్‌ను టార్గెట్‌గా పెట్టుకోగా, ఆ తర్వాత టార్గెట్‌ను రూ.2,500 కోట్లకు మార్చుకున్నారు.
రూ.1,500 కోట్లు వసూలు
విలీన ప్రతిపాదన తెరపైకి రావడంతోనే 27 పట్టణ స్థానిక సంస్థల ఆదాయం సుమారు రూ.1,860 కోట్ల వరకు ఉండగా, ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్‌ను రూ.3వేల కోట్లకు సవరించారు. విలీన పట్టణ స్థానిక సంస్థల్లో ప్రస్తుతం మ్యానువెల్‌గానే ట్యాక్స్ వసూలు చేస్తుండగా, మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్‌ను ఆన్‌లైన్ చేసే ప్రక్రియ తుది దశలో ఉంది. టార్గెట్ చేరుకునేందుకు ఇంకా మిగిలిన రూ.1,500 కోట్లను వసూలు చేసుకునేందుకు వీలుగా కలెక్షన్ సిబ్బందిగా ఉన్న 145 మంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, మరో 300 పై చిలుకు బిల్ కలెక్టర్లకు డైలీ టార్గెట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పాటు ఇచ్చిన టార్గెట్ మేరకు పన్ను వసూలు చేస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
Also Read: MLA Mallareddy: కాంగ్రెస్ ప్రభుత్వం పై మల్లారెడ్డి ఫైర్.. తనదైన శైలిలో సవాళ్లు విసిరిన ఎమ్మెల్యే..?
అధిక మొత్తంలో బకాయి
దీనికి తోడు మొండి బకాయిల వసూళ్ల కోసం ఇప్పటికే అమల్లోకి వచ్చిన వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్ ) స్కీమ్‌ను మరింత పకడ్బందీగా అమలు చేసే దిశగా కూడా సిబ్బందిపై ఒత్తిడి తేవాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. మొండి బకాయిలు భారీగా పేరుకుపోయిన బకాయి దారులను గుర్తించి, బకాయి ఉన్న మొత్తం ట్యాక్స్ ప్రాతిపదికన వసూళ్ల బాధ్యతలను సర్కిల్, జోన్లకు అప్పగించాలని కూడా అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. అధిక మొత్తంలో బకాయి పడిన ఆస్తుల యజమానులను నేరుగా డిప్యూటీ కమిషనర్లు కలిసి ట్యాక్స్ వసూలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని త్వరలోనే కమిషనర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఓటీఎస్ స్కీమ్ ప్రకారం మొండి బకాయిల వడ్డీని సుమారు 90 శాతం మాఫీ చేస్తున్నందున, ఈ విషయంపై బకాయి దారులకు అవగాహన కల్పించి, పన్ను వసూలు చేసే బాధ్యతలను ట్యాక్స్ ఇన్ స్పెక్టర్, బిల్ కలెక్టర్లకు ఇప్పటికే అప్పగించినా, ఇకపై రొటీన్ ట్యాక్స్ కలెక్షన్‌తో పాటు ఓటీఎస్ స్కీమ్ కింద కలెక్షన్ చేసిన పన్ను వివరాలను కూడా ట్యాక్స్ స్టాఫ్ నివేదిక రూపంలో సమర్పించాలని సూచించనున్నట్లు సమాచారం.
మార్చి నెల కలెక్షన్‌పైనే ఆశలు
ప్రతి ఆర్థిక సంవత్సరం మొత్తం 12 నెలల పాటు ట్యాక్స్ కలెక్షన్ జరుగుతున్నా, ఆర్థిక మాసం చివరి నెల అయిన మార్చి మాసంలో వచ్చే కలెక్షన్ పైనే అధికారులు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. పన్నెండు నెలల్లో డిసెంబర్ వరకు తొమ్మిది నెలల పాటు కలెక్షన్ రొటీన్ గానే సాగుతుండగా, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోని కలెక్షన్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. రానున్న 80 రోజుల్లో వసూలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్న రూ.1,500 కోట్లలో సింహా భాగం సుమారు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు ఒక్క మార్చి నెలలోనే వసూలయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ సారి పట్టణ స్థానిక సంస్థలు విలీనమైనందున టార్గెట్‌గా పెట్టుకుని రూ.3 వేల కోట్లను దాటి ట్యాక్స్ కలెక్షన్ ఉండాలని ఇప్పటికే స్టాఫ్‌కు అధికారులు సూచించినట్లు సమాచారం.

