MLA Mallareddy: బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy) అధికార కాంగ్రెస్(Congress) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. శనివారం మేడ్చల్ జిహెచ్ఎంసి పరిధిలోని కేఎల్ఆర్ వెంచర్లు మాజీ కోఆప్షన్ మెంబర్ బిఆర్ఎస్ నాయకులు నవీన్ రెడ్డి(Naveen Reddy) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీకి మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
రియల్ ఎస్టేట్ రంగం
ప్రజా సమస్యలను పక్కన పెట్టి పాలకులు రాజకీయ లాభాలకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు నిత్యం విద్యుత్ కోతలు, తాగునీటి ఎద్దడి వంటి కనీస వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రజలు సమస్యల మధ్య జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాల్సిన బదులు మరింత దిగజారుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మల్లారెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా వ్యాపార రంగం, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం కోల్పోయిందని, దీని ప్రభావం ఉపాధి అవకాశాలపై పడుతోందని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు.
Also Read: BRS Party: మరో కొత్త కార్యక్రమానికి తెరలేపిన గులాబీ పార్టీ.. త్వరలో ప్రారంభం..?
రాజకీయాలకు అతీతంగా సేవా..
ఆడపడుచులకు ఆర్థిక భద్రత, గౌరవం కల్పించే విధంగా పథకాలు రూపొందించి అమలు చేశామని తెలిపారు. బీఆర్‌ఎస్(BRS) పాలనలో తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకెళ్లిందని అన్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం, భోజన వసతి, నాణ్యమైన ఉన్నత విద్య అందిస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, ప్రజాసేవే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు తన శైలిలో సవాల్ విసిరారు. ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజ్ మల్లారెడ్డి, మోహన్ రెడ్డి, భాస్కర్ యాదవ్, బాబు యాదవ్, దయానంద్ యాదవ్, విట్టల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Meenakshi Natarajan: సర్పంచ్ ఎన్నికలపై మీనాక్షి స్క్రీనింగ్.. మున్సిపోల్‌కు ముందస్తు జాగ్రత్తలు!

