Meenakshi Natarajan: ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల(సర్పంచ్) ఎన్నికలపై ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) స్క్రీనింగ్ మొదలు పెట్టారు. గత కొన్ని రోజుల నుంచి ఆమెకు వరుసగా ఫిర్యాదుల వస్తున్న నేపథ్యంలో ఎంక్వయిరీకి సిద్ధమయ్యారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల సొంత గ్రామాలు, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఓటమి పాలవడంపై సీరియస్‌గా తీసుకున్నారు. విజయం సాధించాల్సిన చోట అనూహ్యంగా ఓటములు ఎదురుకావడంపై ఆమె ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో తనకు వచ్చిన ఫిర్యాదులపై ఎంక్వయిరీ మొదలు పెట్టారు.
ఎందుకు ఓడిపోయారు?
కాంగ్రెస్ మద్దతుదారులు ఎందుకు ఓడిపోయారు? మంత్రులు, ఎమ్మెల్యేల సపోర్ట్ లభించలేదా? రెబల్స్‌ను ప్రోత్సహించారా? క్షేత్రస్థాయి క్యాడర్ సహకరించలేదా? అభ్యర్థిలో లోపాలు ఉన్నాయా? వంటి అంశాలపై నేరుగా ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ స్టడీ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండతో పాటు మెదక్ జిల్లాలోనూ కొన్ని చోట్ల సమన్వయం లోపించినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత సమన్వయం కోసం మీనాక్షితోపాటు, ఏఐసీసీ సెక్రెటరీలు ఆయా జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. మున్నిపల్ ఎన్నికల్లో నష్టం జరగకుండా ముందస్తుగానే పార్టీలోని సమస్యలను చెక్ పెట్టాలని భావిస్తున్నారు. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలోనూ కొందరు డీసీసీల పని తీరు మార్చుకోవాలని మీనాక్షి సున్నితంగానే హెచ్చరించినట్లు తెలిసింది.
Also Read: Meenakshi Natarajan: లోకల్ బాడీ ఎన్నికలకు నిఘా కమిటీలు? ముఖ్య నాయకులతో మీనాక్షి ఇంటర్నల్ మీటింగ్
గ్రౌండ్ లీడర్ల ఫిర్యాదులు
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై క్షేత్రస్థాయి నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. టికెట్ల కేటాయింపులో జరిగిన పొరపాట్లు, నేతల మధ్య సమన్వయ లోపం కారణంగానే అనేక చోట్ల స్వతంత్ర అభ్యర్థులు, ప్రతిపక్షాలు పైచేయి సాధించాయని పీసీసీకి నివేదికలు అందాయి. ఈ ఫలితాలపై లోతైన విచారణ జరపాలని డిమాండ్ పెరుగుతున్నది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో పార్టీ వెనుకబడడాన్ని కూడా అధిష్టానం సీరియస్‌గా తీసుకోవాల్సి వచ్చింది. సొంత ఊరిలోనే పట్టు కోల్పోయిన నేతల జాబితాను ఏఐసీసీ సిద్ధం చేస్తున్నది. గ్రూపు రాజకీయాల వల్ల పార్టీ నష్టపోతున్నదని, కష్టపడిన వారికి గుర్తింపు లభించడం లేదని పలు జిల్లాల నేతలు బహిరంగంగానే ఫిర్యాదులు చేశారు.
కొత్త నేతల మధ్య నెలకొన్న విభేదాలు
ముఖ్యంగా పాత, కొత్త నేతల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయని నేతలు వాపోతున్నారు. పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ముఖ్య నేత ఝాన్సీ రెడ్డి తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అదే నియోజకవర్గానికి చెందిన తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ రెడ్డి, తొర్రూరు మాజీ ఏఎంసీ చైర్మన్ అనుమాండ్ల నరేందర్ రెడ్డిలు మీనాక్షికి ఫిర్యాదు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి 48 వేల ఓట్ల మెజార్టీ వస్తే, స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలలో నియోజకవర్గంలో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి 2 వేల ఓట్ల మెజార్టీ వచ్చిందనే విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
పరిస్థితి చేయి దాటకుండా సమన్వయ కమిటీలు
ఇలాంటి సమస్యలను వెంటనే చెక్ పెట్టాలని మీనాక్షి అండ్ టీమ్ రంగంలోకి దిగింది. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. ఈ టీమ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ సేకరించనున్నది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండాలని హైకమాండ్ హెచ్చరించింది. దీనిలో భాగంగానే జిల్లాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, టికెట్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని నిర్ణయించారు.
Also Read: Meenakshi Natarajan: తెలంగాణలో ఏఐసీసీ టాస్క్ ఇదే.. అక్టోబర్ 15 నాటికి పూర్తి చేసేలా టార్గెట్!

