GHMC: భాగ్యనగర పౌర సేవల వేదిక జీహెచ్ఎంసీలో పాలక మండలికి, అధికారులకు మధ్య ‘టేబుల్ ఐటమ్స్’ (ముందస్తు సమాచారం లేని ప్రతిపాదనలు) వ్యవహారం చిచ్చు రేపింది. గత కొంతకాలంగా విభాగాధిపతులు అనుసరిస్తున్న తీరుపై మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22న జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశం రద్దు కావడానికి తెర వెనుక పెద్ద కారణమే ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణంగా అజెండాలోని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడం కమిటీ విధి. కానీ, అధికారులు అజెండాలో పొందుపరచకుండా చివరి నిమిషంలో 14 కీలక ప్రతిపాదనలను ‘టేబుల్ ఐటమ్స్’గా తీసుకురావడంపై మేయర్ సీరియస్ అయ్యారు. ముందస్తు సమాచారం లేకుండా, సభ్యులకు అవగాహన కల్పించకుండా కోట్లాది రూపాయల పనులకు సంబంధించిన ఫైళ్లను ఆమోదించుకోవాలని చూడటంపై ఆమె మండిపడ్డారు.
Also Read: Realme Neo 8 Mobile: రియల్‌మీ నుంచి పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవడం పక్కా!
తీరు మారని విభాగాధిపతులు
కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ, హెచ్ఓడీల పనితీరులో మార్పు రాకపోవడం గమనార్హం. కమిషనర్‌కు కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా కమిటీ ముందుకు ప్రతిపాదనలు తేవడాన్ని పాలక పక్షంతో పాటు ఎంఐఎం సభ్యులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. “అధికారులు తమ ఇష్టానుసారంగా ప్రతిపాదనలు పెడితే మేము ఎలా సంతకాలు చేస్తాం? వాటిపై మాకు కనీస అవగాహన ఉండాలి కదా?” అని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం, ఏదైనా ప్రతిపాదన కమిటీ ముందుకు రావాలంటే నిర్ణీత సమయానికి ముందే సభ్యులకు సమాచారం అందాలి. కానీ అత్యవసర పనుల పేరుతో అధికారులు ‘టేబుల్ అజెండా’ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Vegetable Prices: కొండెక్కుతున్న కూరగాయల ధరలు.. ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

