GHMC: రాష్ట్ర ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ మధ్య ఏర్పడిన సమన్వయలోపం ఎమర్జెన్సీ సర్వీసుల మెయింటనెన్స్ కు గ్రహణంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అందించే పౌర సేవల నిర్వహణలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ చాలా ముఖ్యమైంది. నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్లలో స్ట్రీట్ లైట్లు సక్రమంగా వెలగకపోవటంతో అంధకారం కారణంగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. సిటీలోని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సుమారు 3 లక్షల 70 వేల స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను గడిచిన ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్ ) సంస్థ నిర్వహిస్తూ వచ్చింది.
జీహెచ్ఎంసీ అదే సంస్థకు కొంతకాలం ఆ బాధ్యత
ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను సక్రమంగా నిర్వహించటపోవటంతో ఆ సంస్థను జీహెచ్ఎంసీ తప్పించింది. అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా మెయింటనెన్స్ కష్టతరమవుతుందన్న విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అదే సంస్థకు కొంతకాలం ఆ బాధ్యతలను కొనసాగించి, ఆ తర్వాత నిర్వహణ బాధ్యతలను జోనల్ కమిషనర్లకు అప్పగించింది. కొద్ది నెలల క్రితం స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణ కోసం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టింది. ఢిల్లీ, ఔటర్ రింగ్ రోడ్ స్ట్రీట్ లైట్ల తరహాలో మెరుగైన ఆటోమెటికల్ నిర్వహణ పద్దతి కోసం టెండర్లను ఆహ్వానించగా, స్ట్రీట్ లైట్ల నిర్వహణలో అంతర్జాతీయంగా పేరుగాంచిన క్రాంప్టన్ గ్రీవ్స్, ఫిలిప్స్ వంటి సంస్థలు ముందు రాగా, వీటిలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై క్లారిటీ కోసం జీహెచ్ఎంసీ సుమారు రూ.963 కోట్లతో రూపొందించిన అంచనా ప్రతిపాదనలు సర్కారుకు పంపగా, నెలలు గడుస్తున్నా, నేటికీ ఆ ప్రతిపాదనలు సర్కారు వద్దే పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ నుంచి బదిలీ కోసం అధికారుల ప్రయత్నాలు.. కారణం అదేనా..!
టెండర్ల ప్రక్రియ చేపట్టాలి
కొద్ది రోజుల ముందు జీహెచ్ఎంసీ అధికారులు సచివాలయాన్ని సంప్రదించగా, కేవలం జీహెచ్ఎంసీ పరిధికి మాత్రమే కాకుండా గ్రేటర్ కు బయట, ఔటర్ లోపనున్న 27 అర్బన్ లోకల్ బాడిల పరిధుల్లో ఉన్న స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించి కూడా ప్రతిపాదనలు తయారు చేసి, టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సూచించటంతో స్ట్రీట్ లైట్ల నిర్వహణ కథ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. 27 అర్బన్ లోకల్ బాడిలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు సర్కారు ఈ నెల 25న జరిగిన కౌన్సిల్ సమావేశం ముందు ప్రీయాంబుల్ ప్రతిపాదనలు పంపగా, ఇందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీంతో అధికారులు ప్రస్తుతం లోకల్ బాడిల్లోని స్ట్రీట్ లైట్ల సమాచారాన్ని సేకరించటంలో నిమగ్నమైనట్లు తెలిసింది. విలీన ప్రక్రియ ముగిసే వరకు స్ట్రీట్ లైట్ల నిర్వహణ ప్రతిపాదనలకు మోక్షం కలిగే అవకాశాలు కన్పించటం లేదు.
నిధులిస్తున్నారు..ప్రతిపాదనలు మరుస్తున్నారు
రాష్టంలోనే అత్యధిక జనాభా అవసరాలకు తగిన విధంగా అభివృద్ది, పౌర సేవల నిర్వహణ బాధ్యతలు చేపట్టే అతి పెద్ద స్థానిక సంస్థ జీహెచ్ఎంసీ, సర్కారుకు మధ్య సమన్వయం నిధులిస్తున్నారు ప్రతిపాదనలు మరుస్తున్నారన్న చందంగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత గులాబీ సర్కారు హయాంలో రోడ్ల మెరుగైన నిర్వహణ కోసం కాంప్రహెన్సీవ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) రెండో దశలో భాగంగా అన్ని జోన్లలోని మెయిన్ రోడ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రూ. 2828 కోట్ల అంఛనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలు కూడా ఇంకా సర్కారు వద్దే పెండింగ్ లో ఉన్నాయి.
23 ప్రాజెక్టులకు రూ.7038 కోట్లు
నెలల తరబడి సర్కారు వద్ద ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నందున రోడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత గులాబీ సర్కారుతో పోల్చితే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీకి ఆర్థిక చేయూతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలకు కూడా మోక్షం కల్గిస్తే సిటీలో పలు పౌర సేవల నిర్వహణ మెరుగుపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా పనులు మొదలుకాని హెచ్ సిటీ-1 కింద అయిదు ప్యాకేజీలుగా ప్రతిపాదించిన 23 ప్రాజెక్టులకు రూ.7038 కోట్ల నిధులకు ఏడాది క్రితం ఆగమేఘాలపై పరిపాలనపరమైన మంజూరీనిచ్చిన సర్కారు తన వద్ద పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలు క్లియర్ చేయాలన్న వాదనలున్నాయి.
Also Read: GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటిలో రసాభాస.. బీజేపీ, మజ్లిస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం

