GHMC: ఆర్థిక సంక్షోభంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఇప్పటికే రూ.1500 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.100 కోట్లు అధికం కావడం విశేషం. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రూ.2200 కోట్ల ట్యాక్స్ కలెక్షన్‌ను అధికారులు టార్గెట్‌గా పెట్టుకోగా, లక్ష్యం కన్నా ఎక్కువగా వసూలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రూ.400 కోట్ల ట్యాక్స్ వసూలయ్యే అవకాశం
ఈ ఏడాది మొత్తం వసూళ్లు సుమారు రూ.3 వేల కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ శాఖకు కమర్షియల్ కరెంటు బిల్లులు చెల్లిస్తున్న 73 వేల కమర్షియల్ ఆస్తులను అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులను కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది. దీని ద్వారా అదనంగా సుమారు రూ.400 కోట్ల ట్యాక్స్ వసూలయ్యే అవకాశముంది. ఈ ఆస్తుల ద్వారా వచ్చే ట్యాక్స్ అదనపు కలెక్షన్‌గా పరిగణించనున్నారు.
Also Read: GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ విలీనం.. 27 స్థానిక సంస్థల్లో జీహెచ్ఎంసీ బోర్డులు ఏర్పాటు!
జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్
జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశాల మేరకు, సుమారు 200 బడా మాల్స్‌కు ఆస్తి పన్ను క్రాస్ వెరిఫికేషన్ కోసం ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. అలాగే, మాల్స్‌లోని అన్ని వ్యాపార సంస్థలను ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా కూడా మరింత ఆదాయం సమకూరనుంది. ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనం చేసిన 27 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఆస్తి పన్ను వసూలుపై కూడా అధికారులు దృష్టి సారించారు.
మాన్యువల్‌గా ట్యాక్స్ కలెక్షన్ చేయాలి
ఈ ప్రాంతాల్లోని ప్రాపర్టీ ట్యాక్స్ వివరాలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకురావాలని కమిషనర్ ఐటీ వింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయితే, మార్చి నెల సమీపిస్తుండటంతో, రికార్డులను ఆన్‌లైన్‌లోకి మారుస్తూనే, ప్రస్తుతానికి మాన్యువల్‌గా ట్యాక్స్ కలెక్షన్ చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. విలీన స్థానిక సంస్థల్లో ప్రస్తుతం క్యాపిటల్ రేటు ప్రాతిపదికన ట్యాక్స్ వసూలవుతుండగా, జీహెచ్ఎంసీలో యూనిట్ రేటు ప్రాతిపదికన వసూలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు పాత విధానమే కొనసాగుతుంది. ఆ తర్వాత విధానం మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రోజువారీ టార్గెట్లు
సిబ్బందికి పరిధిలోని సుమారు 13 లక్షల మంది ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నరు. ఇందులో కమర్షియల్ ఆస్తుల సంఖ్య దాదాపు 3 లక్షలకు చేరనుంది. ట్యాక్స్ కలెక్షన్‌ను మరింత పెంచడానికి, త్వరలోనే ట్యాక్స్ సిబ్బందికి రోజువారీ టార్గెట్‌లను ఫిక్స్ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. నెలకు రూ.100 కోట్ల వసూలు లక్ష్యం ఇటీవల రూ.300 కోట్లకు పెంచగా, కొత్తగా గుర్తించిన కమర్షియల్ ప్రాపర్టీలు, విలీన స్థానిక సంస్థల ట్యాక్స్‌తో వసూళ్లు ఈ ఏడాది రూ.3 వేల కోట్లకు చేరుకుంటాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: GHMC merger: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియలో కీలక పరిణామం

