GHMC merger: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీన ప్రక్రియలో (GHMC merger) సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. విలీనానికి సంబంధించి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదించిన ఫైల్ తిరిగి ప్రభుత్వం వద్దకు కూడా చేరింది. ఈ విలీన ప్రక్రియను అధికారికంగా ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఏ క్షణమైనా గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. గెజిట్ విడుదలైన వెంటనే, ఈ 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో అంతర్భాగం అవుతాయి.
జీహెచ్ఎంసీలో మొత్తం 20 మున్సిపాలిటీలు, 7 నగర పాలక సంస్థలను విలీనం చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి (Telangana Cabinet) ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ భేటీలో ఆమోదం ముద్ర కూడా వేసింది. ఈ విలీన ప్రక్రియతో హైదరాబాద్ నగరం మరింతగా విస్తరించనుంది. ఈ విలీనం ద్వారా సేవలు అందించడం, మౌలిక వసతుల కల్పనలో సమన్వయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. విలీనం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ గ్రేటర్ కమిషనర్ పరిధిలోకి వస్తాయని, దీంతో, జీహెచ్ఎంసీ చట్టాల ప్రకారం పాలన సాగుతుందని తెలిపారు. మున్సిపాలిటీల విలీనంతో హైదరాబాద్ మహానగర రూపురేఖలు మరింతగా మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
విలీనం అవుతున్న మున్సిపాలిటీల లిస్ట్ ఇదే
తెలంగాణ కేబినెట్ ఆమోదించిన జాబితా ప్రకారం 27 పట్టణ స్థానిక సంస్థ జీహెచ్ఎంసీలో విలీనం అవుతున్నాయి. ఈ జాబితాలో, 1.పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ 2. జల్‌పల్లి మున్సిపాలిటీ, 3. శంషాబాద్ మున్సిపాలిటీ, 4. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ, 5. మణికొండ మున్సిపాలిటీ, 6. నార్సింగి మున్సిపాలిటీ, 7. ఆదిభట్ల మున్సిపాలిటీ, 8. తుక్కుగూడ మున్సిపాలిటీ, 9. మేడ్చల్ మున్సిపాలిటీ, 10.దమ్మాయిగూడ మున్సిపాలిటీ, 11. నాగారం మున్సిపాలిటీ, 12. పోచారం మున్సిపాలిటీ, 13. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ, 14. గుండ్లపోచంపల్ లిమున్సిపాలిటీ, 15. తూంకుంట మున్సిపాలిటీ, 16. కొంపల్ లిమున్సిపాలిటీ, 17. దుండిగల్ మున్సిపాలిటీ, 18. బొల్లారం మున్సిపాలిటీ, 19. తెల్లాపూర్ మున్సిపాలిటీ, 20. అమీన్‌పూర్ మున్సిపాలిటీ ఉన్నాయి. ఇక, నగర కార్పొరేషన్ల విషయానికి వస్తే, 21. బడంగ్‌పేట నగర పాలక సంస్థ (కార్పొరేషన్), 22.బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ (కార్పొరేషన్), 23. మీర్‌పేట నగర పాలక సంస్థ (కార్పొరేషన్), 24.బోడుప్పల్ నగర పాలక సంస్థ (కార్పొరేషన్), 25. పీర్జాదిగూడ నగర పాలక సంస్థ (కార్పొరేషన్), 26. జవహర్‌నగర్ నగర పాలక సంస్థ (కార్పొరేషన్), 27. నిజాంపేటనగర పాలక సంస్థ (కార్పొరేషన్) ఉన్నాయి. ఈ విలీనం ద్వారా జీహెచ్ఎంసీ పరిధి విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి సుమారు 2,000 చదరపు కిలోమీటర్లకు పైగా పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనాగా ఉంది.
Read Also- New Rule: డిలీట్ చేయడానికి వీలులేకుండా ఫోన్లలో కొత్త యాప్.. తయారీ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు!
