GHMC: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) వరకు విస్తరించిన జీహెచ్ఎంసీ(GHMC) పరిధిని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయటం తధ్యమని అధికార వర్గాల సమాచారం. పరిధి మొత్తాన్ని మూడు కార్పొరేషన్లకు విభజించాలన్న అంశం ప్రాతిపదికనే జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే మూడు కార్పొరేషన్ల ప్రాతిపదికన బదిలీలు, నియామకాలు, అదనపు బాధ్యతలు వంటివి జరుగుతున్నాయి. పునర్ వ్యవస్థీకరణపై శనివారం కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnana) నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో, తమను మూడు జోన్లకు అదనపు కమిషనర్‌గా నియమించారు సరే, ఆ తర్వాత మా పరిస్థితి ఏమిటీ? అని ఓ ఐఏఎస్ ఆఫీసర్ ప్రశ్నించినట్లు సమాచారం. మానిటరింగ్ కోసం కేటాయించిన జోన్లకు ఫైనాన్స్, అడ్మిన్ విభాగాలకు సంబంధించి త్వరలోనే అధికారులను నియమిస్తామని కమిషనర్ బదులిచ్చినట్లు తెలుస్తోంది.
కీలక దశకు..
గత నెల 25న మొదలైన 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వార్డుల డీలిమిటేషన్, జోన్లు, సర్కిళ్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకున్న పునర్ వ్యవస్థీకరణ ప్రస్తుతం అదనపు కమిషనర్ల బదిలీల కీలక దశకు చేరుకుంది. అదనపు కమిషనర్లను బదిలీ చేసే ప్రక్రియను జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్‌తో పాటు అదనపు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిలకు కమిషనర్ కర్ణన్ అప్పగించారు. కొందరు అదనపు కమిషనర్లను జోనల్ కమిషనర్లుగా, ఇపుడున్న జోనల్ కమిషనర్లను అదనపు కమిషనర్లుగా మార్చే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది.
Also Read: Deputy CM Pawan Kalyan: కొండగట్టు అంజన్న సేవలో పవన్ కళ్యాణ్.. టీటీడీ వసతి గృహాలకు శంకుస్థాపన
ఆ ఆఫీసర్లకు 12 జోన్ల బాధ్యతలు
టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి కమిషనర్ చేసిన నియామకాలు మూడు కార్పొరేషన్లను దృష్టిలో పెట్టుకునే జరిగినట్లు స్పష్టమవుతోంది. శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ల బాధ్యతలను చీఫ్ సిటీ ప్లానర్ కే. శ్రీనివాస్‌కు అప్పగించారు. గ్రేటర్ సైబరాబాద్ పరిధిలోకి రానున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి జోన్ల బాధ్యతలను డైరెక్టర్ బి. వెంకన్నకు, గ్రేటర్ మల్కాజ్‌గిరి పరిధిలోని జోన్ల బాధ్యతలను బి. ప్రదీప్ కుమార్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగిసిన తర్వాత ఏర్పడనున్న మూడు కార్పొరేషన్లకు వీరే చీఫ్ సిటీ ప్లానర్లుగా కొనసాగే అవకాశమున్నది.
Also Read: Jetlee Glimpse Out: ‘జెట్లీ’ గ్లింప్స్ వచ్చేశాయ్.. సత్య వేమన పద్యం ఇరగదీశాడుగా..

