GHMC: గ్రేటర్ నగరంలోని కోటిన్నర మందికి అత్యవసర సేవలందించే, రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థ జీహెచ్ఎంసీ(GHMC) భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. మానవత్వం అనే ఉద్యానవనంలో కొన్ని పువ్వులు ప్రకాశవంతంగా వికసిస్తే, మరికొన్ని నిరాదరణ నీడల్లో రాలిపోతుంటాయి. అలాంటి పాలైన పువ్వులకు నేనున్నానంటూ అక్కున చేర్చుకుంది జీహెచ్ఎంసీ. ట్రాన్స్ జెండర్ల(Transgender) కూడా ఎలాంటి ఆదరణ లేకుండా ఇంతకాలం మరుగున పడిపోగా, వారికి జీహెచ్ఎంసీ సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది. చందానగర్ లైట్ హౌస్ కమ్యూనిటీస్ నైపుణ్యాల కేంద్రంలో 15 రోజుల ఉచిత గ్రాఫిక్ డిజైన్ శిక్షణ(Graphic design training)తో నలుగురు ట్రాన్స్ జెండర్లు మధురాజ్, ఇమ్రాన్ ఖాన్, నవీనా, వరుణ్ తేజ్ లకు వివిధాంశాల్లో శిక్షణనందించి, వారు తమ కాళ్ల మీద తాము నిలబడే చక్కటి అవకాశాన్ని కల్పించింది.
గ్రాఫిక్స్ డిజైన్ రంగంలో
గ్రాఫిక్స్ డిజైన్ రంగంలో ట్రాన్స్ జెండర్ ల నైపుణ్యాలు క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించి, రెడ్ టీవీ ఛానల్(Red TV) యాజమాన్యం ట్రాన్స్ జెండర్లను ఆహ్వానించి, వారికి నెలకు రూ.12 వేల స్టై ఫండ్ కూడా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వేదికగా వారికి మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్.వి.కర్ణన్(RV Karnana) జాబ్ ఆఫర్ లెటర్లు అందజేశారు. వీరితో పాటు మరో 155 మంది ట్రాన్స్ జెండర్లు వారికి నచ్చిన వివిధ రకాల వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా మొత్తం రూ. కోటిన్నర విలువైన రుణాలను కూడా జీహెచ్ఎంసీ మంజూరీ చేయించింది. జీహెచ్ఎంసీ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవ సామాజిక సమానత్వానికి నాంది పలికగా, ఇదే బాటలో మరి కొందరు వారికి సహకరించేందుకు ఆదర్శమైంది.
ఈ ఉద్యోగం మాకు కేవలం ఒక ఉపాధి మాత్రమే కాదు: ట్రాన్స్ జెండర్లు
జీహెచ్ఎంసీ కల్పించిన ఈ ఉద్యోగం తమకు కేవలం ఉపాధి మాత్రమే కాదని, ఇది సమాజంలో గౌరవంతో కూడిన స్వాతంత్ర్యం, స్వావలంబనకు మార్గమని ట్రాన్స్ జెండర్లు సంతృప్తిని వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ మధురాజ్, ఇమ్రాన్ ఖాన్, నవీనా, వరుణ్ తేజ్ తమ హృదయ స్పందనలు తెలిపారు. సమాన హక్కులు, గౌరవం అందని ప్రస్తుత సమాజంలో వీరంటే తీవ్ర వివక్ష ఉన్న సమయంలో, ట్రాన్స్ జెండర్లకు అండగా నిలుస్తూ సమాజంలో వారిపై ఉన్న అభిప్రాయాన్ని తొలగించేందుకు వివక్ష లేని సమాజ నిర్మాణం భిక్ష కాదు – సామాజిక హక్కు అని, ఉపకారం కాదు, ఆదో మార్పు అని వారు తమ మాటల్లో స్పష్టం చేశారు.
Also Read: Nagarjuna Sagar dam: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత