Justice Yashwant Varma: తన నివాసంలో పెద్ద మొత్తం నగదుతో పట్టుబడిన జస్టిస్ యశ్వంత్ వర్మపై (Justice Yashwant Varma) అభిశంసన ప్రక్రియలో లోక్‌సభ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటన చేశారు. న్యాయమూర్తి తొలగింపునకు సంబంధించిన చర్యలు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. లోక్‌సభ ఏర్పాటు చేసిన కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మనీందర్ మోహన్, సీనియర్ అడ్వకేట్ బీవీ ఆచార్య ఉంటారు. జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు మద్దతుగా 146 మంది ఎంపీలు సంతకం చేసిన అభిశంసన తీర్మానాన్ని స్వీకరించినట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ కమిటీ తక్కువ సమయంలోనే తన నివేదికను సమర్పిస్తుందని, ఆ నివేదిక అందేంతవరకు అభిశంసన అంశం పెండింగ్‌లో ఉంటుందని స్పీకర్ వివరించారు.
తర్వాత జరగబోయేది ఏంటి?
ఒక న్యాయమూర్తిని అభిశంసించేందుకు పాటించాల్సిన విధానాన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) వివరిస్తుంది. ఈ నిబంధన ప్రకారం, లోక్‌సభ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సభాపతికి అందజేస్తుంది. స్పీకర్ ఆ నివేదికను సభ ముందు పెడతారు. కాగా, లోక్‌సభ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి కొన్ని అధికారాలు ఉంటాయి. సాక్ష్యాలను తెప్పించుకొని పరిశీలించడం, సాక్షులను ప్రశ్నించడం వంటి అధికారాలు ఉంటాయి. కమిటీ జరిపే విచారణలో న్యాయమూర్తి తప్పు చేసినట్టుగా తేలితే, కమిటీ సమర్పించే నివేదికను సభ పరిగణనలోకి తీసుకుంటుంది. నిబంధనల ప్రకారం, ఒక తీర్మానం ఓటింగ్‌కు వస్తుంది. లోక్‌సభ తర్వాత రాజ్యసభలోనూ ఓటింగ్ జరుగుతుంది. లోక్‌సభ, రాజ్యసభలలో ‘హాజరైన, ఓటింగ్‌లో పాల్గొన్న’’ సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల ఓట్లు అభిశంసనకు అనుకూలంగా పడాలి. ఆ ప్రకారం ఓటింగ్ జరిగితే, న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అభిశంసన వేటు పడుతుంది. ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష కూటములు రెండూ ఒకే మాట మాట్లాడుతున్నాయి. యశ్వంత్ వర్మను తొలగించాలని చెబుతన్న నేపథ్యంలో, ఈ ప్రక్రియ సులభంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also- Coolie film Tickets: సామాన్యులకు దూరమవుతున్న ‘కూలీ’ సినిమా.. బ్లాక్‌లో టికెట్ ఎంతంటే..
ఇప్పటి వరకు అసలేం జరిగింది?
జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మార్చి 14న ఢిల్లీలోని న్యాయమూర్తి వర్మ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో, ఆయన ఇంట్లోని నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాదాపు 1.5 అడుగుల ఎత్తులో నోట్ల కట్టలు కనిపించాయి. ఆ సమయంలో న్యాయమూర్తి ఇంట్లో లేరు. నగదు వెలుగు చూడడంతో ఆయనపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీంతో, సుప్రీంకోర్టు ఆయనను ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే, ఆయన వద్ద ఉన్న న్యాయ విధులన్నింటినీ తొలగించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో అంతర్గతంగా ఒక విచారణ కమిటీను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 55 మంది సాక్షులను విచారించింది. ఆరోపణలకు బలపరిచే తగిన ఆధారాలు ఉన్నాయనే విషయాన్ని కమిటీ నిర్ధారించింది.
Read Also- Coolie film Tickets: సామాన్యులకు దూరమవుతున్న ‘కూలీ’ సినిమా.. బ్లాక్‌లో టికెట్ ఎంతంటే..
నగదు దాచిపెట్టిన గదిపై న్యాయమూర్తి వర్మ, ఆయన కుటుంబసభ్యులకు ప్రత్యక్ష నియంత్రణ ఉందని కమిటీ తేల్చింది. అందుకే ఆయనను తొలగించాలంటూ సిఫార్సు చేసింది. నాటి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి చేసిన ఈ సిఫార్సును జస్టిస్ వర్మ సవాలు చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ పాక్షికంగా జరిగిందని, తాను న్యాయపరంగా అవకాశాన్ని పొందలేదని వాదించారు. కానీ, ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అధికారిక హక్కులకు ఉల్లంఘన జరగలేదని తీర్పులో స్పష్టం చేసింది. దీంతో, సాక్ష్యాల ఆధారంగా జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ లోక్‌సభలో మొదలైంది. లోక్‌సభ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.