Bandi Sanjay: సైబర్ నేరాలకు పాల్పడే నిందితుల సిమ్ కార్డులను తక్షణమే బ్లాక్ చేసే సదుపాయాన్ని జిల్లా ఎస్పీలకు కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి (India Home Ministry) బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. దీంతోపాటు నేర అనుమానితుల కచ్చితమైన లొకేషన్లను, బ్యాంకింగ్, టెలికాం సోర్స్‌ల వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అందించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో హోంశాఖ ఉన్నతాధికారులతో ఇండియన్ సైబర్ క్రైం(Cyber crime) కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో అమల్లోకి తెచ్చిన సమన్వయ్ ప్లాట్‌ఫాం, సైబర్ కమాండో ప్రోగ్రామ్‌పై సోమవారం సమీక్ష నిర్వహించారు. సైబర్ మోసాలు రోజురోజుకూ ఎక్కువైతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై గ్రామ గ్రామాన ప్రజలకు విస్త్రత అవగాహన కల్పించాలని కేంద్ర నిర్ణయించిందన్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
సైబర్ మోసాలపై అవగాహన
ఇందులో భాగంగా తెలంగాణలో త్వరలోనే ఈ అంశంపై ప్రజలకు రాష్ట్రస్థాయిలో ఒక రోజంతా సెమినార్ నిర్వహించనున్నట్లు స్పష్టంచేశారు. సైబర్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న హోంగార్డు మొదలు ఎస్పీ వరకు ఒక్కో జిల్లా నుంచి 10 మంది చొప్పున 33 జిల్లాల నుంచి ఎంపిక చేసి వారికి నిష్ణాతులతో సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆ సెమినార్ అనంతరం శిక్షణ పొందిన పోలీసులు తమ తమ జిల్లాల్లో టీచర్లు, న్యాయవాదులు, ఇంజనీర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు సహా సమాజాన్ని ప్రభావితం చేసే వారిని ఎంపిక చేసి ప్రత్యేకంగా సెమినార్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వారంతా గ్రామ గ్రామానికి వెళ్లి సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం ‘సమన్వయ్ ప్లాట్‌ఫాం’ ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.
పరస్పర సాయం..
సైబర్ నేర అనుమానితుల కచ్చితమైన లొకేషన్లతోపాటు వారు ఉపయోగించే బ్యాంకింగ్, టెలికాం వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు వెంటనే పంపించేందుకు ‘ప్రతిబింబ్ మాడ్యూల్’ ఉపయోగపడుతుందని వివరించారు. ‘సైబర్ క్రైమ్ ఇంటర్‌స్టేట్ అసిస్టెన్స్ రిక్వెస్ట్ మాడ్యూల్’ ద్వారా ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్‌కు సైబర్ క్రైమ్ కేసుల్లో పరస్పర సహాయం అందించవచ్చనని వివరించారు. ఆయా నేరాలకు ఉపయోగించిన సిమ్ కార్డులను, వాడిన ఎలక్ట్రానిక్ పరికరాలను తక్షణమే బ్లాక్ చేసేలా ఎస్పీలకు సదుపాయం కల్పిస్తున్నట్లు బండి వివరించారు. బ్యాంకింగ్ మాడ్యూల్ ద్వారా దర్యాప్తు అధికారులు బ్యాంక్ సీసీటీవీ వీడియోలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు వేగంగా కోరుకుని పొందవచ్చన్నారు.
ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రక్షణ
క్లిష్టమైన కేసుల్లో దర్యాప్తు అధికారులకు సహాయం చేయడానికి, అలాగే విచారణలకు అవసరమైన టూల్స్‌ను అందుబాటులో ఉంచడానికి ప్రత్యేకంగా టెక్నో-లీగల్ సపోర్ట్ సర్వీస్‌ను రూపొందించినట్లు చెప్పారు. అత్యంత నైపుణ్యం కలిగిన పోలీస్ అధికారుల కోర్ టీమ్‌ను తయారు చేయడమే సైబర్ కమాండో ప్రోగ్రాం లక్ష్యమని, ప్రధాని మోదీ దూరదృష్టితో రూపుదిద్దుకున్న కార్యక్రమమని తెలిపారు. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రక్షణకు, సైబర్ సంఘటనల స్పందనకై డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో వీరంతా నిష్ణాతులై ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తొలి బ్యాచ్‌లో 407 మంది కమాండోలు ఎన్ఎఫ్ఎస్ యూ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఆర్ఆర్‌యూల్లో శిక్షణ పొంది ఇప్పటికే వారు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారని వివరించారు. ఈ సంవత్సరం చివర్లో ఇంకో బ్యాచ్ శిక్షణ ప్రారంభించనున్నట్లు సంజయ్ తెలిపారు.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా