GHMC: జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆఫీస్‌ల ఏర్పాట్లలో అధికారులంతా బిజీగా ఉన్నారు. 2 వేల 50 కిలోమీటర్ల విస్తీర్ణం, కోటి 30 లక్షల జనాభాతో ఏర్పడిన జీహెచ్ఎంసీని మున్ముందు మూడు కార్పొరేషన్లుగా చేసేందుకు ఓవైపు అధికారులు, సిబ్బంది నియామకాలు, బదిలీలు, పదోన్నతులు వంటి ప్రక్రియను చేపడుతున్నది. మరో వైపు పెరిగిన జోన్లు, సర్కిళ్లకు తగిన విధంగా ఆఫీసులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ విస్తీర్ణాన్ని 300 వార్డులుగా, 12 జోన్లు, 60 సర్కిళ్లుగా ఏర్పాటు చేసిన అధికారులు ప్రస్తుతం ఉన్న పాత జీహెచ్ఎంసీ పరిధిలోని ఆఫీసులతో పాటు విలీన స్థానిక సంస్థల ఆఫీసుల్లో సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు.
ఆఫీసుల ఏర్పాటులో సమస్యలు
కొత్తగా ఏర్పడిన ఆరు జోన్ల ఆఫీసుల ఏర్పాటు విషయంలోనే అధికారులకు కాస్త సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిసింది. 30 వార్డుల్లో 150 వార్డులతో పాత జీహెచ్ఎంసీ కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 150 వార్డుల్లో 74 వార్డులో ఏర్పాటు కానున్న గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరో 76 వార్డులతో ఏర్పాటు కానున్న గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుల ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిని మూడు గ్రేటర్ కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా, అధికారకంగా ఇంకా ఖరారు కాలేదు. కానీ, మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, వాటి ప్రధాన కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగిలిన రెండు కార్పొరేషన్ల ప్రధాన కార్యాలయ ఏర్పాటుపై అధికారులు ఫుల్ క్లారిటీగా ఉన్నట్లు తెలిసింది.
అప్పటివరకూ తాత్కాలికమే..
150 జోన్లతో శంషాబాద్ వరకు పరిధితో కొనసాగనున్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని అలాగే కొనసాగించాలని భావించిన అధికారులు గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌ను తార్నాకలో ఉన్న హెచ్ఎండీఏ ఆఫీస్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే గోల్కొండ జోన్‌కు సంబంధించిన ఆఫీస్‌ను ఆబిడ్స్‌లోని జీహెచ్ఎంసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయగా, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఆఫీస్ ప్రాంగణాన్ని అన్వేషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శేరిలింగంపల్లిలో ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఇప్పటికే అందులో జోనల్ ఆఫీసుతో పాటు శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎక్కడ ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Ticket Rates: టికెట్ రేట్లు పెంచడంపై తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే?.. నిర్మాతలు సేఫ్..
శాశ్వత ప్రాతిపదికన..
ఫిబ్రవరి 10 వరకు మూడు కార్పొరేషన్లను ప్రకటించే అవకాశం లేకపోవడంతో అప్పటి వరకు ఆఫీస్ ఏర్పాటు కోసం ఓ చక్కటి ప్రాంగణాన్ని వెతికి పట్టుకునే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 12 జోన్లు 60 సర్కిళ్లకు ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్న జీహెచ్ఎంసీ భవనంలో ఫిబ్రవరి 10 తర్వాత మూడు కార్పొరేషన్లను ప్రకటించిన తర్వాత మరిన్ని మార్పులు చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అధికారులు చేపట్టిన పునర్ వ్యవస్థీకరణలో భాగంగా జరుగుతున్న నియామకాలు, ఏర్పాటు చేస్తున్న ఆఫీసులన్నీ కూడా తాత్కాలికమేనని, మూడు గ్రేటర్ కార్పొరేషన్లను ప్రకటించి, సర్కార్ ఆమోద ముద్రపడిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన సర్కిల్స్, జోన్లు, ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కూడా అధికారులు సిద్దం చేసినట్లు తెలిసింది.

