GHMC: దేశంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా అవతరించిన జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్.వి. కర్ణన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో పౌర, అత్యవసర సేవల నిర్వహణ, అభివృద్ధికి సంబంధించి క్షేత్ర స్థాయి కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. పారిశుద్ధ్యం, రోడ్ సేఫ్టీలతో పాటు ఈ-వేస్ట్ సేకరణ, తరలింపుపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఒక వైపు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి సకాలంలో సిటీ నుంచి చెత్తను శివార్లకు తరలించే ప్రక్రియను ముమ్మరం చేయగా, ఇప్పుడు తాజాగా ఈ-వేస్ట్‌ను సేకరించేందుకు నిర్వహిస్తున్న ‘ఈ-వేస్ట్ మెగా శానిటేషన్ డ్రైవ్’ ను ప్రారంభించారు. తొలి రోజు ఈ డ్రైవ్‌ను కమిషనర్ కర్ణన్ బాగ్ లింగంపల్లిలో జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రజలు తమ వద్దనున్న చెత్తను స్వచ్ఛందంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి అప్పగించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, శాస్త్రీయంగా నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. దీన్ని సేకరించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్లు, వాహనాలను ఆయన పరిశీలించారు. ఫీల్డ్ స్థాయి సిబ్బందితో మాట్లాడి, ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక కౌంటర్ల పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read: GHMC Commissioner: గ్రేటర్‌ను పరిశుభ్రతకు కేరాఫ్‌గా మార్చాలి.. రంగంలోకి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్!
తొలిరోజే 48 మెట్రిక్ టన్నుల సేకరణ
పాత, వినియోగంలో లేని ఎలక్ట్రానిక్ వస్తువులను నిర్దేశిత సేకరణ కేంద్రాల్లో అప్పగించి ప్రజలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కమిషనర్ పిలుపునిచ్చారు. అశాస్త్రీయంగా ఈ-వేస్ట్‌ను పారవేయడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని ఆయన సూచించారు. ఈ డ్రైవ్ మంగళవారం కూడా కొనసాగనున్నట్లు ఆయన వెల్లడించారు. ఐటీ ప్రాంతాలు, ఎలక్ట్రానిక్ షాప్‌లు అధికంగా ఉన్న ప్రదేశాలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. ఇప్పటికే జోనల్, డిప్యూటీ కమిషనర్‌లు క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ-వేస్ట్‌ను ఇష్టారాజ్యంగా పారవేయడం వల్ల వచ్చే అనర్ధాలను వివరించి ప్రజలను చైతన్య పరిచినట్లు ఆయన వెల్లడించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా తొలి రోజైన సోమవారం 48 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జీహెచ్ఎంసీ సేకరించినట్లు ఆయన తెలిపారు. వేస్ట్ సేకరణకు తొలిరోజు జీహెచ్ఎంసీ పరిధి వ్యాప్తంగా 271 ప్రాంతాలలో 94 వాహనాలను వినియోగించినట్లు, సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నట్లు ఆయన వివరించారు.
ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్
గడిచిన 12 రోజుల నుంచి జీహెచ్ఎంసీ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 12 రోజుల్లో 4,445 మెట్రిక్ టన్నుల అదనపు వ్యర్థాలను తరలించినట్లు వెల్లడించారు. 12వ రోజు గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను సెల్ఫీ పాయింట్‌లుగా తీర్చిదిద్దడంపై ఫోకస్‌తో సోమవారం ఈ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. 12 రోజుల్లో బల్దియా పరిధిలోని 300 వార్డులలోనీ మొత్తం 2,803 ఏరియాలు, పాయింట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు, పార్క్‌లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టగా, ఇప్పటి వరకు అదనంగా 3289 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు, 1156 మెట్రిక్ టన్ను మేరకు నిర్మాణ వ్యర్థాలతో కలిపి మొత్తం 4,445 మెట్రిక్ టన్నుల అదనపు వ్యర్థాల తరలింపు చేపట్టినట్లు తెలిపారు. ఈ రెండు రకాల డ్రైవ్‌లను జోనల్ కమిషనర్లు, సర్కిల్ స్థాయి డిప్యూటీ కమిషనర్లు సైతం ఎప్పటికపుడు మానిటరింగ్ చేస్తూ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు, సలహాలు జారీ చేశారు.
Also Read: GHMC: ఆ మూడు కార్పొరేషన్ల పాలన షురూ? తర్వాతే కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం!

