GHMC Commissioner: పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తూ గ్రేటర్ హైదరాబాద్‌ను పరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ (GHMC Commissioner RV Karnan) అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చేపట్టిన మెగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా, 11వ రోజైన 300 వార్డుల్లో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఫిల్మ్ నగర్ కొత్త చెరువు ఏరియాలో అదనపు కమిషనర్ రఘు ప్రసాద్‌తో కలిసి కమిషనర్ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రోడ్ల పక్కన వదిలేసిన పాత వాహనాలను ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని తొలగించాలని సూచించారు. గత నెల డిసెంబర్ 29న ప్రారంభమైన ఈ మెగా శానిటేషన్ డ్రైవ్ ఈ నెల 31 వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
Also Read: GHMC Commissioner: పరిశుభ్ర నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి : అధికారులకు కర్ణన్ కీలక సూచనలు!
12 నుంచి మెగా ఈ-వేస్ట్ డ్రైవ్
పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర పారిశుద్ధ్య లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా మెగా ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్‌ను చేపట్టనుంది. ఈ నెల 12, 13 తేదీల్లో నగరవ్యాప్తంగా 300 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రజల్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడంతో పాటు, నివాస, వాణిజ్య ప్రాంతాల నుంచి పాత ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వంటి వ్యర్థాలను సేకరించి శాస్త్రీయంగా ప్రాసెస్ చేయనున్నట్లు వివరించారు. ఈ డ్రైవ్ కోసం ఆర్‌డబ్ల్యూఏలు, ఎన్‌జీవోలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతి వార్డులో తాత్కాలిక సేకరణ కేంద్రాలను గుర్తించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read:GHMC Commissioner: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశం

