Property Tax: జీహెచ్ఎంసీ ఆదాయ మార్గాల్లో అత్యంత కీలకమైన ఆస్తి పన్ను వసూళ్లపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం (2026-27) ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో, నిర్దేశించుకున్న రూ. 3,000 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు వ్యూహరచన చేశారు. ఇప్పటివరకు రూ. 1,922 కోట్ల పన్ను వసూలు కాగా, మిగిలిన రూ. 1,088 కోట్లను ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటివరకు రూ. 205 కోట్ల అదనపు పన్ను వసూలు కావడం విశేషం.
విలీన ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్
నగర శివార్లలోని 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో పన్ను పరిధి భారీగా పెరిగింది. విలీనానికి ముందు 345గా ఉన్న డాకెట్ల సంఖ్య ప్రస్తుతం 599కి చేరింది. ఈ అదనపు ప్రాంతాల్లో పన్ను వసూలు చేసేందుకు కొత్తగా 254 మంది వార్డు ఆఫీసర్లను ఇన్‌చార్జ్ బిల్ కలెక్టర్లుగా నియమించారు. వీరికి పన్ను వసూళ్లలో సాంకేతికతను జోడించేందుకు ‘హ్యాండ్ హెల్డ్ మిషన్లను’ పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం కీసర, హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని సిబ్బందికి ఈ మిషన్లను అందజేసి ప్రక్రియను వేగవంతం చేశారు.
Also Read: Realme Neo 8 Mobile: రియల్‌మీ నుంచి పవర్ ఫుల్ గేమింగ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవడం పక్కా!
బకాయిదారులకు రెడ్ నోటీసులు
దీర్ఘకాలికంగా పన్ను చెల్లించని మొండి బకాయిదారుల పట్ల అధికారులు కఠిన వైఖరి అవలంబించనున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచే భారీ బకాయిలు ఉన్న ఆస్తులకు రెడ్ నోటీసులు జారీ చేయనున్నారు. బకాయిదారులకు వెసులుబాటు కల్పించేందుకు ఇప్పటికే ‘వన్ టైమ్ సెటిల్ మెంట్’ పథకాన్ని అమలు చేస్తున్న అధికారులు, రానున్న రెండు నెలల్లో ప్రతి నెలా రూ. 500 కోట్ల చొప్పున వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
పరిష్కార అధికారాలు జడ్సీలకే..
పన్ను వివాదాల వల్ల వసూళ్లు ఆగకూడదనే ఉద్దేశంతో కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ కీలక సంస్కరణలు చేపట్టారు. వచ్చే వారం నుండి ప్రతి సర్కిల్‌లో నిర్వహించే ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార వేదిక’ ద్వారా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించనున్నారు. గతంలో రెండేళ్ల పైబడిన వివాదాల పరిష్కారానికి కమిషనర్ అనుమతి తప్పనిసరిగా ఉండగా, ఇప్పుడు ఆ అధికారాలను జోనల్ కమిషనర్లకు, రెండేళ్ల లోపు వివాదాలను పరిష్కరించే అధికారాన్ని డిప్యూటీ కమిషనర్లకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Vegetable Prices: కొండెక్కుతున్న కూరగాయల ధరలు.. ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

