GHMC: జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు నెల రోజుల్లో ముగియనున్నది. 2020 కరోనా సెకండ్ వేవ్ విపత్కర సమయంలో డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార గులాబీ పార్టీ జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది. 2020లో జీహెచ్ఎంసీ(GHMC) పాలక మండలి కొలువు దీరగా, మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి, పాలక మండలి సభ్యులుగా వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టిన రోజును పరిగణనలోకి తీసుకుని అధికార గడువును ముగించనున్నారు. నుంచి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండగా, ప్రస్తుతం వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు అహ్మదాబాద్ స్టడీ టూర్‌లో బిజీగా ఉన్నారు. మరో కార్పొరేటర్ల బృందం ఈ నెల 16న స్టడీ టూర్‌కు బయల్దేరి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
11 నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన
సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరానికి చెందిన రూ.11,460 కోట్లతో రూపకల్పన చేసిన వార్షిక బడ్జెట్‌పై స్పెషల్ కౌన్సిల్ మీటింగ్‌ను నిర్వహించి, సభ్యుల అభిప్రాయాలను సేకరించిన తర్వాత కౌన్సిల్ ఆమోదం తెలపనున్నది. స్పెషల్ కౌన్సిల్ మీటింగ్‌ను ఉదయం బడ్జెట్‌పై, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, పరిపాలనాపరమైన సంస్కరణలపై నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. గడిచిన ఐదేళ్లలో కౌన్సిల్ తీసుకున్న పలు ముఖ్యమైన, సంచలనాత్మక తీర్మానాలను ఈ సమావేశంలో వెల్లడించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత బడ్జెట్ 2026-27ను పరిపాలనాపరమైన ఆమోదం కోసం సర్కారుకు పంపనున్నారు. వచ్చే నెల 10వ తేదీతో పాలక మండలి గడువు ముగియగానే 11వ తేదీ నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలనను తీసుకువచ్చి, ఆ తర్వాత 2,050 చదరపు కిలోమీటర్లు, 12 జోన్లు, 60 సర్కిళ్లకు విస్తరించిన జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేసేందుకు వీలుగా సర్కారు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పాలక మండలి ఇప్పటికే ఫొటో సెషన్ కూడా నిర్వహించింది. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్‌తో పాటు ప్రస్తుతం పాలక మండలిలో ఉన్న 145 మంది కార్పొరేటర్లతో కొద్ది రోజుల క్రితం ఫొటో సెషన్ నిర్వహించి, ఆ ఫొటోలను కౌన్సిల్ హాల్‌లో పెట్టాలని మేయర్ నిర్ణయించారు.
మే చివరిలో ఎన్నికలు
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాల్టీలు, మరో 5 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ జీహెచ్ఎంసీకి కూడా వచ్చే మే నెలలో గానీ, జూన్ మొదటి వారంలో గానీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుత పాలక మండలి గడువు ముగిసిన వెంటనే 11వ తేదీ నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన ఆదేశాలు మొదలుకుని, 3 కార్పొరేషన్ల ప్రకటన, ఆ తర్వాత కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ, పోలింగ్ స్టేషన్ల ముసాయిదా, తుది జాబితాలు వంటివి ఖరారు చేసి జూన్ లోపు జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. ఒకే సిటీలోని 3 కార్పొరేషన్లకు ముగ్గురు మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నిక చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఫిబ్రవరి నెలాఖరులో మరింత క్లారిటీ వచ్చే అవకాశమున్నది.
Also Read: GHMC: కొత్త ఆఫీస్‌ల ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ బిజీ బిజీ.. ప్రాంగణాల కోసం అన్వేషణ!

