GHMC: జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కాసుల కక్కుర్తి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం దోమల నివారణకు ప్రత్యేకంగా ఎంటమాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో 30 సర్కిళ్లకు కలిపి కరోనా టీమ్ తో పాటు మొత్తం సుమారు రెండున్నర వేల మంది కార్మికులు ఫీల్డు లెవల్ లో ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్ వంటి కీలక విధులు నిర్వర్తిస్తుంటారు.
కొన్ని సందర్భాల్లో ఈ కార్మికులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి, నదులు, చెరువులు, కుంటల్లో దిగి దోమలు వృద్ధి చెందేందుకు కారణమైన గుర్రపు డెక్కను తొలగించటం వంటి విధులు నిర్వహిస్తుంటారు. కానీ వీరికి సకాలంలో జీతాలు అందటం లేదన్న ఆరోపణ వెల్లువెత్తుతుంది. ఇటీవల చార్మినార్ జోన్ లో కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు కార్మికులకు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు జీతాలను అడ్వాన్స్ గా చెల్లించి, అందుకు నెలకు పది శాతం మిత్తీని జీతాల్లో కట్ చేసుకుంటున్నట్లు సమాచారం.
Also Read: Donald Trump: చైనా కుట్ర చేసింది.. భారత్, రష్యాను కోల్పోయాం.. ట్రంప్ ఆవేదన!
అడ్వాన్స్ లు తీసుకుంటు కార్మికులకు జీతాలు
తమ వద్ద అడ్వాన్స్ లు తీసుకుంటున్న కార్మికులకు మాత్రమే జీతాలను చెల్లిస్తున్నట్లు, అడ్వాన్స్ తీసుకునేందుకు నిరాకరించే కార్మికులకు జీతాలు చెల్లించటం లేదని కొందరు కార్మికులు వాపోతున్నారు. కొందరు కార్మికులు నెలకు సరిగ్గా సమయానికి వచ్చే జీతంపైనే ఆధారపడి ఈఎంఐలపై గృహోపకరణాలు, సెల్ ఫోన్లు, టీవీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకుని, అందుకు సంబంధించిన ఈఎంఐలను చెల్లించాల్సి ఉన్నందున, అడ్వాన్స్ గా జీతం తీసుకుంటే వచ్చే మిగిలిన జీతంలో తమకు ఈఎంఐలు చెల్లించటం, కుటుంబ పోషణ, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించటం కష్టంగా మారుతున్నందున అడ్వాన్స్ లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు, అలాంటి వారికి కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
మాకు గిట్టుబాటు కావాలి
ఎంటమాలజీ ఫీల్డు వర్కర్లకు అడ్వాన్స్ జీతాలు చెల్లించటం ఎందుకు? వారి జీతాల్లో నుంచి పది శాతాన్ని మిత్తీ కింద కట్ చేసుకోవటం ఎందుకని ఓ యూనియన్ నేత చార్మినార్ జోన్ లోని ఇద్దరు కాంట్రాక్టర్లను ప్రశ్నించగా, తమకు కూడా గట్టిబాటు కావాలి కదా అని బాహాటంగానే సమాధానం చెప్పినట్లు సమాచారం. తమకు జీతాలు చెల్లించకపోవటం పట్ల యూనియన్ ను కార్మికులు ఆశ్రయించటంతో సదరు యూనియన్ కాంట్రాక్టర్లను సంప్రదించారు.
గత నెల జీతానికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లు ఈ రకంగానే వ్యవహారించినట్లు సమాచారం. జోక్యం చేసుకున్న యూనియన్ నేత తాను కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని అల్టిమేటం ఇవ్వటంతో కార్మికులకు ఆగమేఘాలపై జీతాలు చెల్లించి, మళ్లీ ఇపుడు ఆగస్టు నెల జీతం చెల్లించేందుకు లేనిపోని కొర్రీలను పెడుతున్నట్లు కార్మికులు ఆరోపించారు. కాంట్రాక్టు ప్రాతిపదికన కాంట్రాక్టర్లు మ్యాన్ పవర్ సరఫరా చేస్తున్నందున, జీహెచ్ఎంసీ వారికి మొత్తం కాంట్రాక్టు వ్యాల్యులో కొంత చెల్లిస్తున్నా, కాంట్రాక్టర్లు తమ కాసుల కక్కుర్తి కోసం కార్మికుల శ్రమను దోచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
ఆబ్సెంట్ కు రూ. 500 చెల్లించాల్సిందే
శానిటేషన్ విభాగంలోనూ అధికారులు ఎన్ని ఆధునిక సంస్కరణలను తీసుకువచ్చినా, శ్రమ దోపిడీ ఆగటం లేదని కార్మికులు వాపోతున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మెహిదీపట్నం సర్కిల్ పరిధిలోని మాజీ మేయర్, ప్రస్తుత నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ నివసించే ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులకు ప్రతి నెల సగం జీతం చెల్లిస్తున్నట్లు కార్మికులు వాపోయారు. ప్రతి రోజు ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ప్రకారం అటెండెన్స్ వేస్తున్నా, పని చేసిన మొత్తం రోజులకు జీతం రావటం లేదని వాపోయారు. ఇదేమిటనీ ఎస్ఎఫ్ఏను ప్రశ్నించగా, మీరు కంప్యూటర్ ఆపరేటర్ ను మేనేజ్ చేసుకోవాలని చెప్పినట్లు కార్మికులు వాపోయారు. ఒక్క రోజు విధులకు ఆబ్సెంట్ అయినా, ఆ రోజు అటెండెన్స్ వేసుకోవాలంటే ఎస్ఎఫ్ఏ, కంప్యూటర్ ఆపరేటర్లకు కలిపి రూ. 500 చెల్లించాలన్న నిబంధన పెట్టినట్లు తెలిసింది. వీక్లీ ఆఫ్ ఉన్నా, కార్మికులు మొత్తం 30 రోజులు పని చేస్తున్నా, వారికి సగం కన్నా ఎక్కువ జీతం రావటం లేదని వాపోయారు.
Also Read: Hydra: పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా.. 4400 గజాల్లో ఫెన్సింగ్ బోర్డు ఏర్పాటు