RV Karnan: జీహెచ్ఎంసీ ప్రాజెక్టుల విభాగంపై కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఆయన ప్రాజెక్టుల వింగ్ పై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో కమిషనర్ ప్రాజెక్టుల వింగ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ భాస్కర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. కేబీఆర్ పార్కు, త్రిబుల్ ఐటీ, కూకట్ పల్లి వై జంక్షన్, నానల్ నగర్ ప్రాంతాల్లో చేపట్టాల్సిన హెచ్ సిటీ ప్రాజెక్టుల పనులకు ఇప్పటికే టెండర్లను ఖరారు చేసినా, ఎందుకు పనులు ముందుకు సాగటం లేదని తీవ్ర స్థాయిలో కమిషనర్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికే చాలా రోజుల నుంచి ప్రతి మంగళవారం తాను హెచ్ సిటీ పనులు, ఇతర ప్రాజెక్టులపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నా, ఏ మాత్రం పనులు ముందుకు సాగటం లేదని, అన్ని నేనే స్వయంగా చూడాలంటే కుదరదని, మీరు చేయాల్సిన పని మీరు చేయాలని సూచించినట్లు సమాచారం.
ప్రాజెక్టులను పదేళ్ల పాటు చేస్తారా?
రెండేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను పదేళ్ల పాటు చేస్తారా? అంటూ మండిపడినట్లు తెలిసింది. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు హెచ్ సిటీ పనులకు గత సంవత్సరం డిసెంబర్ మాసంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేసినా, మనమెందుకు పనులు గాడీన పట్టలేకపోతున్నామని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రస్తుతం హెచ్ సిటీ పనులు భూసార పరీక్షలు, ఇతర సర్వేల స్థాయిలో ఉన్నాయని ఇంజనీర్ ఇన్ చీఫ్ భాస్కర్ రెడ్డి సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా, ఫీల్డు లెవెల్ లో పనులెందుకు మొదలు కావటం లేదని కమిషనర్ ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం.
Also Read: RV Karnan: ఫలించిన వ్యూహాం.. సాఫీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక!
ఏ ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి?
భూసార పరీక్షలు, సర్వేలు మాట అలా ఉంచితే డిసెంబర్ 7వ తేదీ కల్లా అన్ని ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేస్తామని గతంలో చెప్పారని, ఇప్పటి వరకు ఏ ఏ ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి? ఏ ఏ ప్రాజెక్టుల పనులను ఎపుడు ఫీల్డు లెవెల్ లో ప్రారంభిస్తారంటూ అసహనంగా ప్రశ్నించినట్లు తెలిసింది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి స్థల సేకరణ వివాదాలున్నాయని, కమిషనర్ కు వివరించగా, స్థల సేకరణకు సంబంధించి కోర్టులో వివాదాల్లేని ప్రాంతాల్లో పనులు ప్రారంభించాలని కమిషనర్ సూచించినట్లు టాక్ జరుగుతుంది. సీఎం శంకుస్థాపన చేసి, సర్కారు నిధులకు పరిపాలనపరమైన మంజూరీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా, పనులెందుకు మొదలు కావటం లేదు? ఆలస్యమైతే అంచనా వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశముందని, దీనిపై సర్కారు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని కమిషనర్ ఇంజనీర్లపై సీరియస్ అయినట్లు తెలిసింది.
ట్రాఫిక్ సమస్య రోజురోజుకి తీవ్రరూపం దాల్చుతుంది
జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్య రోజురోజుకి తీవ్రరూపం దాల్చుతుందని, ఈ సమస్య వివిధ ప్రభుత్వ శాఖలకు సవాలుగా మారిందని కమిషనర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నానల్ నగర్ లో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ కు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయటంపై చూపిన శ్రద్ధను పనుల ప్రారంభంపై ఎందుకు చూపటం లేదని ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. యుటిలీటీ బదలాయింపు విషయానికి సంబంధించిన మీరే ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి విషయానికి నేను జోక్యం చేసుకుంటే మరీ మీరెందుకున్నట్లు అని తీవ్ర స్థాయిలో కమిషనర్ సీరియస్ అయినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయిన ప్రాజెక్టుల పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని, నిరంతరం పర్యవేక్షిస్తూ ఇప్పటికే ఫిక్ చేసిన డెడ్ లైన్ లోపు పనులను పూర్తి చేసే బాధ్యత ఇంజనీరింగ్ విభాగానిదేనని కమిషనర్ తేల్చి చెప్పినట్లు తెలిసింది.
Also Read: RV Karnan: డీసీలపై కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్పెషల్ ఫోకస్.. ఎందుకో తెలుసా..!

