RV Karnan: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలో సర్కిళ్ల వారీగా బాస్ లుగా వ్యవహారించే డిప్యూటీ కమిషనర్ల పనితీరుపై కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) స్పెషల్ గా ఫోకస్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న జీహెచ్ఎంసీకి అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల ద్వారా రావాల్సిన నిధులను రాబట్టాల్సిన బాధ్యతలను డిప్యూటీ కమిషనర్లకు అప్పగించినా, వారి పనితీరు ఆశించిన తీరులో లేకపోవటం, ఇటీవలే అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లేని ఇళ్లకు ఇంటి నెంబర్లను కేటాయించిన వ్యవహారంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు స్టేట్ విజిలెన్స్ నివేదికలు తేల్చటంతో డిప్యూటీ కమిషనర్ల పనితీరుపై కమిషనర్ స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పై జరిగిన స్టేట్ విజిలెన్స్ విచారణ నివేదికలను జీహెచ్ఎంసీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ (ఎంఏయూడీ)కి సమర్పించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై త్వరలోనే ఎంఏయూడీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సదరు డిప్యూటీ కమిషనర్ ను మాతృ శాఖ కు సరెండ్ చేస్తారా? లేక సస్పెన్షన్ చేస్తారా? అన్నది జీహెచ్ఎంసీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, కొత్త ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్ (పీటీఐఎన్ఆ)ల కేటాయింపు వంటి అంశాలపై కమిషనర్ ఆరా తీస్తున్న
ఫలించని నెలకు రూ. వంద కోట్ల కలెక్షన్ టార్గెట్..
జీహెచ్ఎంసీ లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నందున సకాలంలో ఉద్యోగులు, కార్మికులకు జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లను అందించేలా జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని మొత్తం 30 సర్కిళ్లలో కలిపి నెలకు రూ.వంద కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేయాలని కమిషనర్ కర్ణన్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినా, అవి ఫీల్డు లెవెల్ లో ఏ మాత్రం అమలు కావటం లేదన్న విషయాన్ని కూడా కమిషనర్ గుర్తించినట్లు సమాచారం. అవకాశమున్న చోట అవినీతికి పాల్పడటం, కార్పొరేషన్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కనీస బాధ్యతగా పని చేయకపోవటం వంటి కారణాలతో కమిషనర్ డిప్యూటీ కమిషనర్ల పనితీరుపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు సమాచారం.
Also Read: KTR: బీజేపీ తెలంగాణకు పనికిరాని పార్టీ అంటూ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కమిషనర్లకు నెలసరి టార్గెట్లు..
దీనికి తోడు ప్రతి సర్కిల్ లో కమర్షియల్ భవనాలను గుర్తించి, అవి కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని గుర్తించి, వాటికి వర్తించే పన్ను విధానం పరిధిలోకి వాటిని తీసుకురావాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఇందుకు సంబంధించి డిప్యూటీ కమిషనర్లకు నెలసరి టార్గెట్లు విధించినా, ఫలితాలు రావటం లేదన్న విషయాన్ని కూడా గుర్తించిన కమిషనర్ ఆరు జోన్లలోని డిప్యూటీ కమిషనర్ల పనితీరుపై త్వరలోనే నివేదికలు తెప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు అక్రమ నిర్మాణాలకు సంబంధించి సర్కిళ్ల వారీగా జారీ చేసిన అనుమతులకు సంబంధించినవే కావటం, వాటికి సంబంధించిన ఫిర్యాదులు ప్రధాన కార్యాలయానికి వచ్చాయి. వాటిని పరిష్కారం కోసం సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు పంపినా, వారు వాటిని పరిష్కరించకుండా పక్కన బెట్టినట్లు కూడా ఉన్నతాధికారులు గుర్తించి, దీనిపై కమిషనర్ కు నివేదికలు సమర్పించటంతో త్వరలోనే డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్ ట్యాక్స్ కలెక్షన్, టౌన్ ప్లానింగ్ కు సంబంధించి సర్కిళ్ల స్థాయిలో జారీ చేసిన నిర్మాణ అనుమతులపై సమీక్ష నిర్వహించే అవకాశమున్నట్లు తెలిసింది.
త్వరలో చర్యలు?
సర్కిల్ స్థాయిలో శానిటేషన్, ట్యాక్స్ కలెక్షన్, టౌన్ ప్లానింగ్ ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలకు సంబంధించి పని తీరు సంతృప్తిగా లేని డిప్యూటీ కమిషనర్లపై త్వరలోనే కమిషనర్ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. అల్వాల్ డిప్యూటీ కమిషనర్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ అవినీతి ఆరోపణలు, కమిషనర్ ఆదేశాలు సక్రమంగా అమలు చేయని డిప్యూటీ కమిషనర్లను గుర్తించి, వారిని మాతృశాఖకు సరెండర్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Also Read: Bachupally Land Scam: బాచుపల్లిలో బడా భూస్కాం.. పైల్ డీ నోటిఫై చేసేందుకు అధికారుల తంటాలు
