RV Karnan: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను పారదర్శకంగా, సాఫీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ రచించిన వ్యూహాం ఫలించింది. నోటిఫికేషన్ జారీ మొదలుకుని నామినేషన్ల స్వీకరణ, పరిశీలనతో పాటు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలన్నీ ఎలాంటి లోటు పాట్లు లేకుండా సజావుగా సాగాయి, ఇందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందే ఎంతో ముందు చూపుతో కర్ణన్ జీహెచ్ఎంసీలో అంతర్గతంగా చేసుకున్న పలు మార్పులే ఉప ఎన్నిక నిర్వహణ సజావుగా జరిగేందుకు దోహదపడ్డాయనే చెప్పవచ్చు.
పలు సార్లు వీడియో కాన్ఫరెన్స్ లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు దేశంలోని మరో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయకముందు జీహెచ్ఎంసీ కమిషనర్ తో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు పలు సార్లు వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి, జారీ చేసిన పలు ఆదేశాలు, సూచనల మేరకే జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ సమయస్పూర్తితో పలు మార్పులు చేసుకున్నారు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ ఎక్స్ పర్ట్ గా పేరున్న ఆర్.వి. కర్ణన్ ఎన్నికల నిర్వహణలో కీలక ప్రక్రియలు, బాధ్యతలను ఆయన నాన్ క్యాడర్ ఆఫీసర్లను తప్పించి, జోనల్ కమిషనర్లుగా వ్యవహారిస్తున్న నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఓటర్‌తో సంబంధం ఉండే అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇందు కోసం నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లను, మరో ఉన్నతాధికారిని వాటికి నోడల్ అధికారులుగా నియమించారు.
పనులను సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా
ఇందులో కీలకమైన పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్‌లకు అన్ని రకాల సదుపాయాలు అంటే తాగునీరు. మొబైల్ డిపాజిట్, వీల్ చైర్ల ఏర్పాటు, వాటి వినియోగం, ర్యాంపులు, లైటింగ్ ఇలా అన్ని రకాల ఏర్పాట్ల కోసం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ హెమంత్ భోర్కడే సహదేవ్‌ను, ఓటర్‌లకు ఎలాంటి సమస్యలు రాకుండా, పోలింగ్ సజావుగా జరిగేందుకు, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయడానికి నోడల్ అధికారిగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, మరో ఐఏఎస్ ఆపీసర్ అనురాగ్ జయంతిని, ఈవీఎంలకు సంబంధించి అన్నిరకాల ఏర్పాట్ల కోసం కూకటపల్లి జోనల్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ అపూర్వ చౌహాన్‌ను, పూర్తిస్థాయి ఎన్నికల నిర్వహణ కోసం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్స్) గా నియమించారు. అప్పటి వరకు ఆ పోస్టులో కొనసాగిన అదనపు కమిషనర్ మంగతాయారును క్రీడల విభాగానికి అదనపు కమిషనర్ గా నియమించారు. వీరంతా వారికి కేటాయించిన పనులను సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా అన్న విషయాన్ని కర్ణన్ నేరుగా పర్యవేక్షించారు.
పోలింగ్ ఆఫీసర్లకు పలు సూచనలు
దీనికి తోడు ఆయన ప్రచారం ముగిసిన తర్వాత సైలెట్ మోడ్ లోనూ అభ్యర్థులు ఎలాంటి కండువాలు, జెండాల్లేకుండా ఇంటింటికి ప్రచారం చేసుకునే అవకాశమిచ్చి, అందులో ఎక్కడా కూడా కోడ్ ఉల్లంఘన జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. అంతటితో ఆగని కర్ణన్ ఎలక్షన్ నోటిఫికేషన్ మొదలుకుని కౌంటింగ్ చివరి నిమిషం వరకు కూడా తానే స్వయంగా అన్ని రకాలుగా పర్యవేక్షిస్తూ వచ్చారు. పోలింగ్ జరిగిన ఈ నెల 11వ తేదీన తెల్లవారు ఝము అయిదు నుంచి అయిదున్నర గంటల మధ్య మాక్ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించిన ఆయన ఆ రోజు దాదాపు చాలా పోలింగ్ స్టేషన్లలో మాక్ పోలింగ్ ప్రక్రియను నేరుగా పరిశీలించి ప్రెసైడింగ్ ఆఫీసర్లకు, అసిస్టెంట్ ప్రెసైడింగ్ ఆఫీసర్లు, అదర్ పోలింగ్ ఆఫీసర్లకు పలు సూచనలు జారీ చేశారు. ఫలితంగా గతంలో జరిగిన పలు ఎన్నికల్లో పోలింగ్ రోజున ఉదయం ఈవీఎంలు మొరాయించేవి.
మరో 45 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ పలు ప్రాంతాల్లో పోలింగ్ రోజు ఉదయం ఈవీఎంలు మోరాయించినా, అది చాలా తక్కువ పోలింగ్ స్టేషన్లలో, అదీ చాలా తక్కువ సమయం మాత్రమే మోరాయించినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎన్నికల అధికారిగా సిబ్బందికి పలు సూచనలు జారీ చేసి, సమస్యను పరిష్కరించారు. ముఖ్యంగా కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఆయన నోటిఫికేషన్ జారీ చేసిన అక్టోబర్ 13వ తేదీ నుంచి పోలింగ్ జరిగిన ఈ నెల 14వ తేదీన పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసే వరకు ప్రతి విషయాన్ని నేరుగా పర్యవేక్షించారు. ముఖ్యంగా కోడ్ ఉల్లంఘనకు సంబంధించి పోలింగ్ రోజున ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపైనే కేసులు నమోదు చేయించారు. అంతేగాక, ఆయన పర్యవేక్షణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజునే ఏర్పాటు చేసిన 45 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు, మరో 45 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లతో కేంద్ర ఎన్నికల పరిశీలకులను సమన్వయం చేసుకుని, రికార్డు స్థాయిలో దాదాపు రూ. మూడున్న కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగేందుకు, పోలింగ్ సమయం అదనంగా గంట పెంచటంలో కర్ణన్ ప్రత్యేక కృషి ఉన్నదనే చెప్పవచ్చు.
Also Read: RV Karnan: దుర్గం చెరువు పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశం!
