GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: స్వచ్చ ఆటో టిప్పర్లు ఓవర్ యాక్షన్.. నిబంధనలకు విరుద్దంగా గ్యార్బేజీ సేకరణ!

GHMC: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ పరిస్థితి మూలుగుతున్న నక్కపై దాటికాయ పడినట్టయింది. ఇప్పటికే సకాలంలో ఉద్యోగులకు జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లు, కాంట్రాక్టర్లకు బిల్లులను చెల్లించలేక అష్టకష్టాలు పడుతున్న జీహెచ్ఎంసీకి ఆర్థికంగా మరో కష్టం వచ్చి పడింది. గ్రేటర్ పరిధిలో చెత్త సేకరణ, తరలింపు, శాస్త్రీయంగా ల్యాండ్ ఫీల్డ్ చేసేందుకు రాంకీతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి స్వచ్చ ఆటో డ్రైవర్లు, కాసుల కక్కుర్తి కోసం వ్యవహరిస్తున్న తీరు జీహెచ్ఎంసీ పాలిట శాపంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో హైదరాబాద్ మహానగరాన్ని డంపర్ బిన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గుర్తించిన 22 లక్షల గృహాల నుంచి నేరుగా చెత్తను సేకరించేందుకు దశల వారీగా సమకూర్చుకున్న స్వచ్చ ఆటో టిప్పర్ల డ్రైవర్లే నేడు జీహెచ్ఎంసీకి మరిన్ని ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతన్నట్లు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

2011లో కుదిరిన ఒప్పందం

రాంకీ, జీహెచ్ఎంసీల మధ్య 2011లో కుదిరిన ఒప్పందం ప్రకారం బల్క్ గార్బేజీని రాంకీ సంస్థ సేకరించాల్సి ఉంది. కానీ డబ్బుల కోసం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు కమర్షియల్, వ్యాపార సముదాయాల నుంచి నామమాత్రపు ఛార్జీలకే బల్క్ గ్యార్బెజీని సేకరించటం జీహెచ్ఎంసీకి మరో కొత్త కష్టాన్ని తెచ్చి పెడుతుంది. దీంతో రాంకీకి ఆర్థికంగా ఏర్పడుతున్న రూ.164 కోట్లను ప్రతి ఏటా జీహెచ్ఎంసీ చెల్లించాల్సి వస్తుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సిటీని డంపర్ బిన్ ఫ్రీ చేయాలన్న అధికారులు తొందరపాటు నిర్ణయం రెండురకాల నష్టాన్ని తెచ్చి పెట్టిందన్న విమర్శలున్నాయి. బిన్ ఫ్రీ సిటీ ప్రయోగం ఫెయిల్ కావటం, ప్రయోగంలో భాగంగా ఇంటింటి నుంచి చెత్తను సేకరించాల్సిన కార్మికులు బల్క్ గ్యార్బేజీ కలెక్షన్ పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపటం అధికారులకు తలనొప్పిగా మారింది.

అసలు పనిని పక్కనబెట్టి

నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలోని సుమారు 22 లక్షల గృహా సముదాయాల నుంచి ప్రతి రోజు డోర్ టూ టోర్ చెత్తను సేకరించేందుకు వివిధ దశల వారీగా జీహెచ్ఎంసీ తన సొంత నిధులతో 3750 స్వచ్చ టిప్పర్ ఆటోలను సమకూర్చింది. అప్పటి వరకు రిక్షాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్న స్వచ్చ కార్మికులు ప్రతి రోజు మరిన్ని ఎక్కువ ఇళ్ల నుంచి చెత్తను మరింత వేగవంతంగా సేకరించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ స్వచ్చ కార్మికులకు ఆటోలను సమకూర్చింది. ప్రతి ఒక స్వచ్చ ఆటో కార్మికుడికి గరిష్టంగా 600 ఇండ్లు, కనిష్టంగా 300 ఇండ్లను కేటాయించారు.

కానీ స్వచ్చ టిప్పర్ కార్మికుడు తమకు కేటాయించిన ఇళ్ల నుంచి ప్రతి రోజు తడి,పొడి చెత్తను సేకరించటంలో విఫలమవుతున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులకు ఇందుకు అసలు కారణం ఏమిటీ? అన్న కోణంలో స్టడీ చేయగా, అధికారులే నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి రోజు స్వచ్చ టిప్పర్ కార్మికుడు చేయాల్సిన డోర్ టూ డోర్ చెత్త కలెక్షన్ విధులను పక్కనబెట్టి, ఆ ఏరియాల్లోని వ్యాపార సంస్థల నుంచి అంతంతమాత్రపు లంచాలను వసూలు చేసుకుంటూ బల్క్ గార్బేజీని స్వీకరించి సమీపంలోని ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read: Ponnam Prabhakar: విధుల్లో నిజాయితీగా పనిచేయాలి.. రవాణాశాఖకు మంచి పేరు తేవాలి!

ఆటో కార్మికులు, హిజ్రాలతో కలిసి దాడి

డోర్ టూ డోర్ చెత్త సేకరణకు సంబంధించి కొన్ని ఇండ్ల యజమానులు నెలకు ఛార్జీలు చెల్లించేందుకు ససేమిరా అనటం, మరి కొందరు రూ.50, రూ.వంద, రూ.200 మాత్రమే చెల్లించటంతో అవి సరిపోక, కార్మికులు బల్క్ గ్యార్బేజీపై నజర్ వేసినట్లు సమాచారం. ఒక్కో ఇంటి నుంచి కేవలం వారానికోసారి మాత్రమే చెత్త సేకరణ జరుగుతున్నట్లు సమాచారం. ప్రతి రోజు తడి పొడి చెత్తను సేకరించిన తర్వాత సమయముంటే బల్క్ గార్బెజీని సేకరించాలన్న వెసులుబాటు జీహెచ్ఎంసీ కల్పించినా, స్వచ్చ కార్మికులు మాత్రం బల్క్ గార్బెజీ సేకరణపై చూపుతున్న శ్రద్ధ ఇంటింటి డోర్ టూ డోర్ చెత్త కలెక్షన్ పై చూపటం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు ఈ వ్యవహారంపై స్వచ్చ ఆటో టిప్పర్ కార్మికులను పిలిపించి మాట్లాడగా, తమకు జీతం లేదని, ఇంటి యజమానులంతా తమకు నెలసరి ఛార్జీలు చెల్లించటం లేదని సమాధానమిచ్చారు. స్వచ్చ ఆటో టిప్పర్ కార్మికులకు తాము బల్క్ గ్యార్బెజీ ఇవ్వబోమని తేల్చి చెప్పిన వ్యాపార సంస్ఢలపై స్వచ్చ ఆటో కార్మికులు, హిజ్రాలతో కలిసి దాడులకు పాల్పడిన సందర్భాలు సైతం ఉన్నాయంటూ అధికారులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటు వ్యాపారులకు లాభం, బల్దియాకు నష్టం

హైదరాబాద్ నగరంలో పేరుగాంచిన ఓ ఆస్పతికి దాదాపు ఆరు బ్రాంచిలున్నాయి. ఈ ఆరు బ్రాంచి ల నుంచి బల్క్ గ్యార్బేజీ సేకరించేందుకు సదరు ఆస్పత్రి నెలకు సుమారు రూ. 6 లక్షలను జీహెచ్ఎంసీకి బల్క్ గ్యార్బేజీగా చెల్లిస్తుండేది. స్వచ్చ ఆటో టిప్పర్ కార్మికులు బల్క్ గార్బేజీపై కన్నేసిన నాటి నుంచి సదరు ఆస్పత్రి యాజమాన్యం బల్క్ గ్యార్బెజీని సేకరిస్తున్న స్వచ్చ ఆటో టిప్పర్ కార్మికులకు కేవలం రూ. 60 వేలను మాత్రమే అనధికారికంగా చెల్లిస్తూ, జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన రూ. 6 లక్షల్లో దాదాపు రూ. 5.40 లక్షలను సేవ్ చేసుకుంటుంది. ఇది వాస్తవానికి నిబంధనల ప్రకారం రాంకీకి వెళ్లాల్సిన బల్క్ గ్యార్బేజీ ఛార్జీలు.

రాంకీ కన్నా ముందే నిబంధనలకు విరుద్దంగా స్వచ్చ ఆటో కార్మికులు ఈ బల్క్ గ్యార్బేజీని సేకరిస్తుండటంతో రాంకీ జరిగే నష్టాన్ని జీహెచ్ఎంసీ పూడ్చుతూ ఏటా రూ. 164 కోట్లను చెల్లిస్తూ తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఇటీవలే ఈ రకంగా బల్క్ గ్యార్బేజీని సేకరిస్తున్న కార్మికులను గుర్తించి, వారికి ఇతర విధులు కేటాస్తామని అధికారులు సూచించినా, తాము బల్క్ గార్బేజీని మాత్రమే సేకరిస్తామని భీష్మించుకున్న కార్మికులు రెండు రోజుల క్రితం ప్రధాన కార్యాలయంలో ధర్నా కూడా చేపట్టారు. జీహెచ్ఎంసీకి కొరకరాని కొయ్యగా మారిన ఈ కార్మికుల సమస్య ఎలా పరిష్కారమవుతుందో వేచి చూడాలి.

Also Read: Panchayat Raj Jobs: పంచాయతీ రాజ్ లో ప్రమోషన్లకు మోక్షం కలిగేనా?

 

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ