GHMC: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా, దేశంలోనే అతి పెద్ద నగరంగా రూపాంతరం చెందిన జీహెచ్ఎంసీ(GHMC), వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)కి సంబంధించిన వార్షిక బడ్జెట్‌పై ఎట్టకేలకు కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను చేపడుతూనే, మరోవైపు విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థలను కలుపుకుని మొత్తం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధికి బడ్జెట్‌ను రూపకల్పన చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనమైన పట్టణ స్థానిక సంస్థల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అక్కడి అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గతంలో ఈ సంస్థలు తమ ఆదాయ వనరులు పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌ను తయారు చేసుకునేవి. అయితే, విలీనం నేపథ్యంలో, ఈ పట్టణ స్థానిక సంస్థల గత, వర్తమాన ఆర్థిక స్థితిగతులతో పాటు, మున్ముందు మెరుగుపడనున్న పౌర సేవల నిర్వహణ వ్యయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపకల్పన చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది.
భారీ బడ్జెట్‌కు రంగం సిద్ధం
విలీనానికి ముందే జీహెచ్ఎంసీ తన పాత పరిధికి సంబంధించి రూ.11 వేల 50 కోట్లతో మెగా బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. అయితే, అధికారులు ఊహించనంత వేగంగా విలీన ప్రక్రియ ముగియడంతో, ఇపుడు విలీనమైన 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాల్టీల బడ్జెట్‌ను కూడా ఇందులో కలపాలని నిర్ణయించారు. ఈ 27 స్థానిక సంస్థల బడ్జెట్ అంచనా కనిష్టంగా రూ.50 కోట్ల నుంచి ఉండగా, మొత్తం కలిపి రూ. 2 వేల కోట్లు వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ అంచనా ప్రకారం, జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా రూ.13 వేల పైచిలుకు కోట్లతో భారీ బడ్జెట్‌ను తయారు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ కసరత్తులో భాగంగా గత సెప్టెంబర్‌లో జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల ప్రతిపాదనలను అధికారులు సేకరించారు.
Also Read: Jayasudha: అప్పుడే ఎవరికీ తలవంచలేదు.. పవన్ కళ్యాణ్‌పై జయసుధ సంచలన కామెంట్స్!
జనవరిలో కౌన్సిల్ సమావేశం!
రూ.13 వేల కోట్లకు పైబడిన ఈ బడ్జెట్‌ను కౌన్సిల్ ముందు పెట్టేందుకు వచ్చే నెలలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని పాలక మండలి, అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 10వ తేదీతో పాలక మండలి అధికార గడువు ముగియనున్నందున, జనవరి మాసం చివరిలో గానీ, ఫిబ్రవరి ప్రారంభంలో గానీ ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహించి, వార్డుల పునర్విభజన డ్రాఫ్ట్, బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసి ప్రభుత్వానికి పంపాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: Chiranjeevi: గ్లోబల్ సమ్మిట్‌కు పిలవడానికి మంత్రులు వచ్చినప్పుడు నేను ఏ పొజిషన్‌లో ఉన్నానో తెలుసా?

