Hyderabad: గణేష్ ఉత్సవాల్లో డైలీ 1550 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ
మొత్తం 11 రోజుల చెత్త 17 వేల 49 మెట్రిక్ టన్నులు
నిమజ్జనాల తర్వాత హుస్సేన్ సాగర్ నుంచి 7 వేల మెట్రిక్ టన్నుల విగ్రహాల వ్యర్థాలు వెలికితీత
వ్యర్థాల సేకరణ ప్రక్రియను వేగవంతంగా చేసిన హెచ్ఎండీఏ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో గల్లీ గల్లీలో కొలువుదీరి, నిమజ్జనమైన గణేష్ ఉత్సవాల్లో ఈసారి భారీగా చెత్త పేరుకుపోయింది. గత నెల 27 నుంచి ఈ నెల 7వ తేదీ రాత్రి వరకు కొనసాగిన నిమజ్జనంలో భాగంగా మొత్తం 17 వేల 49 మెట్రిక్ టన్నుల చెత్తను జీహెచ్ఎంసీ సేకరించింది. జవహర్ నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలించింది. వినాయక నవరాత్రి ఉత్సవాలు మొదలైన గత నెల 27 తర్వాత మూడు రోజుల్లో 29వ తేదీన జరిగిన నిమజ్జనం మొదలుకుని నగరంలోని అన్ని మండపాల నుంచి, నిమజ్జనం జరిగిన పాయింట్ల వద్ద రోజుకి 1,550 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ సారి కూడా నిమజ్జనం 2 రోజుల పాటు జరగటంతో నిమజ్జనం రూట్లలోని రోడ్లపై, మండపాల వద్ద, నిమజ్జనం పాయింట్ల వద్ద చెత్తను తొలగించేందుకు ఈ సారి జీహెచ్ఎంసీ ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్‌ను చేపట్టింది.
ఫైనల్ నిమజ్జనం మొదలైన శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి మొత్తం కూడా ఈ శానిటేషన్ డ్రైవ్ కొనసాగినట్లు, ఈ మొత్తం డ్రైవ్‌లో నిమజ్జనం సందర్భంగా అదనంగా సుమారు 17 వేల 49 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి, జవహర్ నగర్‌లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలించినట్లు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (హెల్త్, శానిటేషన్) సీఎన్ రఘుప్రసాద్ తెలిపారు. సాధారణ రోజుల్లో 8 వేల 300 మెట్రిక్ టన్నుల డైలీ ఉత్పత్తి అవుతుండగా, ఉత్సవాలు జరిగినన్నీ రోజులు డైలీ అదనంగా వచ్చిన 1550 మెట్రిక్ టన్నులతో కలిసి ప్రతి రోజు పది వేల మెట్రిక్ టన్నుల చెత్తను జీహెచ్ఎంసీ సేకరించి, తరలించిందని తెలిపారు. ఈ చెత్త సేకరణకు 3 షిఫ్టుల్లో మొత్తం 14 వేల 486 మంది పారిశుద్ధ్య కార్మికులను 160 గణేష్ యాక్షన్ టీమ్‌లుగా నియమించారని చెప్పారు. ముఖ్యంగా గణేష్ మండపాలు తక్కువగా ఉన్న జోన్లలోని శానిటేషన్ సిబ్బందికే ఈ మూడు షిఫ్టుల్లో డ్యూటీలు వేసినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ కార్మికులను వంద మీటర్లకు ఒక టీమ్ ను నియమించి, వారికి బ్లాక్ కవర్ బ్యాగ్ లను పంపిణీ చేయటంతో కార్మికులు వారికి కేటాయించిన స్ట్రెచ్ లలోని చెత్తను ఆ బ్లాక్ కవర్ బ్యాగ్ లలో ఎప్పటికపుడు నింపటం వల్ల గతేడాది కన్నా ఈ సారి చెత్త సేకరణ వేగంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. నిమజ్జనం చెత్తను సేకరించేందుకు 102 మినీ టిప్పర్లు, మరో 124 జేసీబీలను వినియోగించినట్లు అధికారులు తెలిపారు.
Read Also- Little Hearts: ‘లిటిల్ హార్ట్స్’ 3 డేస్ కలెక్షన్లు ఎంతో తెలుసా? ఆ రెండు సినిమాలూ అవుట్!
హుస్సేన్ సాగర్ లో మొత్తం విగ్రహాల వ్యర్థాలు 12 వేల మెట్రిక్ టన్నులు
హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసిన విగ్రహాల వ్యర్థాలు సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల వరకు ఉండవచ్చునని హెదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అంచనా వేసింది. గణేష్ నవరాత్రుల్లో మూడో రోజు నుంచి ఫైనల్ నిమజ్జనం జరిగిన ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం వరకే హెచ్ఎండీఏ దాదాపు 4,350 టన్నుల విగ్రహ వ్యర్థాలను వెలికి తీసిసింది. శనివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సుమారు మరో 2500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో కలిపి సోమవారం వరకు హెచ్ఎండీఏ 7 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వెలికి తీసినట్లు సమాచారం. ఇంకా హుస్సేన్ సాగర్ లో సుమారు 5 వేల మెట్రిక్ టన్నుల విగ్రహాల వ్యర్థాలున్నట్లు అంఛనా వేసిన హెచ్ఎండీఏ ఈ తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ వ్యర్థాలను లోయర్ ట్యాంక్ బండ్ లోని జీహెచ్ఎంసీ ట్రాన్స్ ఫర్ స్టేషన్ కు తరలిస్తున్నారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంతో మొత్తం 17 వేల 49 మెట్రిక్ టన్నుల చెత్తను జీహెచ్ఎంసీ సేకరించి, తరలించగా, హుస్సేన్ సాగర్ లో హెచ్ఎండీఏ వెలికి తీస్తున్న సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల విగ్రహాల వ్యర్థాలతో కలిపి మొత్తం ఉత్సవాల చెత్త, వ్యర్థాలు 32 వేల మెట్రిక్ టన్నులపైనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.