GHMC: అధికార పార్టీని ఇరికించేందుకు బీజేపీ బీఆర్ఎస్ స్కెచ్..!
GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: అధికార పార్టీని ఇరికించేందుకు బీజేపీ బీఆర్ఎస్ భారీ స్కెచ్..!

GHMC: కోటి మందికి పైగా జనాభాకు అవసరమైన అభివృద్ది పనులతో పాటు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ పాలక మండలి కౌన్సిల్ ఈ నెల 25న మరోసారి సమావేశం కానున్నట్లు సమాచారం. కాస్త ముందుగానే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని పాలక మండలి భావించినా, అందుకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఎలక్షన్ కోడ్ అడ్డురావటంతో ఎట్టకేలకు ఈ నెల 25న కౌన్సిల్ నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ అయింది. మేయర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం ఈ పాలక మండలి చివరి సమావేశం అయి ఉండవచ్చునని పలువురు పాలక మండలి సభ్యులు వ్యాఖ్యానించగా, వచ్చే జనవరి మాసంలో మరో సారి రానున్న ఆర్తిక సంవత్సరం (2026-27) కు సంబంధించిన వార్షిక బడ్జెట్ పై సమావేశమయ్యే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. 25న జరగనున్న కౌన్సిల్ సమావేశం రోజునే పాలక మండలి, సభ్యుల ఫొటో షూట్ కార్యక్రమాన్ని నిర్వహించి, జనవరిలో బడ్జెట్ పై జరగనున్న చిట్ట చివరి కౌన్సిల్ సమావేశంలో సభ్యులకు ఫొటోలను పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. జనవరి మాసంలో నిర్వహించనున్న చివరి కౌన్సిల్ సమావేశాన్ని కేవలం బడ్జెట్ ఆమోదం కోసం కొద్ది సేపు మాత్రమే నిర్వహించనున్నట్లు కూడా తెలిసింది.

సుమారు 95 ప్రశ్నలను..

2020 డిసెంబర్ ఎన్నికల్లో గెలిచి, 2021 ఫిబ్రవరిలో కొలువుదీరిన ఈ పాలక మండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుండటంతో 25న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో గడిచిన అయిదేళ్లలో నగరంలో చేపట్టిన పలు అభివృద్ది పనులపై, పరిపాలన పరంగా తీసుకువచ్చిన సరి కొత్త సంస్కరణలపై అధికార పార్టీ సభ్యులతో పాటు ఇతర పార్టీల వారిగా సభ్యులకు మాట్లాడే అవకాశమివ్వనున్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ సెక్రటరీ సెక్షన్ కార్పొరేటర్ల నుంచి సుమారు 95 ప్రశ్నలను స్వీకరించినట్లు సమాచారం. ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మేయర్ ప్రసంగం, ప్రశ్నోత్తరాల పర్వం వంటివి నిర్వహించనున్నట్లు తెలిసింది. హెచ్ సిటీ పనులు, ఎస్ఆర్ డీపీ పనులు, దశాబ్దాలుగా వివాదంగా ముడిపడి ఉన్న ప్రధాన కార్యాలయంలో పరిష్కారమైన విగ్రహాల పంచాయతీతో పాటు స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణకు తీసుకున్న నిర్ణయాలు, ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ బ్రేక్ ఫాస్ట్ క్యాంటీన్లతో పాటు ఈ సారి బతుకమ్మకు గిన్నీస్ రికార్డు ఆఫ్ వరల్డ్ లో స్థానం దక్కటం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలంగా పరిష్కారం కానీ సమస్యలపై గళం విప్పేందుకు మజ్లీస్ పార్టీ సిద్దమవుతుండగా, అధికార పార్టీని ఇరకాటం పెట్టేందుకు కమలనాథులు వ్యూహాన్ని సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి హెచ్ఎండీఏ, అడిషనల్ కలెక్టర్లను కూడా ఆహ్వానించాలన్న అంశంపై ఇటీవలే ప్రధాన కార్యాలయంలో నిరసన చేపట్టిన బీజేపీ ఈ నెల 25వ తేదీన కౌన్సిల్ లో ఇదే విషయంపై గట్టిగా ప్రశ్నించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజాసమస్యలపై నిలదీసేందుకు ఇప్పటికే ప్రశ్నలను సమర్పించినట్లు తెలిసింది.

Also Read: DGP Shivadhar Reddy: బాక్సర్ నిఖత జరీన్‌పై తెలంగాణ డీజీపీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

బడ్జెట్ పై లఘు చర్చకు ఛాన్స్

రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27) కు సంబంధించిన జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ పై ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సారి బడ్జెట్ రూ. 10 వేల కోట్లు దాటే అవకాశమున్నందున, బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ యాక్టు 1959 ప్రకారం నవంబర్ 10 లోపు స్టాండింగ్ కమిటీ, డిసెంబర్ 10 లోపు బడ్జెట్ ను ఆమోదించి తదుపరి ఆమోదం కోసం సర్కారుకు పంపాల్సి ఉన్నందున ఈ నెల 25న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ పై లఘు చర్చకు అవకాశం లేకపోలేదు. ఈ సమావేశంలో లఘు చర్చకు అనుమతిచి, సభ్యుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత జనవరిలో నిర్వహించాలని భావిస్తున్న కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ కూడా వ్యూహాత్మకంగా ఆమోద ముద్ర వేయాలని పాలక మండలి భావిస్తున్నట్లు తెలిసింది. ఇక మజ్లీస్, బీజేపీ పార్టీలు మాత్రం ఎప్పటిలాగే ప్రజా సమస్యలైన శానిటేషన్, దోమలు, కుక్కల బెడద, స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్, రోడ్ల నిర్వహణ, నాలాలు, వరద నీటి కాలువల నిర్వహణ వంటి అంశాలను ప్రస్తావించేలా ప్రశ్నలు సమర్పించిన్నట్లు తెలిసింది.

ఫిబ్రవరి 11 నుంచి స్పెషలాఫీసర్ పాలన?

జీహెచ్ఎంసీ పాలక మండలి ఫిబ్రవరి 10వ తేదీతో గడువు పూర్తి కావటంతో ఫిబ్రవరి 11 నుంచి బల్దియాలో స్పెషలాఫీసర్ పాలన కొనసాగే అవకాశమున్నట్లు సమాచారం. ప్రస్తుత కమిషనర్ ఆర్.వి. కర్ణన్ నే స్పెషలాఫీసర్ గా కొనసాగించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇటీవలే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బై ఎలక్షన్స్ లో విజయం సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ సిటీలో ఇప్పటికే ప్రతిపాదించి, నిధులను కూడా మంజూరు చేసిన హెచ్ సిటీ పనులపై ఫోకస్ పెట్టి, ఆ పనులు విజిబిలిటీ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికలు 2027లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గెలిచిన జోష్ తోనే త్వరలోనే జీహెచ్ఎంసీకి ఎన్నికల జరుగుతాయని రాజకీయంగా విశ్లేషణలున్నాయి. కానీ ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.

Also Read: Nizamabad Crime: స్నేహం పేరుతో ఇంట్లోకి వచ్చి.. పరిచయం పెంచుకుని ప్రమాదం తెచ్చిన మహిళ!

Just In

01

Minister Sridhar Babu: తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మహిళల కీలక పాత్ర : మంత్రి శ్రీధర్

Rumour Controversy: వారి బ్రేకప్‌ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటున్న కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది..

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!