Hydraa: పార్కుల నామరూపాలు లేకుండా చేస్తున్నారని, పార్కుల్లో ఆలయాలు నిర్మించేసి, ఆ పక్కనే చిన్న చిన్న మల్గీలు, షాపులను ఏర్పాటు చేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. లే ఔట్‌లలో పార్కులకోసం కేటాయించిన స్థలాలన్నిటికీ ఫెన్సింగ్‌లు వేసి కాపాడాలంటూ పలువురు సోమవారం హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అలాగే ప్రభుత్వ స్థలాలకు కూడా కాపాడాలని కోరారు. అమీన్‌పూర్ పెద్దచెరువు, రావి ర్యాల చెరువుల విస్తీర్ణం ఏటా పెరుగుతూ ఎగువ భాగంలో ఉన్న నివాసాలను ముంచెత్తుతున్నాయని ఆయా ప్రాంతాల వాసులు హైడ్రాకు మొరబెట్టుకున్నారు. మూసేసిన తూములు తెరిపించడంతో పాటు అలుగు ఎత్తును కూడా తగ్గించాలని పలువురు కోరుతున్నారు.
ప్రజావాణికి మొత్తం 47 ఫిర్యాదులు
గతంలో వ్యవసాయ వినియోగం వల్ల నీటి నిలువలు తగ్గేవని, ఇప్పుడు మురుగు నీటితో నిండి ఎగువున ఉన్న ప్రాంతాలు మునుగుతున్నాయని వాపోయారు. ఓల్డ్ అల్వాల్ సర్వే నెంబరు 576లో క్వారీకోసం తవ్విన గుంతల్లో మురుగు నీరు చేరి పరిసరాలన్నీ దుర్గంధభరితంగా మారాయని గంగ అవెన్యూ రెసిడెంట్స్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ గుంతలను మట్టితో పూడ్చి పార్కులుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇలా సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 47 ఫిర్యాదులందినట్లు, వీటిని హైడ్రా అదనపు కమిషనర్ ఎన్ అశోక్ కుమార్ పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.
Also Read: Ippa Flower Laddu: ఇప్పపువ్వు లడ్డూల టర్నోవర్.. రికార్డును సృష్టించిన ఆదివాసీ మహిళా సహకార సంఘం
ఫిర్యాదుల వివరాలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం మచ్చబొల్లారం గ్రామం సర్వే నెంబరు188లో 30 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని బాలాజీ ఎన్‌క్లేవ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 60 కాలనీలలో 60 వేలకు పైగా ఇళ్లున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మించేందుకు ఈ భూమిని కేటాయించేలా సిఫారసు చేయాలని కూడా కోరారు. ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలని కోరారు. సంగారెడ్డి(Sangareddy) జిల్లా అమీన్‌పూర్ పెద్ద చెరువు విస్తీర్ణం ఏటా పెరిగిపోయి ఎగువున ఉన్న తమ ప్లాట్లు మునిగిపోయాయని పలువురు ఫిర్యాదు చేశారు. గతంలో తూముల ద్వారా కిందకు నీరు వెళ్లేదని ఇప్పుడు వాటిని పూర్తిగా బంద్ చేయడంతో మురుగు, వర్షం నీరంతా చెరువులోకి చేరుతోందని వాపోయారు. అలుగు ఎత్తును కూడా పెంచేయడంతో మరింత ఇబ్బంది తలెత్తిందని తెలిపారు. అలుగు ఎత్తు తగ్గించినా తమకు ప్రయోజనం కలుగుతుందని చెరువు పైభాగంలో ఉన్న పలు లే ఔట్‌లలోని ప్లాట్ యజమానులు తెలిపారు.
పార్కుల్లో మందిరాలు
గతంలో వేసిన రహదారులు, విద్యుత్ స్తంభాలు నీట మునిగినట్టు స్పష్టంగా కనబడుతున్నాయని ఈ విషయంలో ప్రభుత్వం సరైన విధానాన్ని పాటించి చెరువు వాస్తవ విస్తీర్ణం నిర్ణయించాలని కోరారు. ఇదే పరిస్థితి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల విలేజ్‌లో కూడా ఉందని అక్కడ నివాసితులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల విలేజ్‌లో తెలంగాణ హౌజింగ్ బోర్డు(Telangana Housing Board) కాలనీలో ఖాళీ స్థలాలు మాయమవుతున్నాయని అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు. 545 ప్లాట్లతో ఉన్న ఈ లే ఔట్‌లో ఉన్న ఖాళీ స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నాయి. పార్కుల్లో మందిరాలు కట్టి, షెడ్డులు, మలిగీలుగా మార్చి అద్దెలకు ఇస్తున్నారని, రోడ్లు బ్లాక్ చేసి ఇష్టానుసారం ఖాళీ స్థలాలు కాజేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని బాగ్‌లింగంపల్లి డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో పిల్లల పార్కు కబ్జాకు గురైంది.1300ల గజాల స్థలంలో స్టీల్, ఐరన్ దుకాణాలు, సర్వీసింగ్ సెంటర్లు పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారని.. ఈ కబ్జాలను తొలగించాలని హౌజింగ్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని అక్కడి నివాసితులు వాపోయారు. వ్యాపార దందాలు ఆపి, పార్కును కాపాడాలని హైడ్రాకు విన్నవించారు.
Also Read: Bhatti Vikramarka: నవీన్ పీజేఆర్‌లా పనిచేస్తారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ప్రజలకు మంత్రుల విజ్ఞప్తి!
