Drugs Seized: డ్రగ్స్ మహమ్మారికి చెక్ పెట్టే దిశలో ఈగల్ టీం అధికారులు భారీ విజయాన్ని సాధించారు. (Hyderabad) హైదరాబాద్‌లోని వేర్వేరు పబ్బులే కేంద్రంగా నడుస్తున్న మాదక ద్రవ్యాల దందా వినియోగం గుట్టును రట్టు చేశారు. ఈ క్రమంలో కీలక సూత్రధారితోపాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. పలు పబ్బుల యజమానులు, డైరెక్టర్లపై కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన వారి నుంచి కొకైన్, ఓజీ కుష్ గంజాయి, ఎక్టసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో లోకల్ పెడ్లర్లతోపాటు నైజీరియన్ల నుంచి వీటిని తెప్పించుకుంటూ అమ్ముతున్నట్టుగా వెల్లడైంది. ఇక, కొనుగోలుదారుల్లో డాక్టర్లు, ఐటీ ప్రొఫెసనల్స్, జిమ్‌ల నిర్వాహకులు ఉన్నట్టు తేలింది.
ఉన్నత చదువులు చదివి..
కొంపల్లి (Kompally) వాస్తవ్యుడైన సూర్య బీటెక్ గ్రాడ్యుయేట్. ఆ తరువాత ఎంబీఏ కూడా పూర్తి చేశాడు. (Bangalore) బెంగళూరులోని ఓ పేరున్న సంస్థలో సేల్స్ మేనేజర్‌గా ఉద్యోగం కూడా చేశాడు. సొంతంగా వ్యాపారం చేద్దామని 2020లో హైదరాబాద్ తిరిగి వచ్చిన సూర్య కొంపల్లి ప్రాంతంలోనే మల్నాడు రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఇక్కడికి వచ్చిన తరువాత తనతోపాటు చదువుకున్న సహ విద్యార్థులు, బంధువుల్లో కొందరు డ్రగ్స్ సేవిస్తున్న విషయం సూర్యకు తెలిసింది. దాంతో తాను కూడా మాదక ద్రవ్యాలు సేవించడం మొదలు పెట్టిన సూర్య ఆ తరువాత డ్రగ్స్ దందాకు శ్రీకారం చుట్టాడు.
Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్
పక్కా సమాచారంతో..
సూర్య సాగిస్తున్న ఈ దందా గురించి పక్కాగా సమాచారాన్ని సేకరించిన సైబరాబాద్ (Cyberabad) నార్కొటిక్ పోలీసులు అతను తన టాటా స్కార్పియో కారులో వెళుతుండగా మల్నాడు రెస్టారెంట్ వద్ద పట్టుకున్నారు. తనిఖీలు చేయగా కారు డ్యాష్ బోర్డులో 3.2 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 1.6గ్రాముల ఎక్టసీ పిల్స్ దొరికాయి. ఇక, మహిళలు ధరించే హై హీల్స్ చెప్పుల హీల్ భాగంలో పింక్ కలర్ కార్డ్ బోర్డ్ డబ్బాలో పెట్టిన 10 గ్రాముల కొకైన్ లభ్యమైంది. ఈ డ్రగ్స్‌ను ఫాతిమా పేరున మారుతీ కొరియర్ ద్వారా ఇక్కడికి తెప్పించుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.
లోకల్ పెడ్లర్ల నుంచి..
విచారణలో సూర్య హిమాయత్ నగర్ నివాసి హర్ష, కరీంనగర్‌కు చెందిన సందీప్ జువ్వాడి, ఖాజాగూడ వాస్తవ్యుడు పల్లెపాక మోహన్‌ల నుంచి మొదట డ్రగ్స్ తెప్పించుకునే వాడని వెల్లడైంది.
నైజీరియన్ల నుంచి కూడా..
ఇక, నైజీరియా దేశానికి చెంది ఢిల్లీ, బెంగళూరు, గోవాల్లో ఉంటున్న నిక్, జెర్రీ, డెజ్మాండ్, స్టాన్లీ, ప్రిన్స్‌ల నుంచి కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా తెప్పించుకుంటూ ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. నైజీరియా దేశానికి చెందిన సప్లయర్లకు వారి పేర ఉన్న కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ఖాతాల్లో డబ్బు జమ చేసేవాడని తేలింది.
20 సార్లకు పైగా..
2021 – 25 మధ్య తాను 20 సార్లకు పైగా కొకైన్‌ను కొనుగోలు చేసినట్టుగా సూర్య విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్‌లోని ప్రిజం పబ్, ఫార్మ్ పబ్, బ్లాక్ 22, బర్డ్ బాక్స్, జోరా, బ్రాడ్ వే, క్వాక్ ఎరీనా తదితర పబ్బుల్లో స్నేహితులు, ఇతరులతో కలిసి ఈ డ్రగ్స్‌తో పార్టీలు చేసుకున్నట్టుగా చెప్పాడు. ఈ పబ్బుల్లో డ్రగ్స్ సేవించడానికి ప్రత్యేక గదులు, సౌకర్యాలు ఉంటాయని తెలిపాడు. ఈ క్రమంలో అధికారులు క్వాక్ ఎరీనా పబ్‌కు చెందిన రాజశేఖర్, బ్రాడ్ వే పబ్బు ఓనర్ రోహిత్ మాదిశెట్టి, జోరా పబ్బుకు చెందిన పృథ్వీ వీరమాచినేనిపై కూడా కేసులు నమోదు చేశారు.
Also Read:Crime News: ఇదేం పనిరా బాబు.. షాక్‌లో పోలీసులు
తరచూ గోవా వెళ్తూ..
ఇక, స్నేహితులతో కలిసి తరచూ గోవా వెళ్తూ నైజీరియా దేశానికి చెందిన డెజ్మాండ్, స్టాన్లీల నుంచి కొకైన్ కొనేవాడినని కూడా అతను చెప్పాడు. 2022లో ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లికి వెళ్లినప్పుడు నైజీరియా దేశానికే చెందిన ప్రిన్స్‌తో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి అతని ద్వారా కూడా కొకైన్ తెప్పించుకుంటున్నానని తెలిపాడు.
వినియోగదారుల్లో డాక్టర్లు
ఇక, సూర్య నుంచి డ్రగ్స్ కొంటున్న వారిలో డాక్టర్లు, ఐటీ ఉద్యోగులు, పబ్బుల డైరెక్టర్లు, జిమ్‌ల పార్టనర్లు ఉన్నట్టుగా విచారణలో తేలింది. భీమవరానికి చెంది ఓ ప్రముఖ హాస్పిటల్‌లో కార్డియాలజిస్టుగా పని చేస్తున్న డాక్టర్ ప్రసన్న ఇప్పటి వరకు సూర్య నుంచి 20 సార్లు డ్రగ్స్ కొన్నట్టుగా వెల్లడైంది. ఇతనితోపాటు మరో 23 మంది వ్యాపారవేత్తలకు కూడా సూర్య డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా తేలింది. మాదక ద్రవ్యాల దందా ద్వారా వస్తున్న నగదు లావాదేవీలు జరపడానికి సూర్య తన వ్యక్తిగత, కమర్షియల్ బ్యాంకుల ఖాతాలతోపాటు టెర్నియన్ హాస్పిటాలిటీకి లింక్ అయి ఉన్న మాదాపూర్‌లోని సిర్క్ రెస్టారెంట్ అకౌంట్‌ను ఉపయోగించుకున్నట్టుగా వెల్లడైంది.
ఆరుగురి అరెస్ట్
సైబరాబాద్ (Cyberabad) నార్కొటిక్ స్టేషన్ అధికారులు సూర్యతోపాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం సెక్షన్ 8(సీ), 20(పీ)(2)(ఏ), 22(ఏ), 22(బీ), 27ఏ, 29ల ప్రకారం కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నట్టు ఈగల్ టీం ఉన్నతాధికారులు తెలిపారు. నిధుల ప్రవాహం ఎలా, ఎవరెవరి నుంచి జరిగింది, ఏయే కొరియర్ సంస్థల ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నారు, పబ్బులు, ఇతర వాణిజ్య సంస్థల పాత్ర ఏంది అనే కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్టు చెప్పారు.
Also Read: Alia Bhatt: అలియాకు బిగ్ షాక్.. రూ.77 లక్షలు స్వాహా.. ఇలా కూడా మోసపోతారా?