Telangana DGP: అర్జెంటీనా దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు రానున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అందరిలోని ఆసక్తి ఏర్పడింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ఈ మ్యాచ్ ను వీక్షించనుండటంతో హైప్ మరింత పెరిగింది. దీనికి తోడు కోల్ కత్తాలో మెస్సీ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఉప్పల్ స్టేడియాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ కీలక సూచనలు చేశారు.
‘కోల్‌కత్తా ఉద్రిక్తతలతో అలర్ట్ అయ్యాం’
మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం, దాని పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. కోల్ కత్తా స్టేడియంలో మెస్సీ రాక సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలతో తాము అలర్ట్ అయినట్లు పేర్కొన్నారు. భద్రతను స్వయంగా వచ్చి సమీక్షించినట్లు తెలిపారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా భద్రతను మరింత పెంచినట్లు తెలిపారు. కోల్ కత్తాలో రోప్ పార్టీలు లేకపోవడం వల్ల ఫ్యాన్స్ కట్టడి చేయడం కష్టతరంగా మారినట్లు డీజీపీ అభిప్రాయపడ్డారు. అలాంటి తప్పిదాలు ఉప్పల్ స్టేడియంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. మెుత్తం 20 రోప్ పార్టీలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. అభిమానులు గ్రౌండ్ లోపలికి వెళ్లకుండా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.
మ్యాచ్ షెడ్యూల్ ఇదే: డీజీపీ
మరోవైపు మెస్సీ – సీఎం మ్యాచ్ కు సంబంధించిన కీలక విషయాలను సైతం డీజీపీ తెలియజేశారు. ‘మెస్సీ సా. 7 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. 7.00 నుంచి 7.15 గం.ల వరకు మ్యాచ్ ఆడతారు. చివరి 5 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫ్రెండ్లి మ్యాచ్ ఆడతారు. సా.7.30 గంటల నుంచి 20 నిమిషాల పాటు చిన్న పిల్లలకు ఫుట్ బాల్ టెక్నిక్స్ మెస్సీ నేర్పిస్తారు. అనంతరం మెస్సీని సీఎం రేవంత్ రెడ్డి సన్మానిస్తారు. మెస్సీ గ్రౌండ్ లో 10 నిమిషాలు ఒక రౌండ్ పర్యటిస్తారు’ అని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read: Messi Hyderabad Visit: కోల్‌కత్తా ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్.. మెస్సీ కోసం భారీ భద్రత
టికెట్ల్ లేని వాళ్లు రావొద్దు: డీజీపీ
అయితే ఇది పూర్తిస్థాయి ఫుట్ బాల్ మ్యాచ్ అనుకోవద్దని అభిమానులకు డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. స్టేడియం వద్ద ఎలాంటి టికెట్స్ అమ్మకాలు జరగవని స్పష్టం చేశారు. అభిమానులు ఎవరూ పాస్ లు లేకుండా స్టేడియం వద్దకు రావొద్దని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మెస్సీని కలవడానికి స్టేడియానికి వస్తున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు. ఇక స్టేడియం లోపల మెస్సీతో ఫొటోలు, సెల్ఫీలు దిగే అవకాశం లేదని డీజీపీ తెలిపారు. కాబట్టి ఫ్యాన్స్ ఎవరూ ఆ ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. టికెట్స్ ఉన్న వారు మాత్రమే స్టేడియం లోపలికి అనుమతిస్తామని మరోమారు డీజీపీ పునరుద్ఘటించారు.

