Messi – Kolkata Tour: అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ మూడ్రోజుల పర్యటనలో భాగంగా భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత కోల్ కత్తాలో అడుగుపెట్టిన మెస్సీకి అడుగడుగునా అభిమానులు సాదర స్వాగతం పలికారు. నగరంలోని సాల్ట్ లేక్ స్డేడియంలో మెస్సీ మ్యాచ్ ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన హీరో ఆట చూడాలని వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి టికెట్లు కొనుగోలు చేశారు. అలాంటిది మెస్సీ మైదానంలో ఆడకపోవడం, త్వరగా స్టేడియం నుంచి వెళ్లిపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో మైదానంలోకి దూసుకొచ్చి ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు.
మైదానంలో గందరగోళం..
మెస్సీ మ్యాచ్ చూడాలని ఎంతో ఆత్రూతగా సాల్ట్ లేక్ స్టేడియంకు వచ్చిన అభిమానులు.. తీవ్ర గందరగోళం సృష్టించారు. మెస్సీ కనీసం 10 నిమిషాలు కూడా మైదానంలో లేకపోవడంతో ఒక్కసారిగా అసహానానికి గురై స్టేడియంలోకి దూసుకెళ్లారు. కూర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్ లను కూల్చివేశారు. మెస్సీతో పాటు బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో కోల్ కత్తా పోలీసులు రంగంలోకి దిగారు. స్టేడియంలో లాఠీచార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు.
Messi’s brief 5-minute appearance sparked chaos at Salt Lake Stadium, West Bengal as angry fans turned violent, throwing bottles, belts, chairs and vandalising hoardings.#Messi𓃵 #GOAT #MessiInIndia
pic.twitter.com/PwRzP7BDeD— Sarcasm (@sarcastic_us) December 13, 2025
ఒక్కో టికెట్ రూ. 5,000-25,000!
అయితే మెస్సీ మైదానంలో ఆడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. రూ.5000 నుంచి రూ.25,000 వరకూ ఖర్చు చేసి మరి టికెట్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తీరా మెస్సీ మైదానంలోకి దిగకపోవడం.. 10 నిమిషాల్లోపే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అభిమానులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. తమ ఆక్రోశాన్ని ఆపుకోలేక మైదానంలోకి దిగి వీరంగం సృష్టించినట్లు తెలుస్తోంది. కాగా మెస్సీ ఉ. 11.15 గం.లకు స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నాడు. అయితే అతడు స్టేడియం మెుత్తాన్ని ఒకసారి చుట్టివస్తాడని ముందుగానే ప్రకటించినప్పటికీ అలా జరగలేదు. మెస్సీ స్టేడియం నుంచి ఎగ్జిట్ అయిన కొన్ని క్షణాల్లోనే పరిస్థితులు అదుపుతప్పాయి.
Also Read: Phone Tapping Case: లొంగిపోయిన ప్రభాకర్ రావు.. వారం రోజులపాటు కస్టడీ విచారణ!
సీఎం ఈవెంట్ క్యాన్సిల్..
మైదానంలో మెస్సీతో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కత్తా వచ్చినప్పటికీ గందరగోళ పరిస్థితుల కారణంగా ఈవెంట్ ను రద్దు చేశారు. మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా అది కూడా క్యాన్సిల్ అయ్యింది. మరోవైపు ఓ అభిమాని దీనిపై స్పందిస్తూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమను నిర్వాహకులు దారుణంగా మోసం చేశారని వాపోయారు. మెస్సీ మైదానంలో ఆడతారని నమ్మించి.. భారీ ధరలకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు.

