Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) సిట్ అధికారుల ఎదుట సరెండర్ అయ్యారు. ఆ వెంటనే హైదరాబాద్ జాయింట్ కమిషనర్ (క్రైమ్స్) తఫ్సీర్ ఇక్భాల్, సిట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి విచారణను ప్రారంభించారు.
సిట్ ముందు సరెండర్
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు (Prabhakar Rao) ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దీనికి సంబంధించి కేసులు నమోదు కాగానే అమెరికా పారిపోయిన ఆయన, సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించిన తరువాత స్వదేశానికి వచ్చారు. పలుమార్లు సిట్ విచారణకు హాజరు కూడా అయ్యారు. అయితే, విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా ప్రభాకర్ రావు సహకరించడం లేదని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది.
ఆయనకు కల్పించిన మధ్యంతర రక్షణను తొలగించి కస్టోడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిట్ అధికారుల ఎదుట సరెండర్ కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఫిజికల్ టార్చర్ చేయవద్దంటూ సిట్ అధికారులకు సూచించింది. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు ఉదయం 10.30 గంటల సమయంలో సిట్ కార్యాలయానికి వచ్చి అధికారుల ఎదుట సరెండర్ అయ్యారు. ఆ తరువాత జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్భాల్ ఆధ్వర్యంలో విచారణ మొదలైంది.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అసలు సూత్రధారుల పేర్లు బయటకొస్తాయా?
నోరు తెరవని ప్రభాకర్ రావు
అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకున్న బీఆర్ఎస్ (BRS) సర్వశక్తులు ఒడ్డింది. ఈ క్రమంలోనే ఆ పార్టీలోని కొందరు కీలక నేతలు అప్పట్లో ఎస్ఐబీ ఛీఫ్‌గా ఉన్న ప్రభాకర్ రావు ద్వారా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, ఆయా రాజకీయ పక్షాలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న పారిశ్రామికవేత్తల ఫోన్లను ఎలక్షన్లకు ముందు ట్యాప్ చేయించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. చివరకు కొందరు హైకోర్టు జడ్జిలతోపాటు జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న వార్తలు వచ్చాయి.
ఎవరు ఆదేశాలు ఇచ్చారు?
అయితే, ఇంతకు ముందు జరిపిన విచారణలో ప్రభాకర్ రావు దీనికి సంబంధించి ఎలాంటి వివరాలను వెల్లడించ లేదు. ఈ నేపథ్యంలోనే ఆయనను కస్టోడియల్ విచారణకు తీసుకున్న సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఏ రాజకీయ నాయకులు చెబితే ఈ పని చేశారు? అని ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే, ఈసారి కూడా ప్రభాకర్ రావు నోరు విప్పలేదని సమాచారం. తన పై అధికారులు చెబితేనే ఫోన్లను ట్యాప్ చేశానని చెప్పినట్టు సమాచారం. ఇదంతా రివ్యూ కమిటీ ఆమోదంతోనే జరిగిందని అన్నట్టుగా తెలియవచ్చింది.
నేటి నుంచి మరింత లోతుగా
ఫోన్ ట్యాపింగ్ సమయంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్ల గురించి ప్రశ్నించగా చికిత్స తీసుకోవడానికి అమెరికా వెళ్లినప్పుడు వాటిని అక్కడే మరిచిపోయి వచ్చానని జవాబిచ్చినట్టుగా తెలియవచ్చింది. హార్డ్ డిస్కులను ధ్వంసం చేయమని ఎస్ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్ రావుకు మీరే ఆదేశాలు ఇచ్చారా అని అడిగితే లేదని అన్నట్టుగా సమాచారం. మొదటి రోజు కావడంతో దర్యాప్తు అధికారులు ప్రభాకర్ రావును నిశితంగా ప్రశ్నించ లేదని తెలిసింది.
ప్రభాకర్ రావు ఎదుట కూర్చోబెట్టి విచారణ చేయాలి
నేటి నుంచి విచారణను మరింత లోతుగా జరుపనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు విచారణలో ఇచ్చిన స్టేట్‌మెంట్లను ముందు పెట్టుకుని ప్రభాకర్ రావుకు ప్రశ్నలు సంధించాలని అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. అవసరమైతే అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న ఈ కేసులోని నిందితులను ఒక్కొక్కరిగా ప్రభాకర్ రావు ఎదుట కూర్చోబెట్టి విచారణ చేయాలని నిశ్చయించినట్టు సమాచారం.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అసలు సూత్రధారుల పేర్లు బయటకొస్తాయా?

