Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
Phone Tapping Case ( image CREDit: swetcha reporter)
Telangana News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అసలు సూత్రధారుల పేర్లు బయటకొస్తాయా?

Phone Tapping Case: సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్ కేసులో ఎస్​ఐబీ మాజీ ఛీఫ్​ ప్రభాకర్ రావు (Prabhakar Rao)కు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. ఇవాళ ఉదయం 11 గంటలలోపు కేసు విచారణ చేస్తున్న సిట్​ ఎదుట లొంగిపోవాలంటూ ఆయనకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఫోన్​ ట్యాపింగ్ కేసులో సంచలన వివరాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

అలా వెలుగులోకి

క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని దక్కించుకుని హ్యాట్రిక్​ సాధించాలని బీఆర్​ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్న వారి మొబైల్ ఫోన్లను ట్యాప్​ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత కొన్ని రోజులకే ఫోన్​ ట్యాపింగ్ బాగోతం వెలుగు చూసింది. దీని వెనుక గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలోని కీలక నేతల పాత్ర ఉన్నట్టుగా బలమైన ఆరోపణలు వచ్చాయి.

దాంతో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Revanth Reddy) దీనిపై సిట్ విచారణకు ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ఏర్పాటైన సిట్​ ముందుగా ఈ కేసులో ఎస్​ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్ రావును అరెస్ట్ చేసింది. ఆయనను జరిపిన విచారణలో వెల్లడైన వివరాల మేరకు టాస్క్​ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్​ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా సిట్​ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని ప్రశ్నించిన నేపథ్యంలో వెలుగు చూసిన సమాచారంతో బీఆర్​ఎస్ హయాంలో ఎస్​ఐబీకి ఛీఫ్‌గా పని చేసిన ప్రభాకర్ రావును కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఓ ఛానల్​ యజమాని శ్రవణ్​ రావును కూడా నిందితుడిగా పేర్కొన్నారు.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర రావుకు బిగ్ షాక్.. సుప్రీం కీలక ఆదేశాలు

అమెరికా జంప్

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై కేసులు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా వాటిని పట్టించుకోలేదు. పైగా, రాజకీయ కారణాలతో తనను వేధిస్తున్నారని, క్యాన్సర్​ వ్యాధితో బాధపడుతున్న తనకు పౌరసత్వాన్ని ఇవ్వాలని అమెరికా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దాంతో దర్యాప్తు అధికారులు ప్రభాకర్ రావు పాస్ పోర్టును రద్దు చేయించారు. సీబీఐ ద్వారా అతడి పేరు మీద రెడ్ కార్నర్​ నోటీస్​ జారీ చేయించారు. ఇంటర్​ పోల్ సహాయంతో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దాంతో తప్పనిసరై ప్రభాకర్​ రావు స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే, ఇక్కడకు రావడానికి ముందు తనకు బెయిల్​ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్​ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దని, ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర రక్షణ కల్పించింది. అదే సమయంలో సిట్ విచారణకు పూర్తిగా సహకరించాలంటూ ప్రభాకర్ రావును ఆదేశించింది.

సహకరించని ప్రభాకర్​ రావు

సిట్ అధికారులు పలుమార్లు ప్రభాకర్ రావును విచారణకు పిలిపించారు. అయితే, ఎన్ని రకాలుగా ప్రశ్నించినా కేసులోని కీలక వివరాలను వెల్లడించలేదు. పైగా, ఫోన్​ ట్యాపింగ్ సమయంలో ఉపయోగించిన డిజిటల్​ పరికరాల్లోని డేటాను డిలీట్ చేశారు. మొబైల్ ఫోన్లు మాయం చేశారు. ఐ క్లౌడ్ అకౌంట్​ పాస్​ వర్డ్​ కూడా ఇవ్వలేదు.

సుప్రీంకు వెళ్లిన ప్రభుత్వం

ప్రభాకర్​ రావు విచారణకు సహకరించడం లేదంటూ సుప్రీంకోర్టులో కొంతకాలం క్రితం ప్రభుత్వం పిటిషన్​ దాఖలు చేసింది. ఆయనకు కల్పించిన మధ్యంతర రక్షణను ఉపసంహరించాలంటూ అందులో కోరింది. దీనిపై సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్​ నాగరత్న, జస్టిస్​ ఆర్​ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో ఐ క్లౌడ్ అకౌంట్ పాస్ వర్డ్ ఇవ్వడంతోపాటు విచారణకు సహకరించాలని ప్రభాకర్​ రావును మరోసారి ఆదేశించింది. గురువారం దీనిపై మరోసారి విచారణ జరిగిన సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా ప్రభాకర్​ రావు ఐ క్లౌడ్ అకౌంట్​ పాస్​ వర్డ్​ ఇవ్వలేదని తెలిపారు. కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మౌనం వహిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కల్పించిన మధ్యంతర రక్షణను ఉపసంహరిస్తూ నేడు ఉదయం 11 గంటలలోపు సిట్​ ఎదుట సరెండర్ కావాలంటూ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈసారి నోరు తెరిచే అవకాశం?

సుప్రీంకోర్టు సరెండర్​ కావాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నేటి నుంచి జరగబోయే విచారణలో ప్రభాకర్​ రావు నోరు తెరిచే అవకాశాలు ఉన్నట్టుగా పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకు ముందు సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర రక్షణ ఉండడం, కొన్ని గంటలపాటు మాత్రమే విచారించి తిరిగి పంపించి వేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు కీలక సమాచారాన్ని వెల్లడించ లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులతో ప్రభాకర్​ రావుకు ఆ వెసులుబాటు ఉండదని తెలిపాయి. అతడిని సిట్ అధికారులు తమ నిర్బంధంలోనే పెట్టుకుని ప్రశ్నిస్తారని పేర్కొన్నాయి. దాంతో ఆయన నోరు తెరవక తప్పదని అంటున్నాయి. అదే జరిగితే ఈ కేసులో సంచలన వివరాలు వెలుగు చూస్తాయని కూడా పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఫోన్​ ట్యాపింగ్​ వెనుక ఉన్న అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వంలోని కీలక నేతలు ఎవరు అనేది కూడా బయట పడవచ్చని అంటున్నాయి. ఆ నాయకుల పేర్లు బయటకు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం తప్పదని వ్యాఖ్యానించాయి.

ఫోన్​ ట్యాపింగ్ కేసు టైం లైన్

– మే 29న మూడు రోజుల్లో భారత్​‌కు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
– తాత్కాలిక పాస్ పోర్టుపై తిరిగి వచ్చిన ప్రభాకర్​ రావు
– మొదటిసారి జూన్​ 9న సిట్​ విచారణకు హాజరు
– జూన్ 11, 15, 17, 19, 20వ తేదీల్లో సిట్​ అధికారుల ఎదుట హాజరు
– దర్యాప్తు చేస్తున్న సమయంలో విచారణాధికారులకే వార్నింగ్​ ఇచ్చిన ప్రభాకర్​ రావు. అన్ని రోజులు మీవే కావు, మాకూ టైమ్ వస్తుందని హెచ్చరిక
– కేసులో 270 మంది బాధితుల వాంగ్మూలాల నమోదు

బాధితులు వీరే

కేంద్ర మంత్రి బండి సంజయ్​, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్​ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​, టీఆర్​ఎంఈఎస్​ ఛైర్మన్​ ఫయీముద్దీన్​, మహబూబ్​ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి, గద్వాల్ జడ్పీ ఛైర్ పర్సన్​ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్సీ కవిత పీఏ, డ్రైవర్, పనిమనిషి చక్రధర్ గౌడ్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐఏఎస్​ అధికారి రఘునందన్​ రావు, మాజీ సీఎం కేసీఆర్​ ఓఎస్డీ రాజశేఖర్​ రెడ్డితోపాటు పలువురు జర్నలిస్టుల నుంచి సిట్ అధికారులు స్టేట్‌మెంట్లు తీసుకున్నారు.

నిందితులు వీరే

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఎస్​ఐబీ మాజీ ఛీఫ్​ ప్రభాకర్​ రావు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఏ2గా ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, ఏ3గా ఎస్​ఐబీ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఏ4గా మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న, ఏ5గా టాస్క్ ఫోర్స్​ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఏ6గా ఓ ఛానల్​ ఎండీ శ్రవణ్​ రావు ఉన్నారు. వీరిలో ప్రభాకర్​ రావు మినహా మిగితా వారందరినీ సిట్​ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఆ తరువాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఇక, ప్రభాకర్​ రావు పాత్రపై సిట్​ అధికారులు కోర్టుకు 68 పేజీల ఛార్జిషీట్‌ను సమర్పించారు.

Also Read: Phone Tapping Case: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు