Messi Hyderabad Visit: లియోనెల్ మెస్సీ రాక నేపథ్యంలో కోల్ కత్తా సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి మెస్సీ నేరుగా హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ఇక్కడి పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరికొన్ని గంటల్లో మెస్సీ రానున్న సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్, తాజ్ ఫలక్ నామ ప్యాలెస్, ఉప్పల్ స్టేడియం ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఎయిర్ పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ ట్రాఫిక్ ద్వారా ప్యాలెస్ కు అక్కడి నుండి స్టేడియంకు మెస్సీ చేరుకునేలా ఏర్పాట్లు హైదరాబాద్ పోలీసులు ఏర్పాట్లు చేశారు.
మెస్సీకి సీఎం స్వాగతం..
సాయంత్రం 4.30 గం.ల ప్రాంతంలో మెస్సీ కోల్ కత్తా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. ఈ నేపథ్యంలో మెస్సీతో పాటు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సైతం సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఒకేసారి స్వాగతం పలకనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే విమానాశ్రయంలోనే మెస్సీతో రాహుల్ గాంధీ కొద్దిసేపు మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
3000 పోలీసులతో భద్రత
సీఎం రేవంత్, మెస్సీ మధ్య సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 3000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు శుక్రవారమే ప్రకటించారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. అలాగే 450 సీసీ కెమెరాలు, మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెస్సీ భద్రత కోసం జెడ్ కేటగిరి భద్రతను కేటాయించినట్లు సీపీ తెలిపారు. మెస్సీ వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Also Read: Messi – Kolkata Tour: కోల్‌కత్తాలో మెస్సీ ఫ్యాన్స్ ఫైర్.. మైదానంలోకి దూసుకొచ్చి రణరంగం
మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్..
మెస్సీ హైదరాబాద్ చేరుకున్న అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఫలక్ నమా ప్యాలెస్ కు వెళ్తారు. అక్కడి నుండి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. 7-8 గంటల మధ్య మైదానంలో మ్యాచ్ ఆడతారు. మ్యాచ్ చివరి 10 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇస్తారు. మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడతారు. అనంతరం విజేతలకు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందజేస్తారు. ఆపై మెస్సీ తిరిగి ఫలక్ నమా ప్యాలెస్ కు తిరిగి వెళ్లిపోతారు. రాత్రి ప్యాలెస్ లోనే బస చేసి.. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి ముంబయికి బయలుదేరుతారు.

