Cyber Crime: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రజల్లో ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ క్రిమినల్స్(Cybercriminals) రెచ్చిపోతూనే ఉన్నారు. 30కి పైగా రకాల మోసాలు చేస్తూ ఏటా జనం నుంచి వందల కోట్లు కొల్లగొడుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో సైబర్ మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరిట లక్ష్యంగా చేసుకున్న వారిని లక్షల్లో ముంచుతున్నారు. ముఖ్యంగా 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసుండి, బాగా చదువుకున్న వృద్ధులను, విదేశాల్లో పిల్లలు ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇలా డిజిటల్ అరెస్టుల పేరిట 50కి పైగా నేరాలు నమోదయ్యాయి.
నకిలీ నాన్ బెయిలబుల్..
ఈ క్రమంలో డిజిటల్ అరెస్ట్(Digital arrest) పేరుతో వచ్చే బెదిరింపులకు భయపడ వద్దని హైదరాబాద్(Hyderabad) సైబర్ క్రైం డీసీపీ దార కవిత(DCP dara Kavitha) సూచించారు. నిజానికి ఏ దర్యాప్తు సంస్థ కూడా డిజిటల్ అరెస్ట్ చేయదని ఆమె స్పష్టం చేశారు. సైబర్ మోసగాళ్లు బాధితులకు ఫోన్లు చేసి తమను తాము సీబీఐ(CBI), కస్టమ్స్, డీఆర్‌ఐ(DRI), ఈడీ(ED) అధికారులమని పరిచయం చేసుకుంటున్నారు. ఆ తర్వాత మనీలాండరింగ్ లేదా నిషేధిత డ్రగ్స్ కేసుల్లో మీపై కేసులు నమోదయ్యాయంటూ భయపెడుతున్నారు. నకిలీ నాన్ బెయిలబుల్ వారెంట్లు, కోర్టు ఆర్డర్ల కాపీలను పంపుతున్నారు. నమ్మించడానికి, వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తూ పోలీస్ యూనిఫాం దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఒక్కసారి అవతలివారు భయపడుతున్నారని నిర్ధారించుకోగానే, వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లు విత్‌డ్రా చేయించి, బంగారం తాకట్టు పెట్టించి, వ్యక్తిగత రుణాలు తీయించి, ఆ డబ్బు మొత్తాన్ని తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకుంటున్నారు.
Also Read: Ramya Krishnan: మళ్లీ ఆ ఐటెమ్ సాంగ్ చేయాలని ఉందన్న రమ్యకృష్ణ.. భయపడ్డ జగపతి బాబు
డీసీపీ హెచ్చరిక
ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన 84 ఏళ్ల వృద్ధుడిని మనీలాండరింగ్ కేసు ఉందని భయపెట్టి రూ.44 లక్షలు కొల్లగొట్టిన ఘటన, అలాగే 69 ఏళ్ల వృద్ధురాలిని బెదిరించి రూ.38.70 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్న ఉదంతాలు ఇందుకు నిదర్శనం. గతంలో డిజిటల్ అరెస్ట్ బెదిరింపుల కారణంగా రిటైర్డ్ డాక్టర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన కూడా ఉంది. వాస్తవానికి డిజిటల్ అరెస్టులు ఉండవని, నిజమైన అధికారులు ఎవరూ వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో అడగరని డీసీపీ దార కవిత తెలిపారు. ఇలాంటి బెదిరింపు ఫోన్లకు భయపడకుండా, కాల్స్‌ను వెంటనే కట్ చేయాలని సూచించారు. బెదిరింపులు వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలను కోరారు.
