Cyberabad Police: మొబైల్ ఫోన్ చోరీ అయినా పొరపాటున పోగొట్టుకున్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి వివరాలను సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేయించాలని సైబరాబాద్ డీసీపీ (Cyberabad Police) (క్రైమ్స్) ముత్యం రెడ్డి సూచించారు. లేనిపక్షంలో ఫోన్లు తస్కరించినవారు, దొరికినవారు వాటిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాడే ప్రమాదముందని చెప్పారు. కొన్నిసార్లు ఫోన్లలోని పర్సనల్ డేటా ఆధారంగా బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కూడా స్వాహా చేసే అవకాశాలు ఉంటాయన్నారు. వీటి సహాయంతో సైబర్ క్రిమినల్స్ నేరాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. గడిచిన 45 రోజులపాటు స్పెషల్ డ్రైవ్ జరిపిన సైబరాబాద్ పోలీసులు 3.20 కోట్ల రూపాయల విలువ చేసే 1,061 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఈ ఫోన్లను వాటి సొంతదారులకు అప్పగించారు.
Also Read: Cyberabad Police: హైదరాబాద్ కు ఏమైంది? మరీ ఇంత నిర్లక్ష్యమేల..
ఆ ఫోన్ ను మరొకరు వాడుతున్నట్టయితే తెలుసుకుని రికవరీ చేసే అవకాశాలు
ఈ సందర్భంగా డీసీపీ ముత్యం రెడ్డి మాట్లాడుతూ పోయింది ఆండ్రాయిడ్ ఫోన్ అయినా ఐ ఫోన్ అయినా సొంతదారులు సత్వరమే పోలీసులకు కంప్లయింట్ ఇవ్వాలని చెప్పారు. సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదు చేయిస్తే దేశంలో ఏ ప్రాంతంలో ఆ ఫోన్ ను మరొకరు వాడుతున్నట్టయితే తెలుసుకుని రికవరీ చేసే అవకాశాలు ఉంటాయన్నారు. 2023 నుంచి ఇప్పటివరకు సైబరాబాద్ పోలీసులు మొత్తం 13,423 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్టు చెప్పారు. మొబైల్ ఫోన్ల రికవరీలో దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. అదనపు డీసీపీ (క్రైమ్స్) రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగమైందన్నారు.
పోగొట్టుకున్నా వెంటనే ఫిర్యాదు చేయాలి
వీటి ద్వారానే వ్యాపారం, నగదు లావాదేవీలు జరుపుతున్న వారి సంఖ్యకోట్లల్లో ఉంటుందన్నారు. సెల్ ఫోన్ చోరీ అయినా, పోగొట్టుకున్నా వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. చోరీకి గురైన…పోగొట్టుకున్న సెల్ ఫోన్లను తిరిగి పొందిన సొంతదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్ల రికవరీలో కీలకపాత్ర వహించిన సీసీఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, సీఐలు సంజీవ్, రవికుమార్, ఏ.రవికుమార్, డాలినాయుడు, రాజేశ్ తోపాటు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను డీసీపీ అభినందించారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు
