Cyberabad Police: పీకలదాకా మందు కొట్టి వాహనాలతో రోడ్లపైకి వచ్చిన 218మందిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసిన అధికారులు వారిని కోర్టులో హాజరు పరచనున్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న డ్రంకెన్ డ్రైవింగ్ కు అడ్డుకట్ట వేయటానికి సైబరాబాద్ పోలీసులు ప్రతీ శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే శనివారం రాత్రి పోలీసు బృందాలు కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షలు జరిపారు. దీంట్లో 176మంది ద్విచక్ర వాహనదారులు, 19మంది ఆటో డ్రైవర్లతోపాటు కార్లు నడుపుతూ 23మంఇ పట్టుబడ్డారు.
ఈ క్రమంలో అందరినీ అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి యాక్సిడెంట్ చేసి ఎవరి మరణానికైనా కారణమైతే వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 105 ప్రకారం కేసులు నమోదు చేస్తామని కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. ఈ కేసుల్లో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పారు.
Also Read: MLA Arekapudi Gandhi: ఎమ్మెల్యేపై దాడి అంటూ వాట్సాప్ మెసేజ్.. సోషల్ మీడియాలో వైరల్..
నిమ్స్ ఆరోగ్య శ్రీ సిబ్బందిపై కేసులు
నిమ్స్ ఆస్పత్రిలో బాణాసంచా దొరికిన అంశంలో హాస్పిటల్ ఆరోగ్య శ్రీ సిబ్బందిపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. నిత్యం రోగులతో రద్దీగా ఉండే నిమ్స్ హాస్పిటల్ భవనం అయిదో అంతస్తులో శనివారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కాగా, ప్రమాదం జరిగిన గది పక్కనే ఉన్న మరో రూంలో పెద్ద ఎత్తున బాణాసంచా నిల్వ చేసి ఉండటాన్ని అగ్నిమాపక గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రి మెడికల్ అదనపు సూపరిండింటెంట్ లక్ష్మీ భాస్కర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.