CM On Andesri: రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందెశ్రీని కోల్పోవడం సమాజానికే కాకుండా తనకూ వ్యక్తిగతంగా తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. పశువుల కాపరిగా, తాపీ మేస్త్రీగా, తెలంగాణ ఉధ్యమకారుడిగా ఆయన చెరగని ముద్రవేశారని కొనియాడారు. అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు.
‘పాఠ్యాంశంగా చేర్చేందుకు కృషి’
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందెశ్రీ తనను కలిసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మీ పాత్ర కూడా ఉండాలని ఆ సందర్భంలో తాను సూచించినట్లు చెప్పారు. గద్దర్ తో పాటు అందెశ్రీ కూడా ప్రజల్లో స్పూర్తి నింపారని అన్నారు. ఆయన రాసిన ప్రతీ పాట తెలంగాణలో స్ఫూర్తిని రగిలించిందని కొనియాడారు. అందుకే అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ” గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు.
స్మతి వనం ఏర్పాటు
అందెశ్రీ పేరుతో ఒక స్మృతి వనాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే వారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుటుందని అన్నారు. అందెశ్రీ సంకలనాల్లోని ‘నిప్పుల వాగు’ పాట తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్ గా ఉపయోగపడుతుందని అన్నారు. అందుకే 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీ లో ‘నిప్పుల వాగు’ను అందుబాటులో ఉంచుతామని అన్నారు.
అందెశ్రీకి పద్మశ్రీ
అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గతేడాది కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా మరోమారు లేఖ రాస్తామని స్పష్టం చేశారు. వారికి పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగా.. అందెశ్రీని గౌరవించుకునేందుకు కృషి చేద్దామని సీఎం పిలుపునిచ్చారు.
తెలంగాణ ఆత్మగౌరవం, గుండె ధైర్యం అందెశ్రీ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం
– శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రివర్యులు@revanth_anumula pic.twitter.com/o6k66d235l
— Telangana Congress (@INCTelangana) November 11, 2025
Also Read: TTD Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. మాజీ ఈవో ధర్మారెడ్డిపై ప్రశ్నల వర్షం!
పాడె మోసిన సీఎం
అంతకుముందు హైదరాబాద్ లోని ఘట్ కేసర్ లో అందెశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో వాటిని పూర్తి చేశారు. అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. అందెశ్రీ పాడెను మోసి ఘనమైన నివాళులు అర్పించారు. ఆయనపై ఉన్న అపార గౌరవాన్ని సీఎం చాటుకున్నారు. మరోవైపు మంత్రులు శ్రీధర్ బాబు (Minister Sridhar babu), జూపల్లి కృష్ణారావు Jupally Krishnarao), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పాల్గొన్నారు.
