TTD Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి అంశం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో నిజానిజాలను తేల్చేందుకు సిట్ గత కొన్ని రోజులుగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో తాజాగా మరింత దూకుడు పెంచిన సిట్ అధికారులు.. కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారిస్తోంది.
తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న సిట్ కార్యాలయానికి టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. ఆయన హయాంలోనే పెద్ద ఎత్తున నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ డీఐడీ మురళి లాంబా ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. తిరుమల లడ్డుకు వినియోగించిన నెయ్యిని ఎక్కడ నుంచి కొన్నారు? నెయ్యి కాంట్రాక్ట్ ను ఏ ప్రాతిపదికన ఇచ్చారు? అన్న కోణాల్లో ప్రశ్నల వర్షం కురుపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల లడ్డు కల్తీ అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న సిట్.. లడ్డు తయారు చేసే నెయ్యిలో 90 శాతానికి పైగా పామాయిల్ వినియోగించినట్లు గుర్తించింది. ఈ కేసులో ఏ16గా ఉన్న కీలక నిందితుడు అజయ్ కుమార్ సుగంద్ ను సిట్ రీసెంట్ గా అరెస్ట్ చేసింది. ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధర్మారెడ్డి స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.
Also Read: Ande Sri Funeral: అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్.. అంత్యక్రియలు పూర్తి.. ప్రకృతి కవికి కన్నీటి వీడ్కోలు
గత వైసీపీ పాలనలో టీటీడీకి భోలేబాబా ఓరోగానిక్ డెయిర్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తు వచ్చింది. మెుత్తంగా 68 లక్షల కిలోల నెయ్యిని భోలేబాబా సరఫరా చేయగా.. అందులో 57 లక్షల కిలోల నెయ్యిలో పామాయిల్, పాక్ కెర్న్ ఆయిల్, పామ్ స్టెరిన్ తదితర రసాయనాలను వినియోగించినట్లు సిట్ గుర్తించింది. ఈ పామాయిల్ తయారీకి అవసరమైన కెమికల్స్ ను ఏ16గా ఉన్న అజయ్ కుమార్.. భోలేబాబాకు సరఫరా చేసినట్లు తేల్చింది. కాగా ఈ కేసులో 24 మందిపై కేసులు నమోదు చేసిన సిట్.. వారిలో 9 మందిని అరెస్ట్ చేసింది. మరోవైపు నవంబర్ 13న విచారణకు హాజరుకావాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేయడం గమనార్హం.
