Gujarat Ricin Plot: ఆపరేషన్ సిందూర్ తో పాక్ లోని ఉగ్రమూకలను భారత బలగాలు చావుదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ముష్కరమూకలు రగిలిపోతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి దిల్లీలో భారీ పేలుడు సైతం జరిగి.. 13 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడికి ముందే హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ను గుజరాత్ లో అరెస్ట్ చేశారు. అతడ్ని దర్యాప్తు వర్గాలు విచారించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశంలో వారు పన్నిన భారీ ఉగ్ర కుట్ర బయటపడింది.
ఉగ్రవాదుల ప్లాన్ ఏంటంటే?
హైదరాబాద్ కు చెందిన డాక్టర్ మహ్మద్ మెుహియుద్దీన్ సయ్యద్ (Dr Ahmed Mohiuddin Syed) ను గుజరాత్ లో అరెస్ట్ చేశారు. సయ్యద్.. చైనాలో వైద్య విద్యను అభ్యసించి.. గుజరాత్ లో సయ్యద్ ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యూపీకి చెందిన మహ్మద్ సుహెల్, అజాద్ సులేమాన్ సైఫీలతో కలిసి అతడు భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేశాడు. ఆముదం గింజల్లో లభించే రిసిన్ అనే సహజ విషపదార్థాన్ని సేకరించి.. దానిని ప్రజలకు సరఫరా చేసే నీటిలో కలిపాలని వారు ప్లాన్ చేశారు. తద్వారా వందలాది మంది ప్రాణాలు తీయాలని కుట్ర వారు కుట్ర పన్నినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.
ప్రసాదాల్లో విషం కలపేందుకు కుట్ర
అంతేకాదు లక్నో, దిల్లీ దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదాల్లో ఈ రిసిన్ ను కలపాలని కూడా హైదరాబాది ఉగ్ర డాక్టర్ పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది. నిన్న, మెున్నటి వరకూ ఆత్మాహుతి దాడులు, బాంబు బ్లాస్టులకు కుట్ర చేసిన ముష్కరులు.. ఇప్పుడు బయో వెపన్ ను ఉపయోగించి మనుషుల ప్రాణాలను తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇస్లామిక్ స్టేట్ ప్రేరణతోనే వారు రిసిన్ అనే అత్యంత విషపూరిత రసాయన పదార్థాన్ని ఆయుధంగా ఎంచుకున్నారని గుజరాత్ పోలీసులు స్పష్టం చేశారు.
రిసిన్ చాలా డేంజర్..
సాధారణంగా ఆముదం గింజల నుంచి ఈ అత్యంత విషపూరితమైన రిసిన్ విషపదార్థాన్ని సేకరిస్తారు. రిసిన్ కు రంగు, రుచి, వాసన ఉండదు. కాబట్టి నీరు, ప్రసాదంలో కలిపినప్పటికీ దీనిని ఎవరూ గుర్తించలేరు. రిసిన్ ఒకసారి శరీరంలోకి వెళ్తే ప్రాణాలతో బయటపడటం కష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ముష్కర మూకలు ఈ బయో టెర్రిరిజం దాడిని ఎంచుకున్నట్లు పేర్కొంటున్నారు. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం ఇస్లామిక్ స్టేట్ ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటోంది. సాంప్రదాయేతర విధానాల్లో దాడులు జరిపేందుకు కుట్రలు చేస్తోంది.
Also Read: Jubliee Hills Bypoll Live Updates: ప్రశాంతంగా జూబ్లీహిల్స్ పోలింగ్.. ఓటు వేసిన ప్రధాన అభ్యర్థులు
బయో టెర్రర్‌కు వ్యూహం
సాధారణంగా ఉగ్రదాడుల్లో పాల్గొనేవారితో పోలిస్తే బయో టెర్రరిజంలో పాల్గొనే ముష్కరులను గుర్తించడం చాలా కష్టం. వారు ఎటువంటి సైనిక శిక్షణలో పాల్గొనరు. ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలను సైతం కలిగి ఉండరు. పైగా ఉగ్రవాదులు వినియోగించే తుపాకులు, పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రితో వారికి అసలు సంబంధమే ఉండదు. ఉగ్రవాదుల దాడి వ్యూహాల్లో రిసిన్ అనే విష పదార్థం ఇప్పటివరకూ లేదు. కాబట్టి దర్యాప్తు వర్గాల ఫోకస్ దానిపై ఉండే ఛాన్సే లేదు. దీనిని అవకాశంగా మలుచుకొని.. భారత్ లో బయో టెర్రర్ సృష్టించాలని ఇస్లామిక్ స్టేట్ వ్యూహాం రచించినట్లు దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ డాక్టర్ అరెస్టుతో ఈ భారీ కుట్ర వెలుగు చూసింది.
