Chandrababu Naidu: హైదరాబాద్ పర్యటనకు బిల్ క్లింటన్ వచ్చిన సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ కు థర్డ్ సిటీగా సైబరాబాద్ ఏర్పాటు చేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు సంబంధించిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా పేర్కొన్నారు. శిల్పకళావేదిక అంటేనే తనకు పాత రోజులు గుర్తుకువచ్చాయని, హైదరాబాద్ అభివృద్ధిలో మొదటి అడుగు హైటెక్ సిటీ అని ఆయన వివరించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జైలు జీవితం
హైటెక్ సిటీ ప్రారంభించి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చామని, వారసత్వాన్ని మర్చిపోవద్దని శిల్పకళా వేదిక నిర్మాణం చేపట్టామన్నారు. ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు ఒక నాయకుడికి సంతృప్తినిస్తుందని తెలిపారు. దత్తాత్రేయ జెంటిల్మెన్ కి ప్రతిరూపమని చంద్రబాబు కొనియాడారు. అలయ్ బలయ్ అంటేనే దత్తాత్రేయ గుర్తొస్తారని, పార్టీలకతీతంగా ఒకే వేదికపై నాయకులను కలిపేందుకు దత్తాత్రేయ అలయ్ బలయ్ ను ప్రారంభించారన్నారు.
ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జైలు జీవితం గడిపారని, తాను సీఎంగా ఉన్న సమయంలో అనేక లేఖలు రాశారన్నారు. లేఖలకు అంబాసిడర్ దత్తాత్రేయ అని చంద్రబాబు గుర్తుచేశారు. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి హైదరాబాద్ కు చేసిన సేవ ఏనాటికి మరవబోరన్నారు. ఈ గడ్డపై పుట్టిన వ్యక్తి పీవీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని, ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్ గా తయారయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
Also Read: MLA Maganti Gopinath: ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి.. కన్నీంటి పర్యంతమైన గులాబీ అధినేత కేసీఆర్!
రాజకీయాల్లో చెయ్యి పట్టి నడిపించిన వ్యక్తి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తనలాంటి ఎంతో మంది కార్యకర్తలను నిర్మాణం చేసిన ఘనత బండారు దత్తాత్రేయదని కొనియాడారు. అనేక మందికి సిద్ధాంతంపై అవగాహన కల్పించారన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి దత్తాత్రేయతో కలిసి కార్యాలయంలో ఉండే అదృష్టం దక్కిందన్నారు. తనకు రాజకీయాల్లో చెయ్యి పట్టి నడిపించిన వ్యక్తి అంటూ కిషన్ రెడ్డి కొనియాడారు. ఆయన పోటీ చేసి గెలిచిన సికింద్రాబాద్ నుంచి తాను ఎన్నికవ్వడం తన అదృష్టమని పేర్కొన్నారు. పార్టీలో ఎవరు అసంతృప్తి ఉండి అలిగినా దత్తాత్రేయ, వీ రామారావు పిలిచి మాట్లాడేవారన్నారు.
బూతులు మాట్లాడుతున్నారు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లో నేడు వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని, పొలిటికల్ గా పదునైన విమర్శలు చేసినా అర్థవంతంగా ఉండాలని ఆయన సూచించారు. కొందరు భాష దిగజారి బూతులు మాట్లాడుతున్నారని, అలాంటి భాష ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగపరుస్తోందని ఆయన తెలిపారు. యువతరం రాజకీయ నాయకులను ఫాలో అవుతుందన్నారు. బూతులు మాట్లాడేవారిని ఏం చేయాలని తనను ఒకరు అడగ్గా అవే బూతులతో వారకి సమాధానం చెప్పాలన్నానని వివరించారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో బూతులు మాట్లాడే ఏ ఒక్కరూ గెలవలేదని వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. దత్తాత్రేయ మంచి మనసున్న వ్యక్తి అంటూ కొనియాడారు. అంకితభావంతో పనిచేసే వారు రోజురోజుకు తగ్గిపోతున్నారన్నారు. దత్తాత్రేయ హృదయం విశాలమైనదని, కానీ ఈ కార్యక్రమానికి వచ్చినవారితో హాల్ మాత్రం చిన్నగా అయ్యిందని పేర్కొన్నారు.
Also Read: Errolla Srinivas: నీటి ప్రయోజనాలు రేవంత్‌కు పట్టవా?.. బీఆర్ఎస్ నేత ఫైర్!
రాజకీయాల్లో నీతి , నిజాయితీ చాలా ముఖ్యం
ఆర్ఎస్ఎస్ గురించి కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అలవాటైపోయిందని ఫైరయ్యారు. దేశంలో అత్యుత్తమైన సంఘం ఆర్ఎస్ఎస్ అని కొనియాడారు. దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితం ఏమీలేదన్నారు. దత్తాత్రేయ గంజిలో పుట్టి ఉన్నత స్థానాలకు ఎదిగినా ఇంకా గంజి మనుషినేనని, బెంజ్ మనిషిగా మారలేదన్నారు. డైపర్స్ మార్చినట్టు పదవుల కోసం నేటితరం నేతలు పార్టీలు మారుతున్నారన్నారు. తద్వారా రాజకీయాలు చులకన అయిపోయాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాజకీయాల్లో నీతి , నిజాయితీ చాలా ముఖ్యమని సూచించారు. కొంతమంది ల్యాండ్ రాజకీయాలు చేస్తున్నారని వెల్లడించారు.
గెలుపోటములతో సంబంధం లేకుండా ముందుకెళ్లిన వ్యక్తి
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. దత్తాత్రేయ రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారన్నారు. రెండు పర్యాయాలు సికింద్రాబాద్ నుంచి, ఒక్కసారి గోషామహల్ నుంచి ఓటమి పాలయ్యారని, అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పుకొచ్చారు. దత్తాత్రేయ ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో తాను రెండుసార్లు ముషీరాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసినట్లు గుర్తుచేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ముందుకెళ్లిన వ్యక్తి అంటూ కొనియాడారు. నేటి రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోందని, ఎవరు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదన్నారు. ఒక్కరిని ఒక్కరు కలిసే పరిస్థితి లేని రోజుల్లో అందరినీ ఈ వేదిక కలిపిందని వివరించారు.
శత్రువులు లేని మనిషి దత్తాత్రేయ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. డౌన్ టు ఎర్త్ కు ఎదిగిన పర్సన్ దత్తాత్రేయ అని కొనియాడారు. నాన్ కాంట్రవర్సీ నేతగా దత్తన్న పేరుపొందారన్నారు. శత్రువులు లేని మనిషి దత్తాత్రేయ అంటూ కొనియాడారు. మాజీ సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. దత్తాత్రేయ ప్రజాసేవకుడన్నారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అత్యున్నతమైన రాజ్యాంగ పదవి గవర్నర్ స్థాయికి ఎదిగారన్నారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. దత్తాత్రేయ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారని, ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ విధానమే ఆయన్ని ఇంత ఎత్తుకు ఎదిగేలా చేసిందన్నారు. సున్నితంగా కనిపించినా సిద్ధాంతపరంగా కఠినంగా ఉంటారని వ్యాఖ్యానించారు.
మానవ సంబంధాలకు ఎక్కువ విలువనిచ్చే వ్యక్తి
ఆనాడు ఉమ్మడి ఏపీలో ఆంధ్రలో బీజేపీ చాలా వీక్ గా ఉండేదని, అలాంటి సమయంలో దత్తాత్రేయ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఏ పార్టీతో పొత్తులు లేకుండా బీజేపీ రెండు సీట్లు గెలుపొందిందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. సంకోచం , సంశయం లేకుండా 70 ఏళ్ల జీవితాన్ని బుక్ లో రాశారని, మానవ సంబంధాలకు ఎక్కువ విలువనిచ్చే వ్యక్తి దత్తాత్రేయ అంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు, పలు పార్టీల రాజకీయ నాయకులు, దత్తత్రేయ అభిమానులు, సన్నిహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Also Read: Rangareddy: మల్‌రెడ్డికి బెర్త్ దక్కకపోవడానికి.. సామాజిక వర్గమే అడ్డొచ్చిందా?