Rangareddy: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి వర్గంలో ప్రాధాన్యత కరువైంది. తొలి విడతలో చేజారగా..మలి విడతలోనైనా అమాత్య యోగం కలుగుతుందని ఆశించినప్పటికీ ఆశాభంగమే కలిగింది. అనేకమంది మంత్రి పదవి ఆశించగా అందులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం..వివిధ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు ఈసారి మంత్రి పదవి ఖాయం అని అంతా అనుకున్నారు. ఇక రాబోయే రోజుల్లోనూ జిల్లాకు ప్రాధాన్యత దక్కుతుందన్న నమ్మకం సైతం ఎవరికీ లేదు. అసలు అధిష్టానం మదిలో ఏముందో! అన్నది ఎవరీకి అంతుబట్టడం లేదు.
ప్రాధాన్యత దక్కకపోవడం ఇదే మొదటిసారి
ఉమ్మడి ఏపీ నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు అన్ని ప్రభుత్వాలు మంత్రి వర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చాయి. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనూ..ఆతర్వాత కాంగ్రెస్, టిడీపీ, బీఆర్‌ఎస్ హయాంలోనూ కొండా వెంకట రంగారెడ్డి, తూళ్ల దేవేందర్ రెడ్డి, పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ వంటి ఎందరో నేతలు వివిధ సందర్భాల్లో మంత్రులుగా పనిచేశారు. 2023 ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలుపొందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా..వికారాబాద్ నుంచి గెలుపొందిన గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.
పట్నం మహేందర్ రెడ్డికి శాసన మండలి చీఫ్ విప్ పదవి దక్కింది. అక్కడక్కడా కొంతమందికి కార్పోరేషన్ స్థాయిలో పదవులు దక్కాయి. తప్పితే మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లాకు ఎటువంటి ప్రాధాన్యత దక్కలేదు. ఉమ్మడి జిల్లా చరిత్రలో మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడం ఇదే ప్రథమమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం..గడ్డం ప్రసాద్ కుమార్ సైతం స్పీకర్‌గా కొనసాగుతుండడం..అనుభవజ్ఞుడైన సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇంఛార్జి మంత్రిగా ఉండడం వల్లనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకంగా ఓ మంత్రి పదవి అవసరం లేదన్న అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: Errolla Srinivas: నీటి ప్రయోజనాలు రేవంత్‌కు పట్టవా?.. బీఆర్ఎస్ నేత ఫైర్!
తలకిందులైన మల్ రెడ్డి పరిస్థితి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పార్టీలో సీనియర్ నేత. రంగారెడ్డి జిల్లా పరంగా ఆలోచిస్తే..ఎటునుంచి చూసినా ఆయనకు మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని తీర్మాణం చేసి అధిష్టానానికి పంపించడం..కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సైతం ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత కల్పించే విషయమై లేఖ రాయడం కూడా మల్ రెడ్డికి కలిసొస్తుందని పార్టీ శ్రేణులు సైతం భావించాయి. మరోపక్క మల్ రెడ్డి సైతం ఢిల్లీలోనే మకాం వేసి సీరియస్గా ప్రయత్నించారు.
తనకు మంత్రి పదవి ఖాయమని ఎదురు చూస్తున్న తరుణంలో మల్ రెడ్డి అంచనాలు తలకిందులయ్యాయి. రెడ్డి సామాజిక వర్గమే తనకు కలిసి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ..అదే ఆయనకు శాపమైందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో విన్పిస్తోంది. ఇదే సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నించడం మూలంగానూ మల్ రెడ్డికి అమాత్య యోగం కలగలేదన్న టాక్ కూడా ఉంది.
ఇప్పటికే మంత్రి వర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా..వీరిద్దరికీ చోటు కల్పించే అవకాశం అసలే ఉండదు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నేతలను సమన్వయం చేసుకునే పరిస్థితి మల్‌రెడ్డికి ఉంటుందా! అన్న దిశగా అధిష్టానం ఆలోచనలు చేసి మంత్రి పదవి కేటాయించే విషయంలో పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా తదుపరి విస్తరణలోనైనా మల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా? లేదా! అన్నది కూడా సందేహాస్పదంగా మారింది.
Also Read: Warangal Museum: మ్యూజియం కూలకుండా కర్రల సపోర్ట్.. ఓరుగల్లు చారిత్రాత్మక సంపదకు దిక్కేది..?
క్యాడర్‌లో నిస్తేజం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి వర్గంలో ప్రాధాన్యత కల్పించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లోనూ ఒకింత నిస్తేజం నెలకొన్నది. జిల్లాలోఅక్కడక్కడా నేతల్లో అంతర్గత విబేధాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సైతం జరగనున్నాయి. నేతలను సమన్వయ పరిచి అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టి పార్టీని విజయ తీరం వైపు నడిపించే నాయకుడు ఉమ్మడి జిల్లాకు ఎంతో అవసరం.
సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇంఛార్జిగా కొనసాగుతుండగా..ఆయన ఉమ్మడి జిల్లాలోని పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు పూర్తిస్థాయి టైం కేటాయించే పరిస్థితిలో లేరు. ఏదైనా పనుల మీద ఆయనను కలవాలంటే ముఖ్య నేతలకు తప్ప ద్వితీయ శ్రేణి నాయకులకు ఆ అవకాశం అంతగా లేదన్న వ్యాఖ్యలు పార్టీవర్గాల నుంచే విన్పిస్తున్నాయి. ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాను దృష్టిలో పెట్టుకోనైనా అధిష్టానం మంత్రి వర్గంలో చోటు కల్పించాల్సిన అవసరాన్ని పలువురు సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు.
Also Read: Arun Kumar Jain: ఫిట్ ఇండియా.. ఉద్యమం ప్రజల్లో చైతన్యం!