MLA Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందారు. ఈ నెల 5న గోపీనాథ్ కు ఛాతీలో నొప్పి రావడంతో మాగంటి గోపీనాథ్ ఇంట్లోనే కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు సీపీఆర్ చేయడంతో కాస్త కోలుకున్నారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే సమయంలో స్పృహ కోల్పోయారు. కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి వర్గాలు మరోసారి సీపీఆర్ చేయడంతో పల్స్ రేటు పెరిగింది. నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో..ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగించారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆసుపత్రి వర్గాలు మృతి చెందినట్లు వెల్లడించారు. కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం.
మాగంటి రాజకీయ ప్రస్థానం..
ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా పని చేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు.
మాగంటి గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్‌పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నారు. 2023లో కూడా ఎన్నికల్లో మూడోసారి గెలిచారు. 2022 నుంచి బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
మాగంటి గోపీనాథ్ తల్లిదండ్రులు.. కృష్ణమూర్తి, మహానంద కుమారి. హైదరాబాద్ లోని హైదర్ గూడలో 1963 జూన్ 2న జన్మించారు. జీవిత భాగస్వామి సునీత, సంతానం.. మాగంటి వాత్యల్యనాధ్ (కుమారుడు), అక్షర నాగ, దిశిర (కుమార్తెలు). మాగంటి నిర్మాతగా పనిచేశారు. ఆయన తీసిన సినిమాలు.. పాతబస్తీ (1995), రవన్న (2000), భద్రాద్రి రాముడు (2004), నా స్టైలే వేరు (2009).
Also Read: Rangareddy: మల్‌రెడ్డికి బెర్త్ దక్కకపోవడానికి.. సామాజిక వర్గమే అడ్డొచ్చిందా?
కంటతడి పెట్టిన కేసీఆర్
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. మాగంటి గోపీనాథ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం గోపీనాథ్ భార్య, పిల్లలను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. గోపీనాథ్ కుమారుడు వాత్యల్సనాథ్‌ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కష్టకాలంలో వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాగంటి గోపీనాథ్ పార్థివదేహాన్ని చూసి కేసీఆర్ ఉద్వేగానికి గురయ్యారు. మాగంటి కుమారుడిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. గోపీనాథ్ మరణం పార్టీ కి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేత గా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. తనను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.మాగంటి గోపీనాథ్ మరణం తో శోకతప్తులైన కుటుంబ సభ్యులు మిత్రులు అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కవితసైతం మాగంటికి నివాళులర్పించారు.
సీఎం రేవంత్ రెడ్డి నివాళి
మాగంటి మృతి విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. మాగంటి భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తదితరులున్నారు. ఏపీసీఎం చంద్రబాబు సైతంమాగంటి మృతి సంతాపం తెలిపారు. గోపీనాథ్ భౌతిక కాయాన్ని ఏపీ మంత్రి లోకేష్ దంపతులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జూబ్లీహిల్స్‌లో మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు
జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆదివారం సాయంత్రం మాగంటి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి పాడెను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మోశారు. నాయకులు కే ఆర్ సురేశ్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, వేముల ప్రశాంత్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేశ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎదాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జోగిన పల్లి సంతోష్ కుమార్, పువ్వాడ అజయ్, భాస్కర్ రావు, పద్మారావు గౌడ్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రావుల శ్రీధర్ రెడ్డి తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. మాగంటి గోపీనాథ్ పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
Also Read: Warangal Museum: మ్యూజియం కూలకుండా కర్రల సపోర్ట్.. ఓరుగల్లు చారిత్రాత్మక సంపదకు దిక్కేది..?