Ponnam Prabhakar: దేశ వ్యాప్తంగా పీఎం ఈ-డ్రైవ్ కింద 9నగరాల్లో 15 వేల ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, అందులో తెలంగాణ లోని హైదరాబాద్ నగరానికి 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సుల ఆపరేషన్స్ లో ఎదురయ్యే సవాళ్లు ,మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని క్లీన్ అండ్ గ్రీన్ సిటీ గా నిలబెట్టడానికి డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణ హితమైన దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. కేంద్రం సబ్సిడీ కింద ఒక్కో బస్సుకు రూ.35లక్షలు కేటాయిస్తుందని తెలిపారు. ఈబస్సులకు కేంద్రం నవంబర్ 6న టెండర్లు పిలిచిందని వెల్లడించారు.
Also Read: Ponnam Prabhakar: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ
ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు 2-వీలర్స్ 3-వీలర్స్ , 4-వీలర్స్, బస్సులు, ట్రక్కులు,ట్రాక్టర్లకు పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ ఈవీ పాలసీని తీసుకొచ్చిందన్నారు. 2019 మార్చిలో 40 యూనిట్లతో దేశంలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. 2023 సేకరణ ప్రణాళిక కింద 1010 అదనపు ఎలక్ట్రిక్ బస్సులను (510 ఇంటర్‌సిటీ, 500 సిటీ బస్సులు) చేర్చాలని ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే లెటర్స్ ఆఫ్ అవార్డును జారీ చేసిందన్నారు. ప్రస్తుతం 775 ఎలక్ట్రిక్ బస్సులు (510 ఇంటర్‌సిటీ, 265 సిటీ బస్సులు) నడుస్తున్నాయని, మిగిలిన 275 మార్చి 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి , ఆర్టీసీ అధికారులు, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
