Hyderabad: హైదరాబాద్ లో రేపు (సెప్టెంబర్ 6) భారీ ఎత్తున గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. ఖైరతాబాద్, బాలాపూర్ వంటి ఫేమస్ గణనాథులను రేపు ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్సీ బలమురి వెంకట్ పరిశీలించారు. పోలీసు భద్రత, విద్యుత్, శానిటేషన్, తాగునీరు తదితర అంశాలపై భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
3 రోజులుగా నిమజ్జనాలు..
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని కూడా మంత్రి, మేయర్, ఎమ్మెల్సీ పరిశీలించారు. వినాయక నిమజ్జనంలో ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. మరోవైపు గత 3 రోజులుగా ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో.. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన శుభ్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
‘ఇప్పటికే 1,80,000 విగ్రహాలు నిమజ్జనం’
నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన అనంతరం.. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిమజ్జనం కోసం ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని శాఖల సమన్వయంతో శాంతి భద్రతలు ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. రేపు నిమజ్జనానికి సంబంధించి గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వం సమన్వయంతో ఇప్పటికే అనేక సమీక్షలు నిర్వహించి ఏర్పాట్లు చేసాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలోనే కాకుండా పంచాయతీరాజ్ శాఖ తరపున ప్రతి గ్రామంలో నిమజ్జన ఉత్సవాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు 1,80,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. రేపు చివరి రోజు పెద్దపెద్ద వినాయకులు ఉత్సవంగా జాతరగా నిమజ్జనం జరుగుతాయి’ అని మంత్రి అన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జన వేడుకలు: మంత్రి పొన్నం
ఇప్పటికే దీనిపై సమీక్ష చేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేశాము
గణనాథుడి ఆశీస్సులతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగుస్తున్నాయి
– మంత్రి పొన్నం https://t.co/lOe1B9WDN1 pic.twitter.com/BNfczElRev
— BIG TV Breaking News (@bigtvtelugu) September 5, 2025
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా..
భారీ గణనాథుల విగ్రహాలు ఊరేగింపుగా నిమజ్జానికి వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ‘హైదరాబాద్ నుండి కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుండి నిమజ్జనం తిలకించడానికి వస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ వినాయకుడు నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నాం. భద్రతకు సంబంధించి పోలీసు భద్రత, షి టీమ్స్ ఇతర బృందాలు ఏర్పాటు చేశాం. భక్తులంతా ఆనందోత్సాహాల మధ్య గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం పూర్తి చేయాలి’ అని మంత్రి పేర్కొన్నారు.
Also Read: Ganesh Visarjan 2025: బాలాపూర్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పై స్పెషల్ ఫోకస్.. ఎందుకంటే..?
ఖైరతాబాద్ గణేష్ రూట్ మ్యాప్
ఖైరతాబాద్ గణనాథుడు వెళ్లే రూట్ మ్యాప్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సెప్టెంబర్ 6న అది వెళ్లే మార్గాల్లో వెహికల్స్ ను అనుమతించరు. కాబట్టి రూట్ మ్యాప్ లో చెప్పిన మార్గాల్లో వెళ్లకపోవడమే ఉత్తమం. ఖైరతాబాద్ బడా గణేష్ మండపం నుంచి → పాత పీఎస్ సైఫాబాద్ → ఇక్బాల్ మినార్ →తెలుగు తల్లి → అంబేద్కర్ విగ్రహం → హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్).