Strange incident: హిందూ సాంప్రదాయంలో ఆలయలకు గొప్ప విశిష్టత ఉంది. ఆలయాలను దర్శించడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుందని వారు నమ్ముతుంటారు. తమ ఆరాధ్య దైవాన్ని పూజించడం ద్వారా కోరికలు నెరవేరతాయని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో కోరికలు నెరవేరిన వారు.. గుడిలో ఉండే హుండీలో తమ మెుక్కుబడులను చెల్లించుకుంటూ ఉంటారు. హుండీలో నగదు వేయడం ద్వారా దేవుడికి తమ కానుకలను సమర్పించినట్లుగా భావిస్తుంటారు. అయితే అలాంటి హుండీపై ఓ దొంగల ముఠా కన్నుపడింది. అనుకున్నదే తడువుగా హుండీని దోచుకెళ్లారు. ఆ తర్వాత వారికి ఎదురైన పరిణామాలు.. దోచుకెళ్లిన నగదును తిరిగిచ్చిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
అనంతపురంలోని బుక్కరాయసముద్రం పంచాయతీలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. నెలరోజుల క్రితం స్థానిక ముసలమ్మ తల్లి దేవాలయం హుండీ చోరికి గురైంది. దీంతో ఆలయ నిర్వాహకులు పోలీసులు ఫిర్యాదు సైతం చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఉదయం దేవాలయాన్ని తెరిచి చూడగా.. దోచుకెళ్లిన హుండీ నగదు మూటలో కనిపించింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
Also Read: Ghaati Movie Review: ‘ఘాటి’ జెన్యూన్ సినిమా రివ్యూ.. అనుష్క హిట్ కొట్టినట్టేనా?
డబ్బుతో పాటు లెటర్
ధర్మకర్త సుశీలమ్మ, మాజీ సర్పంచ్ నారాయణస్వామి ఆధ్వర్యంలో మూటలోని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆపై పోలీసుల సమక్షంలో దానిని లెక్కించారు. ఈ క్రమంలో వారికి దొంగ పెట్టిన ఓ లెటర్ కూడా కనిపించింది. మెుత్తం నలుగురు వ్యక్తులం హుండీని దోచేశామని లెటర్ లో దొంగలు స్పష్టం చేశారు. దొంగతనం చేసినప్పటి నుంచి తమ ఇంట్లో పిల్లలకు అనారోగ్యం వెంటాడుతోందని, భయంతో అమ్మవారి డబ్బును ఆలయం దగ్గర వదిలేసి వెళ్తున్నట్లు రాసుకొచ్చారు.
Also Read: SLBC Project: ఎస్ఎల్‌బీసీ పనులపై సీఎం కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
‘అమ్మవారి మహిమే’
ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా దొంగల రూపురేఖలు గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని తెలియజేస్తున్నారు. మరోవైపు దొంగలు డబ్బు తిరిగిచ్చిన సమాచారం కొద్ది సేపట్లోని చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించింది. దీంతో ఇది కచ్చితంగా అమ్మవారి మహిమేనంటూ స్థానికులు చెప్పుకుంటున్నారు. ముసలమ్మ తల్లి తిరిగి తన డబ్బును తన వద్దకే చేర్చుకుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.