Teacher Award Controversy: గురు పూజోత్సవానికి సర్వం సిద్ధమైంది. వేడుకలకు ఏర్పాటులు సైతం పూర్తయ్యాయి. కానీ ఉత్తములుగా అవార్డులు అందుకోవాల్సిన వారిలో అర్హత లేని వారు ఉన్నారనేది సంచలనంగా మారింది. దీంతో గురుపూజోత్సవం నేపథ్యంలో కొత్త కిరికిరి చర్చనీయాంశంగా మారింది. బెస్ట్ టీచర్ అవార్డు(Best Teacher Award)ల ఎంపికలో ఎంఈవోలు(MEO), డీఈవోలు(DEO) కీలకం. అయితే కొందరు ఈ నిబంధనలను తుంగలో తొక్కినట్లుగా తెలుస్తోంది. సన్నిహితులు, యూనియన్ల ఒత్తిడి కారణంగా అనర్హులకు సైతం ఉత్తములుగా అవార్డులకు ఎంపిక చేసినట్లుగా ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నో ఏండ్లుగా సేవలందిస్తున్న వారిని పక్కన పెట్టి అనర్హులకు అందలమెక్కించడంపై ఉపాధ్యాయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నామినేషన్ల కోసం కమిటీ
గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ అవార్డుల ఎంపికకు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. అందులో నిబంధనలను స్పష్టంగా పేర్కొంది. జిల్లా ఉత్తమ అవార్డుల ఎంపికకు ప్రతి మండలం నుంచి అన్ని కేటగిరీల్లో ఇద్దరు టీచర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కనీసం 15 ఏండ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న వారికి ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ల కోసం కమిటీ సైతం ఉంటుంది. తహసీల్దార్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. కాగా ఎంపీడీవో, ఎంఈవో సభ్యుడిగా ఉంటారు. ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా పలువురిని ఎంపికి చేసినట్లుగా తెలుస్తోంది. కనీసం 15 ఏండ్ల సర్వీస్ లేకున్నా పలు జిల్లాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా వారిని ఎంపిక చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ఉత్తములుగా అవార్డులు అందుకునే వారిలో పలువురు 15 ఏండ్ల సర్వీస్ లేని పలువురు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Local Body Elections: పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రచురణ.. వార్డుల వారీగా లెక్కలు
నల్లగొండ జిల్లాలో
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం పెట్టుకున్నటువంటి దరఖాస్తులలో జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు కనీస సర్వీస్ 15 ఏండ్లు ఉండగా పలు మండలాల్లో 8, 13 ఏండ్ల సర్వీస్ ఉన్నవారి పేర్లను సైతం ఎంఈ(MEO)వోలు రిఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఎంఈవోలు పంపించే జాబితాను డీఈవోలు స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. ఆపై ఫైనల్ లిస్టును పంపిస్తారు. కానీ డీఈవో(DEO)లు కూడా ఈ అంశాన్ని పట్టించుకోలేదా? లేక తెలిసి కూడా లైట్ తీసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 13 ఏండ్ల సర్వీస్ ఉన్న ఒక టీచర్ ను ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశం బయటకు పొక్కడంతో సీనియారిటీ ఉన్న పలువురు గుర్రుగా ఉన్నారు. అర్హత కలిగిన సీనియర్ టీచర్లు ఉండగా అర్హత లేని వారికి ఎలా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకునే అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 30 ఏండ్ల సర్వీస్, ఇతర అర్హతలున్నా దక్కని అవార్డు.. అర్హత లేని వారికి ఎలా దక్కుతోందని సీనియర్లు గుర్రుగా ఉన్నారు.
Also Read: Kavitha: కవిత వ్యూహాత్మక అడుగులు సస్పెన్షన్ తర్వాత గులాబీ పార్టీకి షాక్?