Chandhanagar robbery: చందా నగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాపులో దుండగులు దోపిడీ చేశారు. దుకాణం తెరిచిన కొన్ని నిమిషాలకే లోపలికి చొరబడ్డ దొంగలు ఓ ఉద్యోగిపై కాల్పులు జరిపారు. బంగారు ఆభరణాలను దోచుకునే సమయం చిక్కక పోవడంతో చేతికందిన వెండి వస్తువులను మూటగట్టుకుని ఉడాయించారు. ఓ పల్సర్ తోపాటు మరో రెండు బైక్‌లపై దుండగులు సంగారెడ్డి(Sangareddy) వైపు పారిపోయారు. సంచలనం సృష్టించిన ఈ దోపిడీ కేసులోని నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సాయంత్రానికి ఇద్దరిని పట్టుకున్నట్టు సమాచారం. అయితే, అధికారులు దీనిని నిర్ధారించడం లేదు. నిందితుల కోసం వేట కొనసాగుతోందని చెబుతున్నారు.
Also Read:SC on Aadhar card: పౌరసత్వానికి ‘ఆధార్ ప్రూఫ్ కాదు’.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఉదయం 10.30 గంటలకు..
ఎప్పటిలానే ఖజానా జ్యువెలరీ షాపు సిబ్బంది ఉదయం 10.30 గంటల ప్రాంతంలో దుకాణం తెరిచారు. ఆ తరువాత అంతా కలిసి షాపులో ఎలాంటి అవకతవకలకు పాల్పడమని ప్రమాణం చేస్తుండగా మాస్కులు ధరించిన ఆరుగురు దుండగులు ఒకరి వెనుక మరొకరుగా షాపు లోపలికి ప్రవేశించారు. అనుమానం వచ్చిన ఓ సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడానికి ప్రయత్నించగా దుండగుల్లో ఒకడు రివాల్వర్ చూపించి బెదిరిస్తూ వెనక్కి నెట్టుకుంటూ తీసుకెళ్లాడు. షాపు లోపలికి ప్రవేశించగానే ఓ దుండగుడు మొదట సీసీ కెమెరాపై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అసిస్టెంట్ మేనేజర్ సతీష్(Manager Satish)ను బంగారు నగలు దాచి పెట్టిన లాకర్ కీ ఇవ్వమని దుండగులు అడిగారు.
మేనేజర్ వద్ద ఉంటాయని అతను సమాధానం చెప్పగా కాళ్లపై కాల్పులు జరిపారు. దాంతో ఓ బుల్లెట్ సతీష్ కాలులోకి దూసుకుపోయింది. ఎవరైనా కేకలు పెట్టడానికి ప్రయత్నిస్తే చంపేస్తామని తుపాకులతో బెదిరించిన దోపిడీ దొంగలు షో కేసుల అద్దాలు పగులగొట్టి వాటిలో ఉన్న వెండి ఆభరణాలు, సామగ్రిని తమతోపాటు తెచ్చుకున్న బ్యాగుల్లో మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు మొదటి అంతస్తుకు వెళ్లి అక్కడ ఉన్న వెండి నగలను కూడా తీసుకున్నారు. ఆ సమయంలో ఓ ఉద్యోగి ఫోన్ ద్వారా చందానగర్ పోలీసు(Chandanagar Police)లకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ముందస్తు పథకం ప్రకారం..
ముందస్తుగా రూపొందించుకున్న పథకం ప్రకారం దోపిడీ దొంగలు కేవలం పది నిమిషాలు మాత్రమే జ్యువెలరీ షాపులో ఉన్నారు. అంతకన్నా ఎక్కువ సేపు ఉంటే పోలీసులకు చిక్కడం ఖాయమని భావించిన వారు దోచుకున్న వెండి నగలు, సామగ్రితో ఉదయం 10.45గంటల సమయంలో షాపు నుంచి బయటకు వచ్చారు. అనంతరం వచ్చిన బైక్ లపై అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తరువాత కొన్ని నిమిషాలకే చందానగర్ పోలీసులు నేర స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి అక్కడికి వచ్చారు. క్లూస్ టీం సిబ్బందిని రప్పించి ఆధారాలను సేకరించారు.
సీసీ కెమెరాల ఫుటేజీతో..
ఖాజానా జ్యువెలరీ(Khajana Jewellery) షాపు బయట ఉన్న రెండు సీసీ కెమెరాలతోపాటు లోపల ఉన్నవాటి ఫుటేజీలను విశ్లేషించగా దుకాణంలోకి ఆరుగురు దుండగులు మాస్కులు ధరించి ప్రవేశించినట్టుగా నిర్ధారణ అయ్యింది. దోపిడీ పూర్తి చేయగానే వీళ్లంతా వచ్చిన బైక్ లపై ఉడాయించినట్టుగా తేలింది. బయట వీరి మరో సహచరుడు ఓ పల్సర్ బైక్ పై ఉన్నట్టుగా వెల్లడైంది. దీనిపై ముగ్గురు పారిపోగా మిగితా రెండు బైక్ లపై మిగితా నలుగురు అక్కడి నుంచి పారిపోయినట్టుగా స్పష్టమైంది. దుండుగులు అందరూ సంగారెడ్డి వైపు వెళ్లినట్టుగా తేలడంతో పోలీసులు ఆ రూట్ లో జహీరాబాద్ వరకు ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అలర్ట్ చేశారు. చెక్ పోస్టుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతీ ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. దాంతోపాటు హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లతోపాటు జిల్లాల పోలీసులను సైతం అప్రమత్తం చేశారు.
వెయ్యికి పైగా సీసీ కెమెరాలు
షాపు నుంచి బయటకు వచ్చిన తరువాత దోపిడీ దొంగలు మూడు బైక్ లపై సంగారెడ్డి వైపు వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు జహీరాబాద్ వరకు ఉన్న వెయ్యికి పైగా సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించినట్టుగా తెలిసింది. వీటి ఆధారంగా వారి కదలికలను గమనిస్తూ వచ్చిన పోలీసులు ముఠాలోని ఇద్దరిని సంగారెడ్డి దాటిన తరువాత పట్టుకున్నట్టుగా తెలియవచ్చింది. అయితే, పోలీస్ అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించటం లేదు. గాలింపు కొనసాగుతోందని, త్వరలోనే గ్యాంగ్ సభ్యులందరినీ పట్టుకుంటామని చెబుతున్నారు.
ఇదే ఆఖరి రోజు అనుకున్నాం..
దోపిడీ దొంగలు తుపాకులతో షాపులోకి చొరబడి సహోద్యోగిపై కాల్పులు కూడా జరపడంతో ఇదే తమకు ఆఖరి రోజు అనుకుని వణికిపోయినట్టు షాపులోని ఉద్యోగులు చెప్పారు. ఒక్కసారిగా తుపాకులు చూపించి భయపెట్టడంతో ఏం చేయాలో అర్థం కాలేదన్నారు. తమలో కొందరికి కొత్తగా పెళ్లిళ్లు అయ్యాయని, కొందరు షో కేసుల వెనుక దాక్కున్నట్టు తెలిపారు.
Also Read: TG Rains: బిగ్ అలెర్ట్.. మరో 4 రోజులు దంచుడే దంచుడు.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త!
