SC on Aadhar card: ఆధార్ ఉన్నంత మాత్రాన భారతీయ పౌరసత్వం ఖరారు కాదని (SC on Aadhar card) సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వానికి సమగ్ర ఆధారంగా ఆధార్‌ను పరిగణించలేమంటూ చెప్పిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను (ECI) దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. పౌరసత్వాన్ని కచ్చితంగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుందని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. బీహార్‌లో ఓటర్ల జాబితాను ప్రత్యేక సవరించడాన్ని (Special Summary Revision – SSR) వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆధార్ ఉన్నంత మాత్రాన పౌరసత్వం నిరూపితంకాదని, దాన్ని వేరే ఆధారాలతో నిర్ధారించాల్సిందేనని ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. వెరిఫికేషన్ చేసే అధికారం అసలు ఎలెక్షన్ కమిషన్‌కు ఉందా? లేదా? అనేది మొదటి ప్రశ్న అని సుప్రీంకోర్టు సందేహాన్ని వ్యక్తం చేసింది. ఎలక్షన్ కమిషన్‌కు ఓటర్ల వివరాలను వెరిఫై చేసే చట్టపరమైన అధికారం లేకపోతే మొత్తం ప్రక్రియే చెల్లుబాటు కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈసీ కారణంగా ఓట్లు పోతున్నాయ్..
పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుసరిస్తున్న విధానాల కారణంగా జనాలు పెద్ద సంఖ్యలో ఓట్ల కోల్పోతున్నారని సిబల్ వాదించారు. ముఖ్యంగా, ఈసీ కోరిన ఆధారాలు సమర్పించలేక చాలామంది ఓట్లు పోగొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. 2003 ఓటర్ల జాబితాలో ఉన్నవారిని కూడా తిరిగి కొత్తగా ఫారమ్స్ సమర్పించాలని కోరారు, అలా చేయకపోతే పేర్లు డిలీట్ అవుతున్నాయని చెప్పారు. సదరు వ్యక్తుల అడ్రస్ మారకపోయినప్పటికీ ఓట్లు తొలగిస్తున్నారని సిబల్ వాదించారు. తాను చెప్పిన రీతిలో ఇప్పటివరకు 7.24 కోట్ల మంది ఫారమ్స్ సమర్పించగా, సరైన పరిశీలన, దర్యాప్తు లేకుండానే 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారని పేర్కన్నారు. సర్వే జరపలేదని ఈసీ కూడా తన అఫిడవిట్‌లో ఒప్పుకుందని ప్రస్తావించారు.
Read Also- Asia Cup squad: ఆసియా కప్‌కు ఎవరూ ఊహించని ప్లేయర్ దూరం!
65 లక్షల ఓట్ల తొలగింపు నిజమేనా?
న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు విన్న సుప్రీంకోర్టు, 65 లక్షల ఓట్ల తొలగించారని ఎలా నిర్ణయించారు? అని ప్రశ్నించారు. వాస్తవ లెక్కలే చెబుతున్నారా లేక ఊహాగానాల ఆధారంగా చెబుతున్నారా? అని కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ‘‘మీ ఆందోళన నిజమైనదా, ఊహాగానమా అనేది మేము తెలుసుకోవాలి’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా, పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన మరో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ, మృతులు లేదా వలస వెళ్లిన వివరాల జాబితాను కోర్టులో కానీ, వెబ్‌సైట్‌లో కానీ ఈసీ వెల్లడించలేదని ఆరోపించారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు మాత్రమే సమాచారం ఇచ్చామని చెబుతున్న ఈసీ, మిగతావారి ఇవ్వలేమంటోందని భూషణ్ పేర్కొన్నారు.
Read Also- Justice Yashwant Varma: జస్టిస్ వర్మ అభిశంసనపై లోక్‌సభ కీలక నిర్ణయం
ఆ బాధ్యత ఈసీదే
ఓటరుకు సంబంధించిన ఆధార్, రేషన్ కార్డు వంటి గుర్తింపు డాక్యుమెంట్లు ఇచ్చినపుడు, ఎలెక్షన్ కమిషన్ వాటిని తప్పనిసరిగా వెరిఫై చేయాల్సి ఉంటుందని న్యాయస్థానం చివరిగా స్పష్టం చేసింది. డాక్యుమెంట్లు ఇవ్వనప్పటికీ, సంబంధిత వ్యక్తికి ఆ విషయాన్ని తెలియజేయాలని, ఆ బాధ్యత ఈసీపైనే ఉందని కోర్టు స్పష్టం చేసింది. మొత్తంగా, పౌరసత్వానికి ఆధార్ తుది పౌరసత్వం కాదని చెప్పిన సుప్రీంకోర్టు, ఎలెక్షన్ కమిషన్ చర్యలు చట్టబద్ధమా కాదా? అనే అంశంపై మరింత పరిశీలన అవసరమని అభిప్రాయపడింది.