Amberpet SI: బెట్టింగుల్లో లక్షలు పోగొట్టుకున్న ఓ ఎస్ఐ హద్దులు మీరి ప్రవర్తించారు. అయిన అప్పుల నుంచి బయటపడటానికి రికవరీ చేసిన బంగారాన్ని అమ్ముకున్నాడు. అంతేకాదు సర్వీస్ పిస్టల్ కనిపించకుండా పోవటంతో దానిని కూడా అమ్మేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎస్ఐపై చర్యలకు ఉపక్రమించారు.
అసలేం జరిగిందంటే?
2020వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన భాను ప్రకాష్ అంబర్ పేట స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం నమోదైన ఓ చోరీ కేసులో నాలుగు తులాల బంగారాన్ని రికవరీ చేశారు. దానిని బాధితులకు ఇవ్వకుండా మీ బంగారం మీకు అప్పగిస్తానని చెప్పి వారితో లోక్ అదాలత్ లో కేసును క్లోజ్ చేయించారు. ఆ తర్వాత బంగారాన్ని ఎస్ఐ అమ్మేసుకున్నారు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో అతని మీద కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు.
గ్రూపు 2 ఉద్యోగం వచ్చిందని..
సస్పెండ్ అయిన తర్వాత ఎస్ఐ భాను ప్రకాష్ ఇటీవల అంబర్ పేట స్టేషన్ కు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రూపు 2 ఉద్యోగం వచ్చిందని చెప్పి అక్కడికి వెళ్లి ఉద్యోగంలో చేరనున్నట్టు తెలిపారు. స్టేషన్ లో ఉన్న తన వస్తువులను తీసుకోవడానికి వచ్చానని సిబ్బందిని నమ్మించారు. ఆ తర్వాత ఇన్ స్పెక్టర్ వద్దకు వెళ్లి తన డ్రాలో పెట్టిన 9ఎంఎం పిస్టల్ కనపడడం లేదన్నాడు. ఉలిక్కిపడ్డ సీఐ డ్రాలో వెతకగా బుల్లెట్ లు దొరికాయి. పిస్టల్ కనిపించలేదు. వెంటనే సీఐ సమాచారాన్ని పై అధికారులకు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దాంతో ఎస్ఐ భాను ప్రకాష్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా సంచలన విషయాలు బయట పడ్డాయి.
బెట్టింగుల్లో రూ.80 లక్షల అప్పు
ఎస్ఐగా చేరిన తర్వాత నుంచి భాను ప్రకాష్ ఎప్పుడూ డ్యూటీ సరిగ్గా చేయలేదని తెలుస్తోంది. గ్రూప్ 1, 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని తరచూ సెలవులు పెట్టేవాడని వెల్లడైంది. అయితే, నిజానికి బెట్టింగులకు అలవాటు పడి దాదాపు రూ.80 లక్షల వరకు భాను ప్రకాష్ పొగొట్టుకున్నాడని సమాచారం. ఈ క్రమంలో అప్పుల పాలై వాటి నుంచి బయట పడటానికి రికవరీ చేసిన బంగారం అమ్ముకున్నట్టు తెలిసింది. మరికొన్ని కేసుల్లో కూడా ఎస్ఐ ఇలాగే చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: KTR on BC Reservations: సీఎం రేవంత్ బీసీ ద్రోహి.. తడిగుడ్డతో గొంతు కోశారు.. కేటీఆర్ ఫైర్
పిస్టల్ ఏమైంది?
కాగా, తనకు ఇచ్చిన సర్వీస్ పిస్టల్ ను కూడా ఎస్ఐ అమ్ముకున్నాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భాను ప్రకాష్ మాత్రం ఆ పిస్టల్ గురించి తనకు తెలియదని, డ్రాలోనే పెట్టానని చెప్పినట్టు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు పెదవి విప్పటం లేదు. ప్రస్తుతం రికవరీ సోత్తును కొట్టేసిన దానిపై భాను ప్రకాష్ మీద అంబర్ పేట్ పోలీసులు కేసును నమోదు చేశారు. పిస్టల్ మిస్సింగ్ పై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదని సమాచారం.

