– గత ప్రభుత్వంలో కార్పొరేషన్ నిధులు పక్కదారి
– రికవరీ చేయాల్సిన సొమ్ముపై తాత్సారం
– ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకుని నిండా మునిగిన వైనం
– ఎండీ జేమ్స్ కలవల, ఇంజినీర్లు రమేష్ బాబు, కృష్ణ, గురుప్రసాద్
తీరుతో రూ.11 కోట్ల మొండి బకాయి, రూ.8 కోట్ల గోల్‌మాల్
– స్ట్రెఫా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌పై అంత ప్రేమ ఎందుకు?
– కేరళ ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముని రికవరీ చేయడంలో విఫలం
– డైరెక్టర్స్ చంద్రబాబు, సురేష్, రవీందర్, శ్రీకాంత్, ఉమా దేవీలపై
క్రిమినల్ కేసులకు వెనుకడుగు వేస్తున్న వ్యవసాయ శాఖ
– తాజాగా మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఉన్నతాధికారులు
– ఇప్పటికైనా ఇచ్చిన డబ్బులు వచ్చే దిశగా అడుగులు పడతాయా?
Telangana Rural Irrigation Corporation: బీఆర్ఎస్ ప్రభుత్వంలో వింత పొకడలకు లెక్కేలేదు. మన రాష్ట్రం కాకపోయినా, మనకు అవసరం లేకపోయినా, ఆంధ్రా ఓనర్స్ అయిన కంపెనీలకు కేరళలో పని చేసేందుకు డబ్బులు ఇచ్చింది తెలంగాణ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్. ఎంతోమంది ఉద్యోగులకు పీఎఫ్‌తో పాటు వారి సొంత సొమ్ముని కూడా థర్డ్ పార్టీల పేరుతో మొత్తం ఖాళీ చేసేశారు. ప్రభుత్వం మారినా ఆ అధికారులపై చర్యలు తీసుకోండి అని ఫిర్యాదులు చేసినా ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడడం లేదు. మాజీ ఎండీ జేమ్స్ కలవల ఏకపక్ష నిర్ణయంతో కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయనే ఆరోపణలు ఉన్నాయి.
అసలేం జరిగిందంటే?
కేరళ వాటర్(Kerala Water) అథారిటీ జల జీవన్ మిషన్ పేరుతో రూరల్ ఏరియాలో ఇంటింటికీ మంచి నీరు సప్లై చేసేలా కాంట్రాక్ట్స్ పిలించింది. అందుకు హైదరాబాద్‌కు చెందిన స్ట్రెఫా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ టెండర్లు దక్కించుకుంది. ఈ పని చేయడానికి తమకు అసక్తి ఉందని తెలంగాణ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్(Telangana Rural Irrigation Corporation) (ఆర్ఐసీ) ప్రతిపాదన పెట్టింది. దీంతో రూ.28 కోట్ల విలువ చేసే పనులు కార్పొరేషన్ తన సొంత సొమ్ముతో సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. వారికి పని చేసే కెపాసిటీ లేకపోయినా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేశారు. దీంతో మొత్తం రూ.28 కోట్ల బిల్స్ పని చేశామని టెండర్ కంపెనీ అయిన స్ట్రెఫాకు అందజేశారు. అయితే, ఆ కంపెనీ మాత్రం ఇప్పటి వరకు రూ.17 కోట్లు మాత్రమే చెల్లించింది మిగితా రూ.11 కోట్లు ఇచ్చేందుకు మొండికేసింది. ఎండీ జేమ్స్ కలవల రిటైర్డ్ అయ్యారు. మిగితా ఇంజినీర్లు ఎస్ఈ రమేష్ బాబు, డీఈ కృష్ణ, ఈఈ గురుప్రసాద్ గుట్టుచప్పుడు కాకుండా కథంతా నడిపించారు.
ఉద్యోగుల ఆందోళన
ఇటీవల ఆడిట్‌లో కోట్ల వ్యవహారమంతా ఉద్యోగులు గుర్తించారు. అందులో వారి పీఎఫ్ సొమ్ము కూడా ఉందని భావిస్తున్నారు. కార్పొరేషన్ నష్టాల్లో ఉంటే తమకు ఎక్కడ నుంచి సొమ్ము వస్తుందని అందోళన చెందుతున్నారు. ఇప్పటి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావుకి సమాచారం ఇవ్వగా, ఆయన మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు నాన్చిన వ్యవహారం ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టి ఆస్తులు సైతం జప్తు చేస్తారా? లేదా గత పాలనలో జరిగిందని కార్పొరేషన్‌పై జాలి చూపిస్తారా అంటూ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పుండుకు సమురు లేదుకాని తలకు సంపంగి నూనెలా వ్యవహారం
తెలంగాణలో ఈ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ (Telangana Rural Irrigation Corporation) ( అనేది ఒక్కటి ఉందని చాలామందికి తెలియదు. కానీ, స్ట్రెఫా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.28 కోట్లు మేలు చేసేలా ముందస్తుగా డబ్బులు ఖర్చు చేసి పనులు చేసింది. అందులో వాళ్లు నేరుగా చేస్తే లాభాలు వచ్చేవి. అలా కాకుండా థర్డ్ పార్టీకి ఇవ్వడంతో పనుల్లో రూ.8 కోట్ల గోల్ మాల్ ఇంజినీర్స్, మాజీ ఎండీ జేమ్స్ కలిసి చేశారు. దీనికి తోడుగా రూ.28 కోట్లు ఇవ్వాల్సిన సొమ్ము రూ.17 కోట్లు మాత్రమే ఇవ్వడంతో ఇంకా రావాల్సిన రూ.11 కోట్లకు ఆ కంపెనీ మొండికేసింది. ఇప్పుడు ఆ కంపెనీకి కేరళ ప్రభుత్వానికి అక్కడి కోర్టుల్లో రోడ్డు కట్టింగ్‌తో పాటు టెండర్స్‌లో అవకతవకలపై కోర్టులో పిటిషన్స్ వేసుకున్నారు. ఇదంతా మన రాష్ట్రం కాని పనులకు వెళ్లి చేసి వింతగా వ్యవహరించడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అధికారులు చర్యలు తీసుకుని ఉద్యోగులపై అటు కాంట్రాక్టర్స్‌పై కేసులు నమోదు చేసి మనీ రికవరీ చేయాల్సిన అవసరం ఉన్నది.
Also Read: SC on Aadhar card: పౌరసత్వానికి ‘ఆధార్ ప్రూఫ్ కాదు’.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు