Forest Land
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Metal Powder Company: ధరణితో దోచుకో.. భూ భారతితో దాచుకో.. ఫారెస్ట్‌లో పాగా వేసుకో!

  • మెటల్ పౌడర్ ఫ్యాక్టరీ భూముల మాయాజాలం
  • తప్పుడు సర్వే నెంబర్స్ ఇచ్చి పీసీబీ అనుమతులు
  • చింతలపాలెం మండలంలో చిత్తయిన రెవెన్యూ రికార్డులు
  • అటవీ భూములను కాజేస్తున్న బడా కంపెనీలు
  • భూ మాయలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరులు?
  • సహకరిస్తున్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు?
  • హుజూర్‌నగర్‌ పరిధిలోని కంపెనీల మాటున భూ కహానీలేంటి?
  • పులిచింతల పేరుతో ఇచ్చిపుచ్చుకున్న భూములెన్ని?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఎడిటర్


Metal Powder Company: ‘‘తమిళ కంపెనీకి లాభాలు.. మనకు రోగాలు’’ అంటూ హుజూర్‌నగర్ వెల్లటూరు గ్రామంలో జరుగుతున్న బాగోతాన్ని జూలై 5న ‘స్వేచ్ఛ’ బయటపెట్టింది. ‘స్వేచ్ఛ’ కథనంతో సదరు కంపెనీ ప్రతినిధుల్లో భయం మొదలై, తమను తాము సమర్ధించుకుంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. పీసీబీ అనుమతులు లేకుండానే పనులు చేస్తున్నామని చెప్పారు. ఆరెంజ్ క్యాటగిరి కంపెనీ కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని బుకాయించారు. కానీ, ఆ కంపెనీపై ఇన్వెస్టిగేషన్ చేస్తే రెడ్ క్యాటగిరి జోన్‌లోకి వస్తున్నది. పీసీబీ నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకునేందుకు కన్సెంట్ ఆర్డర్ 2023 సెప్టెంబర్ 27న తీసుకున్నారు. ఇవన్నీ చెబితే సమస్యలు తప్పవని సిబ్బంది, పీసీబీ అధికారులు దాచిపెట్టారు. రెవెన్యూ అధికారులకు వాటిపై అసలు పట్టే లేదు. దీంతో వీళ్లంతా రాజకీయ నాయకుల అనుచరులు చెప్పిందే నమ్మేస్తూ ఇష్టానుసారంగా అటవీ భూముల్లో దందా చేస్తున్నారు.

ధరణి మాటున దోపిడీ


బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి మాటున వందల ఎకరాలు దోచేశారు. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన భూ భారతిలో వాటిని దాచేశారు. వెల్లటూరు పులిచింతల ప్రాజెక్ట్ కింద గ్రామం మొత్తమే ఖాళీ చేసి వెళ్లిపోయింది. అక్కడ అమ్రావాడి అనే ఇంటిపేరు ఉన్న వాళ్లకు వందల ఎకరాల భూమి ఉండేది. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. కొంత రైతులకు అసైన్డ్ చేశారు. మరికొంత భూమి ప్రభుత్వంతో పాటు ఫారెస్ట్‌లోకి వెళ్లిపోయింది. ఆ భూముల్లో విలువైన ఖనిజ సంపద, పక్కనే కృష్ణానది, రవాణాకు వీలుగా నేషనల్ హైవే, జన సంచారం తక్కువ, దీంతో భూ భకాసురులు రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోయారు. భూ స్వాముల పేర్లతో 2004లో ఈ భూములపై పడ్డారు. లంబాడాల భూములను సైతం లాక్కున్నారని ఆరోపణలు ఉన్నాయి. సర్వే నెంబర్ 488 సేల్ డీడ్‌ల ప్రకారం వారు 65 ఎకరాల వరకు అమ్ముకున్నారు. ఆ తర్వాత కూడా రికార్డులు పుట్టుకొచ్చాయి. బై నెంబర్స్ వేసుకుని ఇష్టానుసారంగా అటవీ భూముల్లోకి వెళ్లిపోయారు. రైతులకు అసైన్డ్ చేసిన భూములు ప్రాజెక్ట్ పేరుతో పరిహారం తీసుకుని ధరణి పేరుతో మళ్లీ కొత్త రికార్డులు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆ భూములు వాళ్లు చెబితే కానీ కనిపించవు. అన్ లైన్ పబ్లిక్ డోమైన్‌లో ఉండవు. ధరణి మాదిరిగానే భూ భారతిలో కనిపించవు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బంధువు గుండా బ్రహ్మారెడ్డితో పాటు అనుచరులు దోచేశారు. ఇప్పుడు అదే బ్రహ్మారెడ్డి ఓ కాంగ్రెస్ కీలక నేతకు కుడి భుజాల్లో ఒకడిగా ఉంటూ ఏ అధికారినీ అటు వైపు చూడకుండా చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read Also- Gold Rates (11-07-2025): మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?

14 ఎకరాల్లో అక్రమ రికార్డులు.. 47 ఎకరాలు కబ్జా?

చింతలపాలెం మండలంలో భూ మాయాజాలనికి ఇదో ఉదాహరణ. పొల్యుషన్ కంట్రోల్ బోర్డుకు ది మెటల్ పౌడర్ కంపెనీ లిమిటెడ్ వెల్లటూరులోని సర్వే నెంబర్ 488/7/1, 488/7/3, 488/7/5, 488/7/6, 488/7/8, 488/7/9, 488/25లో 47 ఎకరాల 30 గుంటలు ఉన్నట్లు చూపించుకుంది. అదే విస్తరణలో నిర్మాణం చేపడుతున్నారు. ఈ భూ వివరాలు భూ భారతిలో కనిపించడం లేదు. ఈ కంపెనీకి చెందిన సర్వే నెంబర్ 488/26 లో మాత్రం 14 ఎకరాలు నాలా కన్వర్షన్ చేసుకున్నట్లు కనిపిస్తున్నది. అయితే, ఇది ఎవరి వద్ద నుంచి తీసుకున్నారో రెవెన్యూ అధికారులకు కూడా ఈసీ కనపడడం లేదు. పీసీబీ అధికారులు హద్దులు గుర్తిస్తూ నార్త్, వెస్ట్ అంజనీ సిమెంట్ కంపెనీ టు పులిచింతల ప్రాజెక్ట్ రోడ్డు, సౌత్, ఈస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ అని గుర్తించారు. రెడ్ క్యాటగిరీ ఉన్నా చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రజలతో ప్రజాభిప్రాయం తీసుకోలేదు. ఇక్కడ ఉన్న వేస్టేజీ అంతా మేడ్చల్ దుండిగల్‌కు తీసుకొచ్చేలా అధికారులు కండిషన్స్‌తో కూడిన ప్రాథమిక అనుమతులు ఇచ్చారు. అయితే, ఈ ల్యాండ్ టైటిల్ ఎలా వచ్చిందో అంతుచిక్కడం లేదు. బ్రహ్మారెడ్డి నుంచి వివరాలు సేకరించేందుకు ‘స్వేచ్ఛ’ ఫోన్ చేసి అడుగగా, ‘‘మీరు రాసేశారు కదా రాసుకోండి. ఇప్పుడు నేనెందుకు సమాధానం చెబుతాను. ఎవరు అమ్మారో వాళ్లను అడగండి’’ అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఇక, రెవెన్యూ అధికారులు ధరణి వచ్చిన తర్వాత అంతా ఆన్‌లైన్ లోనే ఉంటుంది. తమకు కూడా ఖాతా నెంబర్ 60499 పైన ఎలాంటి రికార్డులు కనిపించడం లేదని వివరణ ఇచ్చారు.

మామూళ్ల మత్తులో ఫారెస్ట్ అధికారులు

వన మహోత్సవం అంటూ కాంగ్రెస్ సర్కార్ చెట్లను, అడవులను పెంచేలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది. కానీ, అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో ఏ ఫారెస్ట్ కంపార్ట్‌మెంట్‌లో ఎంత భూమి ఉంది. హద్దులు ఏంటని గుర్తించలేక దోచుకునేందుకు దోహదపడుతున్నారు. చింతలపాలెం మండలంతో పాటు, నాగార్జున సాగర్ దిగవ నుంచి పులిచింతల ప్రాజెక్ట్ వరకు ఫారెస్ట్ భూములు కంపెనీల పాలు అవుతున్నాయి. దొంగ పత్రాలు సృష్టించి వందల ఎకరాలు కొల్లగొడుతున్నారు. వీటన్నింటిపై ‘స్వేచ్ఛ’ వరుస కథనాలు ఇవ్వబోతున్నది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేత అడ్డగోలు వ్యవహారాలు ఇంకా కొనసాగుతుండడంపై స్వేచ్ఛాయుతంగా వార్తలు వస్తూనే ఉంటాయి.

Read Also-Bandi Sanjay: టీటీడీ ఏమైనా సత్రమా.. అన్యమతస్తులను తొలగించరా.. ఏపీ సర్కార్‌పై బండి ఫైర్!

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు