Sreenivasan Death: మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీనివాసన్ (68) కన్నుమూశారు. నటుడిగా, కథా రచయితగా, దర్శకుడిగా మరియు నిర్మాతగా నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన అందించిన సేవలు అజరామరం. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన, కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని దక్షిణ భారత సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది.
Read also-Bigg Boss9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసిన ‘ది రాజాసాబ్’ హీరోయిన్.. హారర్ర్ ఎవరంటే?
సహజత్వానికి..
శ్రీనివాసన్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, మలయాళ మధ్యతరగతి జీవితాల ప్రతిబింబం. గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే, సామాన్యుడి వేషధారణతో, పక్కింటి అబ్బాయిలా కనిపించే పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన రాసిన కథల్లో వ్యంగ్యం, హాస్యం, సామాజిక స్పృహ మెండుగా ఉండేవి. సమాజంలోని కుళ్లును, రాజకీయ వ్యవస్థలోని లోపాలను తన కలంతో సున్నితంగా విమర్శించేవారు.
మోహన్ లాల్‌తో అద్భుతమైన కాంబినేషన్
మలయాళ సినిమాలో శ్రీనివాసన్, సూపర్‌స్టార్ మోహన్ లాల్ కాంబినేషన్ ఒక సంచలనం. వీరిద్దరూ కలిసి నటించిన ‘నాడోడిక్కట్టు’, ‘పట్టనప్రవేశం’, ‘అక్కిరే అక్కిరే అక్కిరే’ వంటి చిత్రాలు కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచాయి. అందులో వారు పోషించిన ‘దాసన్ – విజయన్’ అనే నిరుద్యోగ యువకుల పాత్రలు ఇప్పటికీ కేరళలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. రచయితగా ఆయన అందించిన ‘సందేశం’ సినిమా మలయాళ చిత్ర చరిత్రలోనే అత్యుత్తమ రాజకీయ వ్యంగ్య చిత్రంగా నిలిచింది. దర్శకుడిగా ఆయన రూపొందించిన ‘చింతవిశిష్టయాయ శ్యామల’ సినిమాకు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది.
Read also-Vrushabha Trailer: కింగ్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ ఇరగదీశాడు.. ‘వృషభ’ ట్రైలర్ వచ్చేసింది చూశారా?
గాంధీనగర్ 2nd స్ట్రీట్, వరువేల్, మణిచిత్రతాజు, ఉదయనాను తారమ్ ఆయన నుంచి వచ్చిన అపురూప చిత్రాలు. అనేక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతో పాటు, కథా రచయితగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేరళలోని కన్నూర్ జిల్లాలో జన్మించిన శ్రీనివాసన్, చెన్నైలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని కుమారులు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ కూడా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. వినీత్ ఇప్పటికే స్టార్ డైరెక్టర్‌గా, నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీనివాసన్ భౌతిక కాయానికి కేరళ ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మలయాళీలు తమ ఇంట్లోని వ్యక్తిని కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. ఆయన రాసిన డైలాగులు, సృష్టించిన హాస్య సన్నివేశాలు తరతరాల వరకు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. తన అద్భుతమైన రచనలతో, నటనతో సామాన్యుడిని సైతం ఆలోచింపజేసిన ఈ మహానటుడికి సినిమా ఉన్నంత కాలం గుర్తింపు ఉంటుందని సీని ప్రముఖులు కీర్తిస్తున్నారు.

